Book of Common Prayer
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16 ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18 దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
మీరు ఆయన సేవకులు,
దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
జెకర్యా మరియు ఎలీసబేతు
5 హేరోదు[a] రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా[b] అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు. 6 ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు, 7 ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.
8 తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు. 9 దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు. 10 అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు.
11 ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు. 12 జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. 13 దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి. 14 ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు. 15 అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ[c] ఉంటాడు.
16 “ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు. 17 తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో[d] ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు.
18 జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగుతుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాణ్ణి. నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు.
19 దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో మాట్లాడి నీకి సువార్త చెప్పుమని దేవుడు నన్ను పంపాడు. 20 జాగ్రత్త! నీవు నా మాటలు నమ్మటం లేదు కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక నా మాటలు నిజమౌతాయి. అంతవరకు నీకు మాటలు రావు.”
21 బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతవరకు ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు. 22 జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు. 23 సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు.
© 1997 Bible League International