Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 26

దావీదు కీర్తన.

26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
    యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
    నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
    నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
పనికిమాలిన ఆ మనుష్యుల్లో
    నేను ఒకడ్ని కాను.
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
    ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
    నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
    నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
    మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
    ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
    చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
    కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
    యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

కీర్తనలు. 28

దావీదు కీర్తన.

28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
    నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
    అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
    నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
    ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
    కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
    ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
    ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
    వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.

యెహోవాను స్తుతించండి.
    కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
    నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
    మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.

దేవా, నీ ప్రజలను రక్షించుము.
    నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
    కాపరిలా వారిని నిత్యం నడిపించుము.

కీర్తనలు. 36

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.

36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
    అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
    ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
    కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
    అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
    అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
    ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.

యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
    నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
    నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
    కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
    అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
    నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
    నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
    దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.

12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
    “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
    వారు చితుకగొట్టబడ్డారు.
    వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”

కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

ద్వితీయోపదేశకాండము 4:15-24

15 “హోరేబు (సీనాయి) కొండమీద ఆగ్నిలో నుండి యెహోవా మీతో మాట్లాడిన రోజున భౌతిక మైన ఎలాంటి రూపంతోను మీరు ఆయనను చూడలేదు. దేవునికి ఆకారం లేదు. 16 కనుక జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రాణి రూపంలోనైనా ఒక ప్రతిమను లేక విగ్రహాన్ని చేసుకోవడం ద్వారా పాపంచేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. పురుషునివలె లేక స్త్రీవలె కనబడే విగ్రహాన్ని చేయవద్దు. 17 భూమిమీద జంతువులా కనబడే విగ్రహాన్నిగాని, ఆకాశంలో ఎగిరే పక్షిలాంటి విగ్రహంగాని చేయవద్దు. 18 నేలమీద ప్రాకే దేనివలెగాని, సముద్రపు చేపవలెగాని కనబడే ఏ విగ్రహం చేయవద్దు, 19 మరియు మీరు పైన ఆకాశంలోనికి చూచినప్పుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆకాశంలో మీకు కనిపించే వాటన్నింటిని చూచినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటిని పూజించి, సేవించాలనే శోధన మీకు కలుగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలో ఆ పనులు ఇతరులు చేస్తే చేసుకోనిచ్చాడు మీ దేవుడైన యెహోవా. 20 ఆయితే మీరు ఆయన ప్రజలు, యెహోవా మిమ్మును ఉజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఈజిప్టు ఇనుప కొలిమిలాంటిది. ఇప్పుడు మీరు ఉన్నట్టుగా, మిమ్మును ఆయన తన స్వంత ప్రజలుగా చేసేందుకు ఆయన మిమ్మును బయటకు తీసుకొని వచ్చాడు.

21 “మీ మూలంగా యెహోవా నా మీద కొపగించాడు. ఆయన ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. నేను యొర్దాను నది దాటి అవతలికి వెళ్లకూడదు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఆ మంచి దేశంలోనికి నేను వెళ్లజాలనని ఆయన నాతో చెప్పాడు. 22 కనుక నేను యిక్కడ ఈ దేశంలోనే చావాలి. నేను యొర్దాను నది దాటి వెళ్లలేను. కానీ మీరు మాత్రం త్వరలోనే దాటి వెళ్లి, మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. 23 మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ఒడంబడికను మీరు మరచి పోకుండా ఆ కొత్త దేశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయకూడదని మీ యెహోవా దేవుడు మీతో చెప్పిన ఏ రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయకూడదు. 24 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించడం అసహ్యించుకొంటాడు. పైగా యెహోవా నాశనం చేసే అగ్నిలా ఉండగలడు.

2 కొరింథీయులకు 1:12-22

పౌలు ఉద్దేశం మారుట

12 మేము ఈ ప్రపంచంలో నిజాయితీగా, సదుద్దేశాలతో జీవిస్తున్నాము. ముఖ్యంగా మీకోసం చేసినవి సదుద్దేశంతో చేసాము. మేము చేసినవన్నీ దేవుని దయవల్ల సంభవించాయి. ఇది మానవ ప్రయత్నంవల్ల సంభవించ లేదు. ఇది నిజమని మా అంతరాత్మలు చెపుతున్నాయి. ఇది మేము గర్వించదగ్గ విషయం. 13 మేము మీరు చదవ కలిగింది, అర్థం చేసుకోగలిగింది మాత్రమే వ్రాస్తున్నాము. 14 మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకొన్నారు. మున్ముందు పూర్తిగా అర్థం చేసుకొంటారని ఆశిస్తున్నాను. యేసు ప్రభువు వచ్చిన రోజు, మీ కారణంగా మేము గర్విస్తున్నట్లే, మా కారణంగా మీరు గర్వించ కలుగుతారు.

15 నాకు ఈ విషయంలో నమ్మకం ఉంది. కనుకనే మీకు రెండుసార్లు లాభం కలగాలని నేను మొదట మిమ్మల్ని దర్శించాలని అనుకొన్నాను. 16 మాసిదోనియకు వెళ్ళే ముందు, తిరిగి వచ్చేముందు మీ దగ్గరకు రావాలనుకొన్నాను. అక్కడి నుండి నేను యూదయకు వెళ్ళేటప్పుడు మీ నుండి సహాయం లభిస్తుందని ఆశిస్తున్నాను. 17 నేను ఈ ఏర్పాట్లు ఆలోచించకుండా చేసానని అనుకొంటున్నారా? నేను అందరిలా ఒకసారి “ఔను” అని, ఒకసారి “కాదు” అని అనను.

18 దేవుని సాక్షిగా చెపుతున్నాను. మీకు బోధించిన విషయంలో “ఔను”, “కాదు” అనే ప్రశ్నే లేదు. 19 నేను, సిల్వాను, తిమోతి మీకు బోధించిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు “ఔను”, “కాదు” అని అనలేదు. ఆయన అన్నివేళలా “ఔను” అని అన్నాడు. 20 దేవుడు క్రీస్తునందు చేసిన ఎన్ని వాగ్దానాలైనను “ఔను” అని అన్నట్లుగానే ఉన్నవి. అందువల్ల యేసు క్రీస్తు ద్వారా మనము “ఆమేన్” అని అంటున్నాము. ఇలా అని దేవునికి మహిమ కలిగిస్తున్నాము. 21 దేవుడు మనకు, అంటే మీకు, మాకు క్రీస్తు పట్ల ధృఢవిశ్వాసము ఉండేటట్లు చేస్తున్నాడు. మనకు అభిషేకమిచ్చినవాడు దేవుడు. 22 దేవుడు మనము తనవాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు. తన ఆత్మను రానున్నదానికి హామీగా మన గుండెల్లో ఉంచాడు.

లూకా 15:1-10

తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం

(మత్తయి 18:12-14)

15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.

అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.

“ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. 10 నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International