Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 25

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.
    కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే
    అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.
    అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.
    ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.
    ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.
    నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.
    నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.
    నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,
    నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను.
    కనుక నన్ను కాపాడుము.
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

కీర్తనలు. 9

సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.

పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
    యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
    మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
    కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.

నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
    యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
    యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
    బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
శత్రువు పని అంతం అయిపోయింది.
    యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
    ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
    ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
    యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
    గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
    యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

10 నీ నామం తెలిసిన ప్రజలు
    నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
    సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
    యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
    ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
    మరి యెహోవా వారిని మరచిపోలేదు.

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
    నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
    ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
    నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
    కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
    ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
    కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
    యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
    ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
    కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
    వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
    వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

కీర్తనలు. 15

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

ద్వితీయోపదేశకాండము 4:9-14

కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసిన సంగతులను మీరు బ్రతికి ఉన్నంతకాలం మరచి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు, మీ పిల్లలపిల్లలకు మీరు ఈ సంగతులను ప్రబోధించాలి. 10 హోరేబు కొండ దగ్గర మీరు మీ దోవుడైన యెహోవా యెదుట నిలిచిన రోజును జ్ఞాపకం చేసుకోండి. ‘నేను చెప్పే సంగతులు వినడానికి ప్రజలందరినీ సమావేశపర్చు. అప్పుడు భూమి మీద వారు జీవించినంతకాలం వారు గౌరవించటం నేర్చుకొంటారు. మరియు వారు ఈ సంగతులను వారి పిల్లలకు ప్రబోధిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు. 11 మీరు దగ్గరకు వచ్చి కొండ దిగువ నిలబడ్డారు. ఆకాశంవరకు ఎగసిన అగ్నితో ఆ కొండ మండింది. దట్టమైన కారుమబ్బులు, కటిక చీకటి. 12 అప్పుడు అగ్నిలోనుండి యెహోవా మీతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడుతున్న స్వరం మీరు విన్నారు కాని, ఏ ఆకారాన్నీ మీరు చూడలేదు. స్వరం మాత్రమే వినబడింది. 13 యెహోవా తన ఒడంబడికను మీతో చెప్పాడు. పది ఆజ్ఞలను ఆయన మీతో చెప్పి, వాటిని పాటించ మని మీకు ఆజ్ఞాపించాడు. ఆ ఒడంబడిక ఆజ్ఞలను ఆయన రెండు రాతి పలకలమీద రాసాడు. 14 ఆ సమయంలో నేను మీకు ఆజ్ఞలను, నియమాలను ప్రబోధించాలనికూడ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. మీరు స్వాధీనం చేసుకొని, నివసించబోతున్న దేశంలో మీరు పాటించాల్సిన చట్టాలు ఇవి.

2 కొరింథీయులకు 1:1-11

దైవేచ్ఛ వల్ల యేసు క్రీస్తు అపొస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు.

మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించాలని కోరుతున్నాను.

దేవునికి వందనాలు చెల్లించుట

మన యేసు క్రీస్తు ప్రభువును, తండ్రియైన దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన మన కష్టాలు తొలగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం. క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. మీకు సహాయం చెయ్యాలని, రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది. నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకొన్నట్లుగానే, మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకొంటారని మాకు తెలుసు.

మేము ఆసియ ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. మా మనస్సులకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోరాదని, చనిపోయినవాళ్ళను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. 10 దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు ఆయన పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. 11 మీరు ప్రార్థించి మాకు సహాయం చెయ్యాలి. ఎంతమంది ప్రార్థిస్తే దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు మాకు ఆ సహాయం చేసాక, అందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం కలుగుతుంది.

లూకా 14:25-35

నన్ను వెంబడించగలవేమో తీర్మానించుకొనుము

(మత్తయి 10:37-38)

25 ప్రజలు గుంపులు గుంపులుగా యేసుతో ప్రయాణం చేస్తూవున్నారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, 26 “నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. 27 అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు.

28 “గోపురం కట్టాలనుకొన్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమౌతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా? 29-30 పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు.

31 “అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన పదివేల సైన్యంతో యుద్దం చేయబోతున్న ఇరవై వేల సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా? 32 యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకొంటాడు.

33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.

నీ గోప్పతనమును పోగొట్టుకొనవద్దు

(మత్తయి 5:13; మార్కు 9:50)

34 “ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే దాన్ని మళ్ళీ ఉప్పుగా ఎట్లా చెయ్యగలము? 35 అది పెంట కుప్పుకు పనికి రాదు. పొలానికి పనికి రాదు. దాన్ని పారవేయవలసి వస్తుంది.

“చెప్పిన వాటిని జాగ్రత్తగా గమనించండి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International