Book of Common Prayer
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
3 అప్పుడు మోషే పర్వతం[a] మీద దేవుడి దగ్గరకు వెళ్లాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, అతనితో దేవుడు ఇలా చెప్పాడు. “యాకోబు మహా వంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు: 4 ‘నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూసారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేసానో మీరు చూసారు. పక్షిరాజువలె[b] నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి, నా దగ్గరకు, ఇక్కడికి తీసుకొచ్చాను. 5 కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే, మీరు వా ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు. 6 మీరు ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యంగా మీరు ఉంటారు.’ మోషే, నేను నీతో చెప్పిన ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి.”
7 కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు. 8 ప్రజలంతా కలిసి మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ మేము విధేయులం” అని వారు చెప్పారు.
తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు.
16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు. 17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు. 18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది. 19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.
20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.
4 మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. 5 మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. 6 ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు:
“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను!
పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది.
ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”(A)
7 ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు:
“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన
రాయి మూలకు తలరాయి అయింది.”(B)
8 మరొక చోట యిలా వ్రాయబడి ఉంది:
“ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది.
ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.”(C)
దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.
9 కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.
10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
కాని యిప్పుడు లభించింది.
© 1997 Bible League International