Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 89

ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.

89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
    ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
    నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!

దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
    నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
    నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”

యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
    పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
    “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
    ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
    వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
    మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
    దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
    నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
    ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
    తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
    నీ శక్తి గొప్పది!
    విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
    ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
    వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
    వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
    వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
    ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
    నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
    మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
    దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
    ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
    నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
    నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
    అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
    భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
    అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
    నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
    నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
    నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
    మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
    మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37     చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”

38 కాని దేవా, ఏర్పరచబడిన నీ రాజు[b] మీద నీకు కోపం వచ్చింది.
    నీవు అతన్ని ఒంటరివానిగా విడిచి పెట్టావు.
39 నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు.
    రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.
40 రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు.
    అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.
41 రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు.
    దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.
42 రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు.
    అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.
43 దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు.
    నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.
44 అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
45 అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు.
    నీవు అతన్ని అవమానించావు.

46 యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా?
    నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా?
    ఎంత కాలం యిలా సాగుతుంది?
47 నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము.
    అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
48 ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు.
    ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.

49 దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ?
    దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.
50-51 ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము.
యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది.
    ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.

52 యెహోవాను శాశ్వతంగా స్తుతించండి.
ఆమేన్, ఆమేన్![c]

యెహెజ్కేలు 4

యెరూషలేము దాడిని గూర్చి హెచ్చరికలు

“నరపుత్రుడా, ఒక ఇటుక తీసుకొని దానిమీద ఒక బొమ్మ గియ్యి. యెరూషలేము నగరపు బొమ్మ వేయుము. నీవా నగరాన్ని ముట్టుడించే సైన్యంలాగా చిత్రీకరించు. నగరాన్ని తేలికగా పట్టుకొనేటందుకు అనువుగా దానిచుట్టూ ఒక మట్టిగోడ నిర్మించు. నగరపు గోడవరకు ఒక మట్టి రహదారి వేయుము. సమ్మెటల్ని (ముఖ్య నాయకుల్ని) తెప్పించి, నగరం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయండి. పిమ్మట ఒక ఇనుప పెనము తీసుకొని దానిని నీకు, నగరానికి మధ్య ఉంచు. అది నిన్ను, నగరాన్ని వేరుచేసే ఇనుప గోడలా ఉంటుంది. ఈ రకంగా నీవా నగరానికి వ్యతిరేకంగా వున్నట్లు నీవు చూపిస్తావు. నీవా నగరాన్ని చుట్టుముట్టి దానిపై దాడి చేస్తున్నట్లు వుంటుంది. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఇది ఒక ఉదాహరణగా వుంటుంది. (దేవుడనైన) నేను యెరూషలేమును నాశనం చేస్తానని అది నిరూపిస్తుంది.

“తరువాత నీవు ఎడమ ప్రక్కకి పడుకో, ఇశ్రాయేలీయుల పాపాలన్నీ నీవు భరిస్తున్నట్లు నిరూపించే విధంగా నీవాపని చేయాలి. నీవు ఎడమ ప్రక్కన ఎన్నాళ్లు పడుకొని ఉంటే అన్నాళ్లు నీవా పాపాలను మోస్తావు. నీవు వారి పాపాన్ని మూడు వందల తొంభై రోజులు[a] భరించాలి. ఈ ప్రకారం ఇశ్రాయేలు ఎంతకాలం శిక్షింపబడుతుందో నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు ఒక్క సంవత్సరానికి సమానం.

“ఆ తరువాత నీవు కుడి ప్రక్కకి తిరిగి నలభై రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను.”

దేవుడు మళ్లీ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇప్పుడు నీవు నీ చొక్కా చేతిని పైకి మడిచి, ఆ ఇటుక మీదికి నా చేతినెత్తు. యెరూషలేము నగరంపై దాడి చేస్తున్నట్లు నీవు ప్రవర్తించు. నీవు నా తరఫు దూతగా మాట్లాడుతున్నట్లు చూపటానికి ఈ విధంగా చేయుము. ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు తాళ్లతో కట్టుతున్నాను. నగరంపై నీ దాడి పూర్తయ్యేవరకు నీవు అటు, ఇటు కదలలేవు.”

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “రొట్టె చేయటానికి నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ కలిపి రోటిలో వేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని ఉపయోగించి రొట్టె చేయుము. నీవు ప్రక్కకు తిరిగి పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ రొట్టెనే తినాలి. 10 రొట్టెను చేయటానికి ఈ పిండిని రోజుకు ఒక గిన్నెడు (సుమారు ఇరవై తులాలు) మాత్రమే ఉపయోగించటానికి నీకు అనుమతి ఇవ్వబడింది. అవసరమైనప్పుడల్లా రోజంతా ఆ రొట్టెనే నీవు తినాలి. 11 ప్రతి రోజూ మూడు గిన్నెల నీరే నీవు తాగాలి. రోజంతా తగిన సమయానికి దానిని తాగాలి. 12 ప్రతిరోజూ నీ రొట్టెను నీవే చేసుకోవాలి. నీవు మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. మండే ఆ మనుష్యుల మలం మీద నీవు ఆ రొట్టెను కాల్చాలి. ప్రజల ఎదుట ఈ రొట్టెనే నీవు కాల్చితినాలి.” 13 మళ్లీ యెహోవా ఇలా చెప్పాడు: “ఈ పని చేయటం ద్వారా ఇశ్రాయేలు వంశీయులు పరాయి దేశాలలో అపరిశుభ్రమైన రొట్టెలు[b] తింటారని నీవు సూచిస్తావు. వారు ఇశ్రాయేలు వదిలి అన్యదేశాలకు పోయేలా నేను వారిని ఒత్తిడి చేశాను!”

14 అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.”

15 అందుకు దేవుడీలా అన్నాడు: “సరే! నీ రొట్టెను కాల్చటానికి ఎండిన ఆవుపేడ ఉపయోగించేటందుకు నీకు అనుమతి ఇస్తున్నాను. ఎండిన మనిషి మలం నీవు వినియోగించనవసరం లేదు.”

16 దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “నరపుత్రుడా, యెరూషలేముకు ఆహార పదార్థాల సరఫరాను నిలిపి వేస్తున్నాను. అందువల్ల ప్రజలు తగుమాత్రం రొట్టె తినవలసి వస్తుంది. వారి ఆహార పదార్థాల సరఫరా విషయమై వారు మిక్కిలి చింతిస్తారు. వారికి తాగే నీరు కూడా పరిమితమవుతుంది. ఆ నీటిని తాగినప్పుడు వారు మిక్కిలి భీతిల్లుతారు. 17 ఎందువల్లనంటే ప్రజలకు తినటానికి తిండి, తాగటానికి నీరు తగినంత ఉండదు. ప్రజలు ఒకరిని చూచి ఒకరు భయ కంపితులవుతారు. వారివారి పాపాల కారణంగా వారు చిక్కి శల్యాలైపోతారు.

హెబ్రీయులకు 6:1-12

అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన ప్రాథమిక పాఠాలను చర్చించటం మాని ముందుకు వెళ్తూ పరిపూర్ణత చెందుదాం. ఘోరమైన తప్పులు చేసి మారుమనస్సు పొందటం, దేవుని పట్ల విశ్వాసం, బాప్తిస్మమును[a] గురించి బోధించటం, చేతులు తల మీద ఉంచి అభిషేకించటం, చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతికి రావటం, శాశ్వతమైన తీర్పు, యివి మన పునాదులు. ఈ పునాదుల్ని మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉందాం. దేవుడు సమ్మతిస్తే అలాగే జరుగుతుంది.

ఒకసారి వెలిగింపబడినవాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసినవాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్నవాళ్ళు, దైవసందేశం యొక్క మంచితనాన్ని రుచి చూసినవాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచినవాళ్ళు పడిపోతే మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగురిలో అవమానపరుస్తున్నారు.

తన మీద తరుచుగా పడ్తున్న వర్షాన్ని పీల్చుకొనే భూమి, తనను దున్నిన రైతులకు పంటనిచ్చిన భూమి దేవుని ఆశీస్సులు పొందుతుంది. కాని, ముళ్ళ మొక్కలు, కలుపుమొక్కలతో పెరిగే భూమి నిరుపయోగమైనది. అలాంటి భూమిని దేవుడు శపిస్తాడు. చివరకు దాన్ని కాల్చి వేస్తాడు.

ప్రియమైన సోదరులారా! మేము మాట్లాడుతున్న ఈ రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు మంచి కలుగుతుందనే విశ్వాసం మాకుంది. 10 దేవుడు అన్యాయం చెయ్యడు. మీరు దేవుని ప్రజలకు సహాయం చేసారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన కార్యాలను మీరాయన పట్ల చూపిన ప్రేమను ఆయన మరిచిపోడు. 11 మీ నిరీక్షణ సంపూర్ణమగునట్లుగా మీలో ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన ఆసక్తి చివరివరకు చూపాలి. 12 మీరు సోమరులుగా నుండకూడదు. కాని వాగ్దానము చేయబడినదానిని విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందినవారిని అనుసరించండి.

లూకా 9:51-62

విశ్వసించని గ్రామము

51 ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. 52 తన దూతల్ని తనకన్నా ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్దం చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళ్ళారు. 53 ఆ వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయనకు స్వాగతమివ్వలేదు. 54 ఆయన శిష్యులలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, “ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటారా?” అని అడిగారు.

55 యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు.[a] 56 అక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళ్ళారు.

యేసును వెంబడించటం

(మత్తయి 8:19-22)

57 వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, “మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.

58 యేసు, “నక్కలు నివసించటానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం లేదు” అని అన్నాడు.

59 యేసు యింకొకనితో, “నా వెంట రా!” అని అన్నాడు.

కాని అతడు, “ప్రభూ! నేను వెళ్ళి ముందు నా తండ్రిని సమాధి చేసి రానివ్వండి!” అని అన్నాడు.

60 యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు” అని అన్నాడు.

61 ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుసరిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి రానివ్వండి” అని అన్నాడు.

62 అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International