Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 106

106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
    ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.

యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
    నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
    నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.

మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
    మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
    నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
    విరోధంగా ఎదురు తిరిగారు.

అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
    ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
    దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
    వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
    వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!

12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
    వారు ఆయనకు స్తుతులు పాడారు.
13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు.
    వారు దేవుని సలహా వినలేదు.
14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు.
    అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు.
15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారికి ఇచ్చాడు.
    అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు.
16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు.
    యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు.
17 కనుక ఆ అసూయపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది.
    తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది.
18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది.
    ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది.
19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు.
    వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని
    వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు.
    ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
22 హాము దేశంలొ[a] దేవుడు అద్భుత కార్యాలు చేశాడు.
    దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.

23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు.
    కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు.
దేవునికి చాలా కోపం వచ్చింది.
    కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.

24 అంతట ఆ ప్రజలు ఆనందకరమైన కనాను దేశంలోనికి వెళ్లేందుకు నిరాకరించారు.
    ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడు వారికి సహాయం చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదు.
25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు.
26 అందుచేత వారు అరణ్యంలోనే మరణిస్తారని దేవుడు ప్రమాణం చేసాడు.
27 వారి సంతతివారిని ఇతర ప్రజలు ఓడించేలా చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.
    మన పూర్వీకులను రాజ్యాలలో చెదరగొడతానని దేవుడు ప్రమాణం చేసాడు.

28 దేవుని ప్రజలు బయల్పెయోరు అనే బయలు దేవత పూజలో పాల్గొన్నారు.
    చచ్చినవారికి, విగ్రహానికి బలియిచ్చిన మాంసాన్ని దేవుని ప్రజలు తిన్నారు.
29 దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు.
30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు.
    దేవుడు రోగాన్ని ఆపుచేసాడు.
31 ఫీనెహాసు చాలా మంచి పని చేసాడు అని దేవునికి తెలుసు.
    మరియు శాశ్వతంగా ఎప్పటికి దేవుడు దీనిని జ్ఞాపకం చేసుకొంటాడు.

32 మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది.
    మోషేతో ఏదో చెడు కార్యము వారు చేయించారు.
33 ఆ ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు.
    అందుచేత మోషే అనాలోచితంగా మాటలు అనేశాడు.

34 కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు.
    కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు.
35 ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు.
    ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు.
36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు.
    ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు.
37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి
    ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు.
38 దేవుని ప్రజలు నిర్దోషులను చంపివేసారు.
    వారు తమ స్వంత బిడ్డలనే చంపి ఆ బూటకపు దేవుళ్లకు అర్పించారు.
39 కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు.
    దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు.
40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది.
    దేవుడు వారితో విసిగిపోయాడు!
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు.
    వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
42 దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని
    వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు.
    కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు.
    దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు.
    ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు.
    దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు.
    అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
    నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
    అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.

Error: Book name not found: Wis for the version: Telugu Holy Bible: Easy-to-Read Version
రోమీయులకు 14:13-23

ఇతరులు పాపం చేసేలా చేయకు

13 కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి. 14 ఏ ఆహారం అపవిత్రం కాదని యేసు ప్రభువు ద్వారా నేను తెలుసుకొన్నాను. కానీ ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి అపవిత్రమౌతుంది.

15 నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు. 16 నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు. 17 దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. 18 ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.

19 అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం. 20 ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్యకూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని, ఇతర్ల ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం అపరాధం. 21 నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం త్రాగకుండా ఉండటంలాంటి పన్లేవీ చెయ్యకుండా ఉండటం ఉత్తమం.

22 అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు. 23 సందేహిస్తూ తినే వ్యక్తి విశ్వాసం లేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో కూడుకొన్నవి.

లూకా 8:40-56

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మత్తయి 9:18-26; మార్కు 5:21-43)

40 ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతమిచ్చారు. 41 అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న యాయీరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు. 42 తన పన్నెండేండ్ల కుమార్తె కూతురు చనిపోతుందని, తనకు ఒకే కూతురని, తన యింటికి వచ్చి ఆమెకు నయం చేయమని వేడుకున్నాడు.

యేసు అతని ఇంటికి వెళ్తుండగా, ప్రజలు త్రోసుకొంటూ ఆయన చుట్టూ ఉన్నారు. 43 ఆ గుంపులో పన్నెండేండ్లనుండి రక్తస్రావంతో బాధపడ్తున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టినా ఏ వైద్యుడూ ఆమె రోగాన్ని నయం చేయలేక పోయాడు 44 ఆమె యేసు వెనుకనుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. 45 ఆయన, “నన్నెవరు తాకారు?” అని అడిగాడు.

అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ! ప్రజలు త్రోసుకొంటూ మీ మీద పడ్తున్నారు కదా! ఎవరని చెప్పగలము?” అని అన్నాడు.

46 యేసు, “కాని ఎవరోనన్ను తాకారు. నా నుండి శక్తి వెళ్ళటం గమనించాను” అని అన్నాడు. 47 అప్పుడా స్త్రీ తనను గమనించకుండా ఉండరని గ్రహించి, వణకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది. 48 అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా! నీ విశ్వాసం నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు” అని అన్నాడు.

49 యేసు యింకా మాట్లాడుతుండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటినుండి ఒకడు వచ్చి అతనితో, “మీ కూతురు చనిపోయింది. ప్రభువును కష్టపెట్టనవసరం లేదు” అని అన్నాడు.

50 ఇది విని యేసు యాయీరుతో, “భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది” అని అన్నాడు.

51 యేసు యాయీరు యింటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లి తండ్రుల్ని తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు. 52 వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, “మీ శోకాలు ఆపండి. ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే” అని అన్నాడు.

53 ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు ఆయన్ని హేళన చేసారు. 54 యేసు ఆమె చేతులు పట్టుకొని, “లే అమ్మాయి!” అని అన్నాడు. 55 ఆమె ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే లేచి కూర్చొంది. యేసు వాళ్ళతో, “ఆమెకు ఏదైనా తినటానికి యివ్వండి” అని అన్నాడు. 56 ఆమె తల్లి తండ్రులు దిగ్భ్రాంతి చెందారు. కాని యేసు జరిగిన దాన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఆజ్ఞాపించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International