Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:145-176

ఖాఫ్

145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
    నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
    నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు
    నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
149 నీవు దయతో నా మాట విను.
    యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము.
150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
151 యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు.
    నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
    చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.

రేష్

153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
    నీ ఉపదేశాలను నేను మరువలేదు.
154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
    నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
155 దుష్టులు జయించరు. ఎందుకంటే,
    వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
    నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము
157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
    కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను.
    ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
159 చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
    యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
    నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.

షీన్

161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
    కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
    నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
    నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
    ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
    నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
    యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
    యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.

తౌ

169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
    కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
    నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
    గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
    కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
    నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
    యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
    మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.

కీర్తనలు. 128-130

యాత్ర కీర్తన.

128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.

నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
    ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
    బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.

ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.

యాత్ర కీర్తన.

129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
    ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
    కాని వారు ఎన్నడూ జయించలేదు.
నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
    నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
    ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
    ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
    ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
    “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.

యాత్ర కీర్తన.

130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
    కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రభువా, నా మాట వినుము.
    సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
    ఒక్క మనిషి కూడా మిగలడు.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
    అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.

యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
    నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
    యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
    ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
    నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
    మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

యిర్మీయా 25:30-38

30 “యిర్మీయా, ఈ వర్తమానం వారికి అందజేయి:
‘ఉన్నతమైన, పవిత్రమైన తన ఆలయం నుండి
    యెహోవా ఎలుగెత్తి చాటుతున్నాడు.
యెహోవా తన పచ్చిక బీడు (ప్రజలు)కు వ్యతిరేకంగా చాటుతున్నాడు.
    ఆయన ద్రాక్షారసం తీసే వారిలా బిగ్గరగా కేకలేస్తున్నాడు.
31 ఆ శబ్దం మోత భూమిపై ప్రజలందరికి చేరుతుంది.
    అసలీ శబ్దం ఎందుకు?
యెహోవా అన్ని దేశాల ప్రజలనూ శిక్షిస్తున్నాడు.
    యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తన వాదన తెలియజెప్పాడు
ఆయన ప్రజలపై తీర్పు ఇచ్చాడు.
    ఆయన కత్తితో దుష్ట సంహారం చేస్తున్నాడు.’”
ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.

32 సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే:
“ఒక దేశాన్నుండి మరొక దేశానికి
    విపత్తులు త్వరలో వ్యాపిస్తున్నాయి.
అవి పెనుతుఫానులా భూమిపై
    సుదూర తీరాల వరకు వ్యాపిస్తాయి!”

33 ఆ ప్రజల శవాలు దేశం ఒక అంచు నుండి మరో అంచువరకు పడి ఉంటాయి. చనిపోయిన వారి కొరకు విలపించే వారొక్కరూ ఉండరు. ఆ శవాలను ఎవ్వరూ సేకరించి సమాధి చేయరు పశువుల పేడవలె అవి నేలపై పడి ఉంటాయి.

34 కాపరులారా (నాయకులారా), మీరు మందను (ప్రజలను) కాయవలసి ఉంది.
కాని ఓ గొప్ప నాయకులారా, రోదించటం మొదలు పెట్టండి.
    గొర్రెల కాపరులారా, నేలమీద పడి బాధతో పొర్లండి
ఎందువల్లనంటే మీరు సంహరించబడే సమయం సమీపిస్తూ ఉంది.
    మిమ్ములను కొట్టి చెల్లా చెదరు చేస్తాను. పగిలిన కుండ పెంకుల్లా మీరు చిందర వందరై పోతారు!
35 గొర్రెల కాపరులు (నాయకులు) దాగటానికి తావే దొరకదు!
    ఆ నాయకులు తప్పించుకోలేరు!
36 కాపరులు (నాయకులు) అరవటం నేను వింటున్నాను.
    మంద (ప్రజలు) కాపరులు రోదించటం నేను వింటున్నాను!
    యెహోవా వారి పచ్చిక బయళ్లను (దేశం) నాశనం చేస్తున్నాడు!
37 ఆ ప్రశాంతమైన పచ్చిక బయళ్లు (భవనాలు) నాశనం చేయబడి వట్టి ఎడారిలా అవుతాయి.
    యెహోవా మిక్కిలి కోపంగా వున్న కారణంగా ఇది జరిగింది.
38 తన గుహనుండి బయటికి వస్తున్న ఒక భయంకరమైన సింహంలా యెహోవా ఉన్నాడు.
    యెహోవా కోపంగా ఉన్నాడు!
యెహోవా కోపం ఆ ప్రజలకు హాని కల్గించింది!
    వారి రాజ్యం వట్టి ఎడారిలా అయిపోయింది.

రోమీయులకు 10:14-21

14 మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? 15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”(A)

16 కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు: “ప్రభూ! మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు?”(B) 17 తద్వారా, సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది.

18 “వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది.
    వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.”(C)

19 “ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు:

“జనాంగము కానివారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను
    అర్థం చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను.”(D)

20 యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు:

“నా కోసం వెదకనివాళ్ళు నన్ను కనుగొంటారు.
నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.”(E)

21 కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు:

“అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడుతున్న
    ప్రజల కోసం దినమంతా వేచియున్నాను.”(F)

యోహాను 10:1-18

గొఱ్ఱెలకాపరి, తన గొఱ్ఱెలు

10 యేసు, “ఇది నిజం. గొఱ్ఱెల దొడ్డిలోకి తలుపు ద్వారా వెళ్ళకుండా గోడనెక్కి వెళ్ళేవాడు దొంగ, దోపిడిగాడు. తలుపు ద్వారా ప్రవేశించేవాడు ఆ గొఱ్ఱెలకు కాపరి. ద్వారపాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు. తన గఱ్ఱెల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు కనుక అవి అతణ్ణి అనుసరిస్తాయి. అవి క్రొత్త వాని వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. కనుక పారిపోతాయి.” అని అన్నాడు.

యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు.

యేసు మంచి కాపారి

అందువల్ల యేసు మళ్ళీ ఈవిధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “నిజంగా నేను గొఱ్ఱెలకు ద్వారాన్ని. నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు. కనుక గొఱ్ఱెలు వాళ్ళ మాటలు వినలేదు. నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. ఆ గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. 10 దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది.

11 “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని. 12 కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి. 13 అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు.

14-15 “నేను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే విధంగా నాకు నా గొఱ్ఱెల్ని గురించి, నా గొఱ్ఱెలకు నా గురించి తెలుసు. నా గొఱ్ఱెల కోసం నేను ప్రాణం ఇస్తాను. 16 ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు. 17 నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18 నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International