Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 120-127

యాత్ర కీర్తన.

120 నేను కష్టంలో ఉన్నాను.
    సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను.
    ఆయన నన్ను రక్షించాడు.
యెహోవా, మోసకరమైన నాలుకనుండి,
    నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.

అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా?
    మీరేమి పొందుతారో మీకు తెలుసా?
మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని,
    మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.

అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది.
    అది కేదారు[a] గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
నాకు శాంతి కావాలి. అయితే, నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.

యాత్ర కీర్తన.

121 కొండల తట్టు నేను చూసాను.
    కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
    నాకు సహాయం వస్తుంది.
దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
    నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
    దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
    యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
    రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
    యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
    ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.

దావీదు యాత్ర కీర్తన.

122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
    నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
కొత్త యెరూషలేము
    ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
    యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
    దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.

యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
    “యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
    నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
    నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”

నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
    శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
    ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.

యాత్ర కీర్తన.

123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
    నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
    బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
    దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
యెహోవా, మా మీద దయ చూపించుము.
    మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
    మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.

దావీదు యాత్ర కీర్తన.

124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
    ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
    ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
    వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
    మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
    మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.

యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
    మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.

మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
    వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
    భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.

యాత్ర కీర్తన.

125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
    వారు ఎన్నటికీ కదలరు.
    వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
    అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
    దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.

యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
    పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
    వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.

ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.

యాత్ర కీర్తన.

126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
    తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
మేము నవ్వుకుంటున్నాము.
    మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
    “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!

యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
    ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
    కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
    కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.

సొలొమోను యాత్ర కీర్తన.

127 ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
    కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
    కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.

నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
    నీవు నీ సమయం వృధా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకు ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
    వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొంటాడు.

పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
    వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు.
తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో[b] అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.

యిర్మీయా 25:8-17

కావున సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “మీరు నా వర్తమానాలను వినలేదు. అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబులోను రాజైన నెబుకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు. 10 ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలను అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం చేస్తాను. 11 ఆ ప్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా మారి పోతుంది. ఆ ప్రజలంతా బబులోను రాజుక్రింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు.

12 “కాని డెబ్బయి సంవత్సరాల అనంతరం నేను బబులోను రాజును శిక్షిస్తాను. బబులోను రాజ్యాన్ని కూడా శిక్షకు గురి చేస్తాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “కల్దీయుల దేశాన్ని కూడా వారు పాపాల నిమిత్తంగా శిక్షిస్తాను. ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎడారిలా మార్చివేస్తాను. 13 బబులోనుకు చాలా కష్టనష్టాలు కలుగుతాయిని చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరుతాయి. యిర్మీయా ఆ పరాయి రాజ్యాల గురించి ప్రవచించియున్నాడు. ఆ హెచ్చరికలన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడినాయి. 14 అవును. బబులోను ప్రజలు చాలా దేశాలలో ఎక్కువమంది గొప్ప రాజులకు సేవలు చేయాల్సి ఉంటుంది. వారు చేసే పనులన్నిటికీ అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”

ప్రపంచ రాజ్యాలపై తీర్పు

15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, ఈ ద్రాక్షా రసపు గిన్నెను నా చేతి నుండి తీసుకో. ఇది నా కోపరసం. నిన్ను నేను వివిధ దేశాలకు పంపుతున్నాను. ఆయా దేశాల వారిని ఈ గిన్నె నుండి తాగేలా చేయుము. 16 వారీ ద్రాక్షారసాన్ని తాగుతారు. పిదప వారు వాంతి చేసుకొని, పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. నేను త్వరలో వారి పైకి పంపబోయే కత్తి దృష్ట్యా వారలా చేస్తారు.”

17 కావున యెహోవా చేతి నుండి నేను ఆ గిన్నె అందుకొని యెహోవా పంపిన ప్రజలందరి యొద్దకు వెళ్లాను.

రోమీయులకు 10:1-13

10 సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వంశీయుల్ని రక్షించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు. దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నారు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు. నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం అంతమైపోయింది.

ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు”(A) కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు? “అగాధంలోకి ఎవరు దిగుతారు?”(B) అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు?

మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.”(C) ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. 10 ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము.

11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.”(D) 12 యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. 13 దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు”(E) అని వ్రాయబడి ఉంది.

యోహాను 9:18-41

18 ఇదివరలో గ్రుడ్డివానిగా ఉన్నవాడు యితడేనని; యిప్పుడతనికి దృష్టి వచ్చిందని, అతని తల్లిదండ్రుల్ని పిలువనంపే దాకా యూదులు నమ్మలేదు. 19 అతని తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడా! గ్రుడ్డి వానిగా జన్మించింది ఇతడేనా? ఇతడు ఇప్పుడెట్లా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు.

20 అతని తల్లిదండ్రులు, “అతుడు మా కుమారుడని, గ్రుడ్డివానిగా జన్నించాడని మాకు తెలుసు. 21 కాని అతడు ఇప్పుడేవిధంగా చూడగలుగు తున్నాడో. అతనికి దృష్టి ఎవరిచ్చారో మాకు తెలియదు. అతణ్ణే అడగండి! తనను గురించి సమాధానం చెప్పుకోగల వయస్సు అతనికి ఉంది” అని అన్నారు. 22 యేసే, “క్రీస్తు” అన్న ప్రతి ఒక్కణ్ణి సమాజ మందిరం నుండి బహిష్కరించాలని యూదులు యిది వరకే నిశ్చయించారు. కనుక వాళ్ళకు భయపడి అతని తల్లిదండ్రులు ఈ విధంగా సమాధానం చెప్పారు. 23 అందుకే వాళ్ళు, “అతనికి వయస్సు వచ్చింది. అతణ్ణే అడగండి!” అని అన్నారు.

24 యూదులు గ్రుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో, “దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు.

25 “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం చెప్పాడు.

26 “అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు.

27 అతుడు, “నేను యిది వరకే చెప్పాను. కాని మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా?” అని అన్నాడు.

28 వాళ్ళు అతణ్ణి అవమానపరచారు. అతనితో, “నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము. 29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా మాకు తెలియదు” అని అన్నారు.

30 అతడు, “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు. 31 దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు. 32 పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ వినలేదు. 33 ఇతడు దేవుని నుండి రానట్లైతే ఏమి చెయ్యలేకపొయ్యేవాడు” అని అన్నాడు.

34 ఇది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత ధైర్యం?” అని అంటూ అతణ్ణి వెలివేశారు.

ఆత్మీయ అంధత్వము

35 అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు.

36 ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు.

37 యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు.

38 అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు.

39 యేసు, “నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగలగాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు.

40 ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డివాళ్ళ మంటున్నావా?” అని అన్నారు.

41 యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International