Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 31

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

31 యెహోవా, నీవే నా కాపుదల.
    నన్ను నిరాశపరచవద్దు.
    నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
    దేవా, నా మాట ఆలకించుము.
    వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
    నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
దేవా, నీవే నా బండవు, కోటవు
    కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
    వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
    నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
    నన్ను రక్షించుము.
వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం.
    యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది.
    నా కష్టాలు నీవు చూశావు.
    నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు.
    వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉంచుము.
    నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి.
    నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.
    నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి.
    నా బలం తొలగిపోతూ ఉంది.[a]
11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.
    నా పొరుగు వాళ్లంతా కూడా నన్ను ద్వేషిస్తారు.
నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు.
    వారు నానుండి దూరంగా ఉంటారు.
12 నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను.
    నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.
    ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.

14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    నీవే నా దేవుడవు.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
    నన్ను రక్షించుము.
17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను.
    కనుక నేను నిరాశచెందను.
చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు,
    మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
18 ఆ చెడ్డవాళ్లు గర్వించి,
    మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబుతారు.
ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు.
    కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.

19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు.
    నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు.
    ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు.
    కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు.
    ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను.
    కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.

23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి.
    యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు.
కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.

కీర్తనలు. 35

దావీదు కీర్తన.

35 యెహోవా, నా పోరాటాలు పోరాడుము
    నా యుద్ధాలు పోరాడుము.
యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,
    లేచి, నాకు సహాయం చేయుము.
ఈటె, బరిసె తీసుకొని
    నన్ను తరుముతున్న వారితో పోరాడుము.
“నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,

కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము.
    వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు.
    వారిని ఇబ్బంది పెట్టుము.
ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.
    యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము.
    యెహోవా దూత వారిని తరుమును గాక!
నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.
    నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు.
కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.
    వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము.
    తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.
    ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.
    యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు.
దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు”
    అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను.
11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది.
    ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
12 నేను మంచి పనులు మాత్రమే చేశాను.
    కాని ఆ మనుష్యులు నాకు చెడ్డవాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను.
    ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను.
    నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను.
    ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు.
    ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు.
కొందరు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు.
    వాళ్లను నేను కనీసం ఎరుగను.
16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు.
    ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.

17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు?
    ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.

18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
19 అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు.
    నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు.
    శాంతియుతంగా ఉన్న ప్రజలకు చెడుపు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబుతున్నారు.
    వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీవేమి చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
22 యెహోవా, జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు.
    కనుక మౌనంగా ఉండవద్దు.
    నన్ను విడిచిపెట్ట వద్దు.
23 యెహోవా, మేలుకో! లెమ్ము!
    నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము.
    ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వనీయ వద్దు.
25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము.
    “యెహోవా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
26 నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము.
    నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు.
తాము నాకంటె మేలైనవారము అని వారు తలంచారు.
    కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను, సిగ్గుతోను నింపి వేయుము.
27 నీతిని ప్రేమించే మనుష్యులారా,
    మీరు సంతోషించండి.
ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.”

28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబుతాను.
    నేను ప్రతి దినము స్తుతిస్తాను.

యిర్మీయా 24

మంచి మరియు చెడ్డ అంజూరపు పండ్లు

24 యెహోవా నాకు ఈ వస్తువులను చూపించాడు: యెహోవా మందిరం ముందు ఉంచబడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. (నాకు ఈ దర్శనం బబులోను రాజైన నెబుకద్నెజరు యెకోన్యాను[a] బందీగా తీసుకొని పోయిన తరువాత కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు యెరూషలేము నుండి తీసుకొనిపోబడినారు. వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబుకద్నెజరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.) ఒక బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లున్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి పోయాయి.

“యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని యెహోవా నన్ను అడిగాడు.

“నేను అంజూరపు పండ్లను చూస్తున్నాను. అవి చాలా మంచి పండ్లు. చెడి పోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధానమిచ్చాను.

పిమ్మట యెహోవా వర్తమానం నాకు చేరింది. ఇశ్రాయేలు దేవుడైవ యెహోవా ఇలా చెప్పాడు: “యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు కొనిపోబడ్డారు. వారి శత్రువు వారిని బబులోనుకు తీసుకొనిపోయాడు. ఆ ప్రజలు ఈ మంచి అంజూరపండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం చూపుతాను. నేను వారిని రక్షిస్తాను. నేను వారిని తిరిగి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాను. నేను వారిని చీల్చి పారవేయను. వారిని పైకి తీసుకొని వస్తాను! వారిని పెరికి వేయను. వారు అభివృద్ది చెందటానికి వారిని స్థిరంగా నాటుతాను. వారు నన్ను తెలుసుకొనగోరేలా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. వారు నా ప్రజలు; నేను వారి దేవుడను. బబులోనులో వున్న ఆ బందీలంతా పూర్ణహృదయ పరివర్తనతో నా వైపు తిరుగుతారు గనుక నేనిదంతా చేస్తున్నాను.

“కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తినటానికి పనికిరాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె అవుతాడు. సిద్కియా, అతని ఉన్నతాధికారులు, యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలు కుళ్లిన ఈ అంజూరపు పండ్లవలె ఉంటారు. నేను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్రజలందరికీ భయంతో కూడిన విస్మయాన్ని కల్గిస్తుంది! యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో ప్రజలు వారిని శపిస్తారు. 10 వారి మీదికి కత్తిని, కరువును, రోగాలను పంపుతాను. వారంతా చనిపోయే వరకు వారిని ఎదుర్కొంటూ వుంటాను. వారికి, వారి పితరులకు నేనిచ్చిన భూమిమీద వారిక ఎంత మాత్రము ఉండరు.”

రోమీయులకు 9:19-33

19 మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు. 20 కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా? 21 కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా?

22 భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? 23 దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం? 24 యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. 25 హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు:

“నా ప్రజలు కాని వాళ్ళను
    నా ప్రజలని పిలుస్తాను.
నా ప్రియురాలు కాని జనాన్ని
    నా ప్రియురాలా అని పిలుస్తాను.”(A)

26 “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.”(B)

27 యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు:

“ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా,
    కొందరు మాత్రమే రక్షింపబడతారు.
28 ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.”(C)

29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు:

“సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని
మనకు వదిలి ఉండక పోయినట్లైతే
    మనం సొదొమ ప్రజలవలే,
    గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”(D)

30 మరి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి ప్రయత్నించని యూదులుకాని ప్రజలు నీతిమంతులయ్యారు. అది వాళ్ళల్లో విశ్వాసం ఉండటం వల్ల సంభవించింది. 31 కాని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నించిన ఇశ్రాయేలు వంశీయులు నీతిమంతులు కాలేదు. 32 ఎందుకు? వాళ్ళు విశ్వాసంతో కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు. కనుక అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు. 33 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“నేను సీయోనులో ఒక రాయిని స్థాపించాను.
    దాని వల్ల కొందరు తొట్రుపడతారు. నేనొక శిలను స్థాపిస్తాను.
దాని వల్ల వాళ్ళు క్రింద పడతారు. ఆయన్ని నమ్మిన వానికెన్నడూ ఆశాభంగం కలుగదు.”(E)

యోహాను 9:1-17

యేసు ఒక పుట్టు గ్రుడ్డివానిని నయం చేయటం

ఆయన వెళ్తూ ఒక పుట్టు గ్రుడ్డి వాణ్ణి చూశాడు. ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ! యితడు గ్రుడ్డివానిగా పుట్టాడే! ఎవరు పాపం చేసారంటారు? ఇతడా లేక యితని తల్లిదండ్రులా?” అని అడిగారు.

యేసు, “ఇతడు కాని, యితని తల్లిదండ్రులు కాని పాపం చెయ్యలేదు! దేవుని శక్తి యితని జీవితం ద్వారా ప్రదర్శింపబడాలని గ్రుడ్డివానిగా పుట్టాడు. సూర్యాస్తమయం అయ్యేలోగా మనం నన్ను పంపిన వాని కార్యం చేయాలి. రాత్రి రాబోతోంది. అప్పుడు ఎవ్వరూ పని చెయ్యలేరు. ఈ ప్రపంచంలో నేను ఉన్నంత కాలం నేను దానికి వెలుగును” అని అన్నాడు.

ఈ విధంగా మాట్లాడి నేల మీద ఉమ్మి వేసాడు. ఆ ఉమ్మితో బురద చేసి, ఆ గ్రుడ్డివాని కళ్ళమీద పూసాడు. అతనితో, “వెళ్ళి, సిలోయం కోనేట్లో కడుక్కో!” అని అన్నాడు. సిలోయం అన్న పదానికి అర్థం “పంపబడిన వాడు.” ఆ గ్రుడ్డివాడు వెళ్ళి తన కళ్ళు కడుక్కున్నాడు. అతనికి దృష్టి వచ్చాక తిరిగి వచ్చాడు.

అతని ఇరుగు, పొరుగు వాళ్ళు, అతడు భిక్షమెత్తు కుంటుండగా చూసిన వాళ్ళు, “ఈ మనిషి కూర్చొని భిక్షమెత్తు కుంటూవుండే వాడు కదా!” అని అన్నారు.

కొందరు, “ఔనన్నారు. మరికొందరు, కాదు ఇతడు అతనిలా కనిపిస్తున్నాడు, అంతే!” అని అన్నారు.

కాని అతడు స్వయంగా, “నేనే అతణ్ణి” అని అన్నాడు.

10 “మరి అలాగైతే నీకు దృష్టి ఎట్లా వచ్చింది!” అని వాళ్ళు అడిగారు.

11 అతడు, “యేసు అని పిలుస్తారే ఆయన బురద చేసి నా కళ్ళ మీద పూసాడు. తర్వాత నన్ను వెళ్ళి సిలోయం కొనేరులో కడుక్కోమన్నాడు. నేను అలాగే వెళ్ళి కడుక్కున్నాను. ఆ తర్వాత నాకు దృష్టి వచ్చింది” అని సమాధానం చెప్పాడు.

12 వాళ్ళు, “అతడెక్కడ ఉన్నాడు?” అని అడిగారు.

ఆయన, “నాకు తెలియదు” అని అన్నాడు.

పరిసయ్యులు విచారించటం

13 వాళ్ళు యింతకు పూర్వం గ్రుడ్డివానిగా ఉన్న వాణ్ణి పరిసయ్యుల దగ్గరకు పిలుచుకు వచ్చారు. 14 బురద చేసి ఆ గ్రుడ్డివానికి నయం చేసింది విశ్రాంతి రోజు. 15 పరిసయ్యులు దృష్టి ఎట్లా వచ్చిందని అతణ్ణి ప్రశ్నించారు.

అతడు, “ఆయన నా కళ్ళమీద బురద పూసాడు. నేను వెళ్ళి కడుక్కొన్నాను. నాకు దృష్టి వచ్చింది” అని అన్నాడు.

16 కొందరు పరిసయ్యులు, “అతడు విశ్రాంతి రోజును పాటించడు. కనుక అతడు దేవుని నుండి రాలేదు!” అని అన్నారు.

మరికొందరు, “ఇతడు పాపాత్ముడైతే ఇలాంటి అద్భుతాలు చేయగలడా?” అని అన్నారు. అలా వారిలో వారికి వివాదం కలిగింది.

17 వాళ్ళు మళ్ళీ గ్రుడ్డివానితో, “నీవు అతని గురించి ఏమనుకొంటున్నావు” అని అడిగారు.

“ఆయన ఒక ప్రవక్త!” అని ఆ నయమైన వాడు సమాధానం చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International