Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 8

సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
    నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
    నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
    నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
    నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
    వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
    మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
    ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
    చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

కీర్తనలు. 138

దావీదు కీర్తన.

138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
    దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
    నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.

యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
    నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా మహిమ గొప్పది.
దేవుడు గొప్పవాడు.
    అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
    కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
    నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
    యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.

ఆదికాండము 3:1-15

పాపం ప్రారంభం

ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది, కపటమైనది. ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకొని, “ఏమమ్మా! ఈ తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినవద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా?” అంది.

సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “లేదు! దేవుడు అలాగు చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలు మేము తినవచ్చు. అయితే ఒక చెట్టుంది, దాని ఫలము మేము తినకూడదు. ‘తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకూడదు. అసలు ఆ చెట్టును మీరు ముట్టుకోకూడదు. అలాచేస్తే మీరు చస్తారు’ అని దేవుడు మాతో చెప్పాడు.”

అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావరు. ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!”

ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్లు ఆ స్త్రీ చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్లు, ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు.

అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ మారిపోయారు. వారి కళ్లు తెరవబడ్డట్లు వారికి అన్నీ వేరుగా కనబడ్డాయి. వారికి బట్టలు లేనట్లు, నగ్నంగా ఉన్నట్లు వాళ్లు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు.

సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని, తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు. అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా.

10 “నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు.

11 దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానుగదా!”

12 అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు.

13 అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో.

ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేశాను” అని చెప్పింది.

14 అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు:

“ఈ మహా చెడ్డ పని నీవే చేశావు
    కనుక నీవు శపించబడ్డావు.
జంతువులన్నిటి కంటే
    నీ పరిస్థితి హీనంగా ఉంటుంది.
నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌతుంది.
    నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు.
15 ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని
    విరోధుల్నిగా నేను చేస్తాను.
నీ సంతానము, ఆమె సంతానము
    ఒకరికొకరు విరోధులవుతారు.
నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు
    ఈ శిశువు నీ తలను చితుక కొడతాడు.”

రోమీయులకు 5:12-21

ఆదాము వల్ల మరణం, క్రీస్తు వల్ల జీవం

12 పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపం చేసారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది. 13 ధర్మశాస్త్రానికి ముందే పాపం ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేక పోయినట్లైతే పాపం లెక్కలోకి వచ్చేది కాదు. 14 అయినా, ఆదాము కాలంనుండి మోషే కాలం వరకు మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతనివలే పాపం చెయ్యనివాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది.

ఆదాముకు, రానున్నవానికి కొంత పోలిక ఉంది. 15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే యేసు క్రీస్తు అనుగ్రహంవల్ల, దేవునిలో వరము, ఆయన అనుగ్రహము ఉచితంగా లభించాయి. 16 పైగా ఆదాము ఒక్కసారి చేసిన పాపానికి నేరస్థుడుగా తీర్పు ఇవ్వబడింది. కాని ఎన్నో పాపాలు చేసిన మనకు దేవుని నుండి నీతిమంతులముగా అయ్యే వరం లభించింది. అందువల్ల ఆదాము పాపాన్ని దేవుని వరంతో పోల్చలేము. 17 ఆదాము పాపం చేసాడు. ఆ ఒక్కని పాపంవల్ల మరణం రాజ్యం చేసింది. కాని ఆ “ఇంకొకని” ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం పొంది రాజ్యం చెయ్యటం తథ్యం. ఇది దేవుని నుండి నీతియను వరాన్ని, సంపూర్ణమైన ఆయన అనుగ్రహాన్ని పొందినవాళ్ళకు సంభవిస్తుంది.

18 అందువల్ల ఒకడు చేసిన పాపంవల్ల ప్రజలందరికీ శిక్ష విధించబడింది. అదే విధంగా ఒకడు ఒక నీతికార్యాన్ని చేయటంవల్ల, అందరూ శిక్షను తప్పించుకొని అనంతజీవితం పొందుటకు మార్గమేర్పడింది. 19 ఒకని అవిధేయతవల్ల అనేకులు పాపులుగా చేయబడిరి. అలాగే ఒకని విధేయతవల్ల అనేకులు నీతిమంతులగుదురు. 20 పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది. 21 పాపం మరణం ద్వారా రాజ్యం చేసినట్లు దైవానుగ్రహం నీతిద్వారా రాజ్యం చేసింది. మన యేసు క్రీస్తు ప్రభువుద్వారా అది మనకు అనంత జీవం కలిగిస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International