Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 132

యాత్ర కీర్తన.

132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
    ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
    నేను నా పడక మీద పండుకొనను,
నేను నిద్రపోను,
    నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
    ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”

ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
    ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
    దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
    యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
    నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
    నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
    దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
    అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.

13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
    తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
    నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
    ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
    మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
    నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
    కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”

యెషయా 63:7-16

యెహోవా తన ప్రజల ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు

యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    మరియు యెహోవాను స్తుతించటం నేను జ్ఞాపకం చేసుకొంటాను.
ఇశ్రాయేలు వంశానికి యెహోవా అనేకమైన మంచివాటిని ఇచ్చాడు.
యెహోవా మా యెడల చాలా దయచూపించాడు.
    యెహోవా మా యెడల కరుణ చూపించాడు.
“వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు”
    అని యెహోవా చెప్పాడు.
కనుక యెహోవా ఈ ప్రజలను రక్షించాడు.
ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి.
    కానీ యెహోవా వారికి విరోధంగా లేడు.
యెహోవా ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన విచారించాడు.
    కనుక యెహోవా ప్రజలను రక్షించాడు.
వారిని రక్షించేందుకు ఆయన తన ప్రత్యేక దేవదూతను పంపించాడు.
    మరియు యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం ఎన్నడైనా చాలించాలని యెహోవా కోరలేదు.
10 అయితే ప్రజలు యెహోవాకు విరోధం అయ్యారు.
    ఆయన పరిశుద్ధాత్మను ప్రజలు చాలా దుఃఖపర్చారు.
అందుచేత యెహోవా వారికి శత్రువు అయ్యాడు.
    యెహోవా ఆ ప్రజలకు విరోధంగా పోరాడాడు.

11 కానీ యెహోవా చాలా పూర్వకాలాన జరిగినదాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
    మోషే, అతని ప్రజలూ యెహోవాకు జ్ఞాపకం.
సముద్రంలోనుండి ప్రజలను బయటకు తీసుకొనివచ్చిన వాడు యెహోవాయే.
    యెహోవా తన మందను (ప్రజలను) నడిపించటానికి తన కాపరులను (ప్రవక్తలను) వాడుకొన్నాడు.
అయితే మోషేలో తన ఆత్మను ఉంచిన ఆ యెహోవా ఇప్పుడు ఎక్కడ?
12 యెహోవా తన కుడిచేత మోషేను నడిపించాడు. మోషేను నడిపించుటకుగాను యెహోవా తన అద్భుత శక్తిని ఉపయోగించాడు.
ప్రజలు సముద్రంలోనుండి నడువగలిగేట్టు
    యెహోవా నీళ్లను పాయలు చేశాడు.
ఈ గొప్ప కార్యాలు చేయటం వల్ల
    యెహోవా తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకొన్నాడు.
13 లోతైన సముద్రాల మధ్యనుండి తన ప్రజలను యెహోవా నడిపించాడు.
    ప్రజలు పడిపోకుండా నడిచారు.
    అరణ్యంలో గుర్రం నడచినట్టు వారు నడిచారు.
14 ఒక ఆవు ఊరికే పొలంలో నడుస్తూ పడిపోదు.
    అదేవిధంగా ప్రజలు సముద్రంలోనుండి వెళ్తూ పడిపోలేదు.
    ఒక విశ్రాంతి స్థలానికి ప్రజలను యెహోవా ఆత్మ నడిపించాడు.
అంతవరకు ప్రజలు క్షేమంగా ఉన్నారు. యెహోవా, నీవు నీ ప్రజలను నడిపించిన విధం అది.
    ప్రజలను నీవు నడిపించావు, నీ నామాన్ని నీవు ఆశ్చర్యకరమైనదిగా చేసుకొన్నావు.

తన ప్రజలకు సహాయం చేయమని దేవునికొక ప్రార్థన

15 యెహోవా, పరలోకము నుండి చూడుము.
    ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము.
పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర నివాసంనుండి క్రిందనున్న మమ్మల్ని చూడుము.
    మా మీద నీ బలమైన ప్రేమ ఏది?
    నీ అంతరంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమైన కార్యాలు ఏవి?
    నామీద నీ కరుణ ఏది? నామీద నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు?
16 చూడు, నీవు మా తండ్రివి!
    మేము అబ్రాహాము పిల్లలమని అతనికి తెలియదు.
    ఇశ్రాయేలు (యాకోబు) మమ్మల్ని గుర్తించలేడు.
యెహోవా, నీవు మా తండ్రివి.
    మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించినవాడవు నీవే.

మత్తయి 1:18-25

యేసు క్రీస్తు జననం

(లూకా 2:1-7)

18 యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. 19 కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.

20 అతడీవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు. 21 ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు.

22-23 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు”(A) ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.

24 యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. 25 కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.

కీర్తనలు. 34

దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
    ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
దీన జనులారా, విని సంతోషించండి.
    నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
    మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
    నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
    మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
    యెహోవా నా మొర విన్నాడు.
    నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
    ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
    యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
    ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
    ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
    ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
    ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
    కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
    ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
    చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
    తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

ఎఫెసీయులకు 3:14-21

ఎఫెసీయుల కోసం ప్రార్థన

14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.

20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International