Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 24

దావీదు కీర్తన.

24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
    ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
    ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.

యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
    యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
అక్కడ ఎవరు ఆరాధించగలరు?
    చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
    అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
    అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
    అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.

మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
    ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
    సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
    పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
ఈ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
    యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
    పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.

కీర్తనలు. 29

దావీదు కీర్తన.

29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
    ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
    మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
    మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
    ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
    లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
    షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
    యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
    ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.

10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
    మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
    యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.

కీర్తనలు. 8

సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
    నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
    నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
    నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
    నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
    వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
    మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
    ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
    చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

కీర్తనలు. 84

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన

84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
    నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
    పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
    అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
    వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.

ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
    వారు నిన్నే నడిపించ నిస్తారు.
దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
    నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
    ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.

సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
    యాకోబు దేవా, నా మాట వినుము.

దేవా, మా సంరక్షకుని కాపాడుము.
    నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
    నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
    నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
    దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
    ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.

యిర్మీయా 1:1-10

ఇవి యిర్మీయా వర్తమానాలు. యిర్మీయా తండ్రి పేరు హిల్కీయా. అనాతోతు నగరంలో నివసించే[a] యాజకుల కుటుంబానికి చెందిన వాడు యిర్మీయా. ఆ నగరం బెన్యామీను వంశానికి చెందిన వారి ప్రాంతంలో వుంది. యూదా రాజ్యాన్ని యోషీయా పాలిస్తున్న రోజులలో యెహోవా యిర్మీయాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. యోషీయా తండ్రి పేరు ఆమోను. యోషీయా రాజ్యపాలన పదమూడవ సంవత్సరం[b] జరుగుతూ ఉండగా యెహోవా యిర్మీయాతో మాట్లాడటం ప్రారంభించాడు. యెహోయాకీము యూదాకు రాజై యున్న కాలం వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం కొనసాగించాడు. యెహోయాకీము తండ్రి పేరు యోషీయా. సిద్కియా రాజ్యపాలన యూదాపై పదకొండు సంవత్సరాల ఐదు మాసాలు జరిగే వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం సాగించాడు. సిద్కియా కూడ యోషీయా కుమారుడే. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాలు దాటి ఐదవ నెల జరుగుతూ ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలు బందీలుగా కొనిపోబడ్డారు.

యిర్మీయాకు దేవుని పిలుపు

యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది.

“నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే
    నిన్ను నేనెరిగియున్నాను.
నీవు పుట్టకముందే
    నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను.
    దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.”

అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడవైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.

కాని యెహోవా ఇలా అన్నాడు:

“బాలుడనని అనవద్దు.
    నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి.
    నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి.
ఎవ్వరికీ భయపడకు.
    నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”.
ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది.

పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు:

“యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను.
10 దేశాలను, సామ్రాజ్యాలను ఈ రోజు నీ జవాబుదారిలో ఉంచుతున్నాను.
    నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు.
    నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు.
    నీవు వాటిని కట్టి నాటుతావు.”

1 కొరింథీయులకు 3:11-23

11 ఆ “పునాది” యేసు క్రీస్తు కనుక ఇదివరకే వేసిన ఆ పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరూ వేయలేరు. 12 కొందరు బంగారము, వెండి, విలువైన రత్నాలు ఉపయోగించి ఈ పునాది మీద కడతారు. మరికొందరు చెక్కను, గడ్డిని, ఆకుల్ని ఉపయోగించి కడతారు. 13 వాళ్ళ పనితనము క్రీస్తు వచ్చిన రోజున ఆయనయొక్క వెలుగులో బయటపడుతుంది. “ఆ రోజు” నిప్పువలె వస్తుంది. ఆ నిప్పు ప్రతి ఒక్కరి పనితనాన్ని పరీక్షిస్తుంది. 14 వాళ్ళు నిర్మించింది నిలిస్తే వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. 15 అది కాలిపోతే వాళ్ళకు నష్టం కలుగుతుంది. కాని మంటలనుండి అతనొక్కడే తప్పించుకొన్న విధంగా రక్షింపబడతాడు.

16 మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? 17 కనుక దేవుని మందిరాన్ని నాశనం చేసినవాణ్ణి దేవుడు నాశనం చేస్తాడు. దేవుని మందిరం పవిత్రమైనది. మీరే ఆ మందిరం.

18 మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రాపంచిక విషయాల్లో తెలివి ఉందని భావించేవాడు మొదట తనను తాను జ్ఞానహీనునిగా ఎంచుకొంటే తర్వాత జ్ఞాని కాగలడు. 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని మూర్ఖమైనదానిగా పరిగణిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో, “తమ చమత్కారము ఉపయోగించే జ్ఞానుల్ని దేవుడు పట్టేస్తాడు”(A) అని వ్రాయబడి ఉంది. 20 మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు”(B) అని వ్రాయబడి ఉంది. 21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి. 22 పౌలు, అపొల్లో, కేఫా, ప్రపంచము, బ్రతుకు, చావు, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ మీవి. 23 మీరు క్రీస్తుకు చెందినవారు. క్రీస్తు దేవునికి చెందినవాడు.

మార్కు 3:31-4:9

యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు

(మత్తయి 12:46-50; లూకా 8:19-21)

31 యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. 32 యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు.

33 “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ 34 చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు. 35 దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.

రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం

(మత్తయి 13:1-9; లూకా 8:4-8)

ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలమంది ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. ఆయన ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళకు చాలా విషయాలు బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ,

“వినండి! ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనములు చల్లుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. వాటిని పక్షులు తినివేసాయి. మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కలను అణచి వేయటంవల్ల వాటికి ధాన్యం పండలేదు. మరికొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి, ముప్పై వంతుల, అరవైవంతుల, నూరువంతుల పంటను కూడా యిచ్చాయి.”

ఈ విధంగా చెప్పి యేసు, “చెవులున్న వాడు విననీ!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International