Book of Common Prayer
సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.
55 దేవా, నా ప్రార్థన వినుము.
దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
2 దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
3 నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
4 నాలో నా గుండె అదురుతోంది.
నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
5 నాకు భయము మరియు వణకుగా ఉంది.
నేను భయపడిపోయాను.
6 ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
7 నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
8 నేను పరుగెత్తి పోదును.
నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
9 నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
నేను దాక్కోగలను.
13 కాని, అది చేస్తున్నది నీవే.
నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
16 నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను.
యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17 సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను.
ఆయన నా మాట వింటాడు.
18 నేను చాలా యుద్ధాలు చేశాను.
కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
19 దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు.
నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.
నా శత్రువులు వారి బ్రతుకులు మార్చుకోరు.
వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు.
అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21 అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు.
కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు.
వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి
కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.
22 నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు
ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు.
మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23 కాని దేవా! దుష్టులను సమాధి అనే గుంటలోనికి అణచివేస్తావు.
రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్ధకాలమైనా జీవించరు.
కాని నేనైతే నీయందే విశ్వసిస్తాను.
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
7 నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
8 నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
9 యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
“పగలు రాత్రిగా మారిపోయింది.
తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
19 దేవా, దుర్మార్గులను చంపివేయుము.
ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము.
20 ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు.
వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
21 యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను.
నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను.
22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను!
నీ శత్రువులు నాకూ శత్రువులే.
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.
18 “నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచుకోండి. మీకు జ్ఞాపకంచేసే సూచనలుగా ఈ ఆజ్ఞలను వ్రాసి మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంగా కట్టుకోండి. 19 ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ యిండ్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకొన్నప్పుడు, మీరు లేచినప్పుడు, ఈ విషయాలను గూర్చి మాట్లాడండి. 20 మీ గృహాల ద్వారబంధాల మీద, గవునుల మీద ఈ ఆజ్ఞలు వ్రాయండి. 21 అప్పుడు యెహోవా మీ పూర్వీకులకు యిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరూ మీ పిల్లలూ దీర్ఘకాలం జీవిస్తారు. భూమికి ప్తెగా ఆకాశాలు ఉన్నంతవరకు మీరు అక్కడ నివసిస్తారు.
22 “మీరు ఆచరించాలని నేను మీతో చెప్పిన ప్రతి ఆజ్ఞకూ విధేయులుగా ఉండేందుకు జాగ్రత్త పడండి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆయన మార్గాలన్నింటినీ వెంబడించండి, ఆయనకు నమ్మకంగా ఉండండి. 23 అప్పుడు ఆ దేశంలోనికి వెళ్తారు. ఆ యితర రాజ్యాలన్నింటి జనాలనూ యెహోవా బయటకు వెళ్లగొడ్తాడు. మీకంటే ఎక్కువ బలంగల పెద్ద రాజ్యాలనుండి ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. 24 మీరు నడిచే భూమి అంతా మీదే అవుతుంది. మీ దేశం దక్షిణాన అరణ్యం మొదలుకొని ఉత్తరాన లెబానోను వరకు మొత్తం వ్యాపించి ఉంటుంది. తూర్పున యూఫ్రటీసు నదినుండి మొత్తం మధ్యధరా సముద్రంవరకు వ్యాపించి ఉంటుంది. 25 మీకు వ్యతిరేకంగా నిలువగల వాడు ఎవడూ ఉండడు. ఆ దేశంలో మీరు ఎక్కడికి వెళ్లినాసరే ప్రజలు మీకు భయపడేటట్టుగా మీ దేవుడైన యెహోవా చేస్తాడు. ఇంతకు ముందు యెహోవా మీకు వాగ్దానం చేసింది యిదే.
ఇశ్రాయేలుయొక్క కోరికలు ఆశీర్వాదములా లేక శాపములా
26 “ఈ వేళ నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదమో లేక ఒక శాపమో కోరుకోనిస్తున్నాను. 27 ఈ వేళ నేను మీతో చెప్పిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు లోబడితే మీకు ఆశీర్వాదం లభిస్తుంది. 28 మీరు మీ దేవుడైన యెహోవా మాట వినక, ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంనుండి మీరు తొలగిపోయి, మీరు ఎరుగని ఇతర దేవుళ్లను అనుసరిస్తే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించేందుకు మీరు నిరాకరిస్తే మీకు శాపం వస్తుంది.
5 ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. 2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. 3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. 5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,
“నీవు నా కుమారుడవు.
నేడు నేను నీకు తండ్రినయ్యాను”(A)
అని చెప్పి మహిమ పరచాడు. 6 మరొక చోట, ఇలా అన్నాడు:
“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
యాజకుడవై ఉంటావు.”(B)
7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. 8 యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు. 9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్నవాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు.
యేసు సమరయ స్త్రీతో మాట్లాడటం
4 యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిస్మము నిస్తున్నాడని పరిసయ్యులు విన్నారు. 2 నిజానికి, బాప్తిస్మము నిచ్చింది యేసు కాదు. ఆయన శిష్యులు. 3 యేసు యిది గమనించి, యూదయ వదిలి మళ్ళీ గలిలయకు వెళ్ళిపోయాడు. 4 ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసివచ్చింది.
5 ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు. 6 అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. 7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు. 8 ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు.
9 ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు.
10 యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు.
11 ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది? 12 మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది.
13 యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది! 14 కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు.
15 ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది.
16 ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు.
17 “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది.
యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. 18 నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.
19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. 20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది.
21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. 22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. 24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.
25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది.
26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.
© 1997 Bible League International