Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 45

సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.

45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
    అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
    నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.

నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
    నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
    కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
    అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
    అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
    నీ నీతి రాజదండము.
నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
    కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
    నీ దేవుడు కోరుకొన్నాడు.
నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
    నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
    నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.

10 కుమారీ, నా మాట వినుము.
    నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11     రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
    నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
    వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.

13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
    ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
    ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
    సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.

16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
    దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
    శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.

కీర్తనలు. 47-48

సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.

47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
    సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
    భూలోకమంతటికీ ఆయన రాజు.
ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
    ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
    యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.

బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
    యెహోవా దేవుడు లేచాడు.
దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
    మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
దేవుడు సర్వలోకానికి రాజు.
    స్తుతిగీతాలు పాడండి.
దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
    దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
    దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
    దేవుడు మహోన్నతుడు.

కోరహు కుమారుల స్తుతి పాట.

48 యెహోవా గొప్పవాడు.
    మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
    అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
    అది మహారాజు పట్టణం.
ఇక్కడ ఆ పట్టణంలోని
    భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
    వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
    ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
    వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
    ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
దేవా, బలమైన తూర్పుగాలితో
    తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
    మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.

దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
    భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
    మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
    ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
    సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
    ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.

ద్వితీయోపదేశకాండము 9:4-12

“ఆ రాజ్యాల వాళ్లను మీనుండి మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టిన తర్వాత ‘మా స్వంత నీతి జీవితాల మూలంగానే ఈ దేశంలో జీవించేందుకు యెహోవా మమ్మల్ని తీసుకొనివచ్చాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. ఆ రాజ్యాలవాళ్లను మీనుండి యెహోవా వెళ్లగొట్టాడు, ఎందుకంటే వారు జీవించిన చెడు మార్గంవల్లనే. మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అందులో ప్రవేశిస్తున్నారంటే మీరేదో మంచివాళ్లు, నీతిగా బతుకుతున్నారు అని కాదు. వాళ్లు చెడుమార్గాలలో జీవించడంవల్లనే మీ దేవుడైన యెహోవా వాళ్లను బయటకు వెళ్లగొడుతున్నాడు, మీరు లోనికి వెళ్తున్నారు. మరియు మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం నెరవేరాలని ఆయన కోరుచున్నాడు. మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆయితే అది మీ నీతి బ్రతుకు మూలంగా కాదని మీరు తెలుసుకోవాలి. సత్యం ఏమిటంటే మీరు మొండి ప్రజలు.

యెహోవా కోపాన్ని జ్ఞాపకం చేసుకోండి

“అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించారని మరచిపోవద్దు. మీరు ఈజిప్టు దేశంనుండి బయటకు వెళ్లిన రోజునుండి ఈ చోటికి వచ్చిన ఈ రోజువరకు మీరు యెహోవాకు లోబడుటకు నిరాకరించారు. ఇంకా హొరేబు కొండ దగ్గర కూడ మీరు యెహోవాకు కోపం పుట్టించారు. మిమ్మల్ని నాశనం చేయాల్సినంత కోపం వచ్చింది యెహోవకు. రాతి పలకలను స్వీకరించటానికి నేను కొండమీదికి వెళ్లినప్పుడు (యెహోవా మీతో చేసిన ఒడంబడిక పలకలు) 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను కొండమీదనే ఉన్నాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 10 అప్పుడు ఆ రాతి పలకలను యెహోవా నాకు యిచ్చాడు. ఆ పలకలమీద యెహోవా తన వ్రేలితో వ్రాసాడు. మీరు ఆ కొండ దగ్గర సమావేశమై నప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పినవి అన్ని ఆయన రాసాడు.

11 “కనుక 40 పగళ్లు 40 రాత్రుళ్లు ఆయిపోగానే, ఒడంబడిక రాతి పలకలు రెండింటిని యెహోవా నాకు ఇచ్చాడు. 12 అప్పుడు ‘లేచి త్వరగా ఇక్కడనుండి క్రిందికి వెళ్లు. ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకొనివచ్చిన ప్రజలు వారిని వారే నాశనం చేసుకొన్నారు. నేను వారికి ఆజ్ఞాపించిన విషయాల నుండి త్వరగా వారు తిరిగిపోయారు. వారు బంగారం కరిగించి వారికోసం ఒక విగ్రహం చేసుకొన్నారు’ అని యెహోవా నాతో ఇలా చెప్పాడు.

హెబ్రీయులకు 3:1-11

యేసు మోషే కన్నా గొప్పవాడు

పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను. ఇంటికంటే, ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు. ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు. దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను. కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్నవారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందినవాళ్ళమౌతాము.

దేవుని ప్రజలకు విశ్రాంతి

7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు:

“ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు.
    ఆయన సహనాన్ని పరీక్షించారు.
    కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా
    మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది,
    ‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి,
    నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని
    కోపంతో ప్రమాణం చేశాను.’”(A)

యోహాను 2:13-22

యెసు మందిరాన్ని పరిశుభ్రం చేయటం

(మత్తయి 21:12-13; మార్కు 11:15-17; లూకా 19:45-46)

13 యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. 14 ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు. 15 త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు. 16 పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు.

17 ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు:

“నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.”(A)

18 యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు.

19 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.”

20 యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు.

21 కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. 22 ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International