Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 41

సంగీత నాయకునికి: దావీదు కీర్తన

41 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు.
    కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు.
    ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి.
    దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు.
ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు
    యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు.

నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము.
    నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు.
    “వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు.
    కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు.
ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమే వస్తారు,
    మరియు వారు వెళ్లి, వారి గాలి కబుర్లు ప్రచారం చేస్తారు.
నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబుతారు.
    వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
“ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు.
    ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు.
    నేను అతన్ని నమ్మాను. కాని ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు.
10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము.
    అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను.
11 యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల
    అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి.
    నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.

13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక.
    ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు.
ఆమేన్! ఆమేన్!

కీర్తనలు. 52

సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.

52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
    నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
    సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.

నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
    ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.

మంచి వాళ్లు ఇది చూచి,
    దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
    “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
    ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”

అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
    నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
    నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.

కీర్తనలు. 44

సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవ ధ్యానం.

44 దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము.
    మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు.
    చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు.
దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు.
    మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు.
ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు.
    వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు.
ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసికోలేదు.
    వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు.
నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది.
    దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే!
నా దేవా, నీవు నా రాజువు.
    నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి.
నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు త్రోసివేసాము.
    నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము.
నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను.
    నా ఖడ్గం నన్ను రక్షించజాలదు.
దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు.
    మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు.
మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము!
    నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము!

కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు.
    నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.
10 మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు.
    మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు.
11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్మల్నిచ్చి వేశావు.
    రాజ్యాల మధ్య నీవు మమ్మల్ని చెదరగొట్టావు.
12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు.
    ధర విషయం నీవేమీ వాదించలేదు.
13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు.
    మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు.
14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము.
    ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు.
15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను.
    రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను.
16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు.
    నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు.
17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు.
    అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు.
మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు!
18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు.
    నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు.
19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్మల్ని చితుక గొట్టావు.
    మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్మల్ని కప్పివేశావు.
20 మా దేవుని పేరు మేము మరచిపోయామా?
    అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు!
21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు.
    లోతైన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు.
22 దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము!
    చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము.
23 నా ప్రభువా, లెమ్ము!
    నీవేల నిద్రపోతున్నావు?
    లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము!
24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు?
    మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు?
25 బురదలోకి మేము త్రోసివేయబడ్డాము.
    మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము.
26 దేవా, లేచి మాకు సహాయం చేయుము!
    నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.

ద్వితీయోపదేశకాండము 8:11-20

యెహోవా చేసినదాన్ని మరచిపోకండి

11 “జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు. చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి. 12 మీరు తినేందుకు ఆహారం సమృద్ధిగా మీకు ఉంటుంది, మీరు మంచి యిళ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తారు. 13 మీ పశువులు, మందలు విస్తారంగా పెరుగుతాయి. మీకు మరింత ఎక్కువ వెండి బంగారం ఉంటుంది. మీకు విస్తారంగా వస్తుసామగ్రి ఉంటుంది. 14 అలా జరిగి నప్పుడు మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకూడదు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. 15 భయంకర మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. 16 మీ పూర్వీకులు ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన మిమ్మల్ని అరణ్యంలో పోషించాడు. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని దీనులుగా చేయాలను కొన్నాడు. అంతంలో మీకు అంతా మంచి జరగాలని ఆయన కోరాడు. 17 ‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు. 18 మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించుకొనేందుకు శక్తిని యిచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకంటే మీ పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడికను ఈ వేళ ఆయన నిలబెట్టుకొంటున్నాడు గనుక.

19 “ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువకండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు. 20 దేశాలను మీరు నాశనం చేసేటట్టు యెహోవా చేసాడు. మీ ఎదుట దేశాలను యెహోవా నాశనం చేస్తున్నట్టుగానే మీరూ నాశనం చేయబడతారు. మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయులు కాలేదు గనుక ఇలా జరుగుతుంది.

హెబ్రీయులకు 2:11-18

11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు. 12 ఆయన ఈ విధంగా అన్నాడు:

“నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను.
    సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!”(A)

13 మరొక చోట

“నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!”(B)

అంతేకాక ఇలా కూడా అన్నాడు:

“నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”(C)

14 ఆయన “సంతానమని” పిలువబడినవాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు. 15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు. 16 నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు. 17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు. 18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.

యోహాను 2:1-12

కానా పట్టణంలో వివాహం

మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.

యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.

ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.

ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.

యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.

ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు.

వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, 10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.

11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.

12 ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International