Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 80

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
    మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
    మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
    నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
    మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
    నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

1 సమూయేలు 16:1-13

సమూయేలు బేత్లెహేముకు వెళ్లుట

16 యెహోవా, “ఎంతకాలం ఇలా సౌలుకోసం చింతిస్తావు? ఇశ్రాయేలు రాజుగా సౌలును నేను నిరాకరించాను. నీ కొమ్ములనునూనెతో నింపుకొని వెళ్లు. యెష్షయి అనే మనిషి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. యెష్షయి బేత్లెహేములో నివసిస్తున్నాడు. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎంపిక చేసాను” అని సమూయేలుతో చెప్పాడు.

కానీ, “నేను వెళితే ఈ వార్త సౌలు విని నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తాడు” అని సమూయేలు అన్నాడు.

“నీవు ఒక కోడెదూడను తీసుకుని బెత్లెహేముకు వెళ్లు. ‘యెహోవాకు నేను ఒక బలి అర్పించటానికి వచ్చాను’ అని చెప్పు. బలి కార్యక్రమానికి యెష్షయిని రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమి చేయాలో నేను నీకు తెలియచేస్తాను. నేను నీకు చూపిన మనిషిని నీవు తప్పక అభిషేకించాలి” అని యెహోవా చెప్పాడు.

యెహోవా చెప్పినట్లు సమూయేలు చేసాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్లాడు. బెత్లెహేము పెద్దలు భయంతో వణకిపోయారు. వారు సమూయేలును కలుసుకొని, “నీవు సమాధానంగానే వచ్చావా?” అని అడిగారు.

“అవును నేను సమాధానంగానే వచ్చాను. యెహోవాకు ఒక బలి అర్పించటానికి నేను వచ్చాను. మీరంతా తయారై బలి కార్యక్రమానికి నాతోకూడ రావటానికి సిద్ధపడండి” అని సమూయేలు జవాబు చెప్పాడు. సమూయేలు యెష్షయిని, అతని కుమారులను సిద్ధంచేశాడు. బలి అర్పణలో పాలుపుచ్చుకోమని సమూయేలు వారిని ఆహ్వానించాడు.

యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలంచాడు.

అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు.

అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుటనడిచాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు.

తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువుమని యెష్షయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” అన్నాడు.

10 తన కుమారులు ఏడుగురిని యెష్షయి సమూయేలుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్షయితో చెప్పాడు.

11 అప్పుడు, “నీ కుమారులంతా వీరేనా?” అని సమూయేలు యెష్షయిని అడిగాడు.

“అందరికంటె చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు” అని యెష్షయి జవాబిచ్చాడు.

సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు.

12 యెష్షయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేందుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు ఎర్రటివాడు మరియు చాలా అందగాడు.

“లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!” అని యెహోవా సమూయేలుతో చెప్పాడు.

13 ప్రత్యేక నూనెతో ఉన్న కొమ్మును సమూయేలు తీసుకుని యెష్షయి చిన్న కుమారుని సోదరులందరి ఎదుటనే అతని మీద పోసాడు. ఆ రోజునుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి మహా శక్తివంతంగా వచ్చింది. తరువాత సమూయేలు రామాకు వెళ్లి పోయాడు.

1 యోహాను 2:18-25

క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్త

18 బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది. 19 క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.

20 కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకొన్నారు. 21 మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు వ్రాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యంనుండి అసత్యం బయటకు రాదు.

22 అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి నిరాకరిస్తాడు. 23 కుమారుణ్ణి నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది.

24 మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్లు చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో జీవించగలుగుతారు. 25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు.

కీర్తనలు. 33

33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
    ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
దేవుని మాట సత్యం!
    ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
    యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
    భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
    మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
    ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
    ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
    వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
    ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
    దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
    మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
    ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
    ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
    ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
    తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
    ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
    ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
    ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
    నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
    కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.

అపొస్తలుల కార్యములు 20:17-35

పౌలు ఎఫెసు పెద్దలతో మాట్లాడటం

17 పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు.

18 వాళ్ళు వచ్చాక వాళ్ళతో యిలా చెప్పాడు: “నేను ఆసియలో అడుగు పెట్టిన నాటినుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. 19 యూదుల పన్నాగాలవల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేసాను. 20 ఆత్మీయ విషయాల్లో మీకు ఉపయోగమయ్యే ప్రతీ విషయాన్ని దాచకుండా, బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు. 21 మారుమనస్సు పొంది, దేవుని కోసం జీవించమని, మన యేసు ప్రభువును నమ్మమని యూదులకు, గ్రీకులకు చెప్పాను.

22 “పరిశుద్ధాత్మ చెప్పినట్లు చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను యెరూషలేము వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. 23 నేను కష్టాలు, కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. 24 నా జీవితాన్ని నేను లెక్కచెయ్యను. కాని ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభువు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం.

25 “మళ్ళీ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను. 26 అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. 27 ఎందుకంటే, నేను దేవుడు చెయ్యదలచినదాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను. 28 పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తంతో సంపాదించాడు. మీ విషయంలో, ఈ సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 29 నేను వెళ్ళిపొయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు. 30 మీలోనుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు. 31 అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచిపోకండి.

32 “ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతే కాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీక్కూడా లభించేటట్లు చేస్తుంది. 33 మీనుండి నేను వెండి బంగారాలు కాని, మంచి దుస్తులు కాని ఆశించలేదు. 34 నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. 35 కష్టించి పని చేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చెయ్యటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియ చేసాను. యేసు ప్రభువు, ‘తీసుకోవటంలో కన్నా యివ్వటంలో చాలా దీవెన ఉంది!’ అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని మీకు రుజువు చేసాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International