Book of Common Prayer
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు
14 మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి.
నా ప్రజలకోసం మార్గం చక్కజేయండి.
15 మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు
శాశ్వతంగా జీవించేవాడు,
పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు:
“నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను.
అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను.
ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను.
హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.
16 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను.
నేను ఎప్పటికీ కోపంగానే ఉండను.
నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ,
వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది.
17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది.
కనుక నేను ఇశ్రాయేలును శిక్షించాను.
నేను కోపంగా ఉన్నాను గనుక
అతని నుండి నేను తిరిగిపోయాను.
మరియు ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టాడు.
ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు.
18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. కనుక నేను అతణ్ణి స్వస్థపరుస్తాను (క్షమిస్తాను).
నేను అతణ్ణి ఆదరించి, అతడు బాగానే ఉంది అనుకొనేట్టు చేసే మాటలు నేను చెబుతాను. అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా ఉండరు.
19 ఆ ప్రజలకోసం ‘శాంతి’ అనే క్రొత్త పదం నేను ఉపదేశిస్తాను.
నాకు సమీపంగా ఉన్న ప్రజలకు, చాలా దూరంగా ఉన్న ప్రజలకు, నేను శాంతి ప్రసాదిస్తాను.
ఆ ప్రజలను నేను స్యస్థపరుస్తాను (క్షమిస్తాను).”
ఈ సంగతులు యెహోవా చెప్పాడు.
20 అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహాసముద్రంలాంటి వాళ్లు.
వారు నెమ్మదిగా, శాంతంగా ఉండలేరు.
వారు కోపంగా ఉన్నారు,
మహాసముద్రంలా మట్టిని కెలుకుతారు.
21 “దుష్టులకు శాంతి లేదు”
అని నా దేవుడు చెబుతున్నాడు.
కుమారులు, క్రమశిక్షణ
12 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. 2 మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు. 3 పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు.
దేవుడు తండ్రిలాంటివాడు
4 మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు. 5 మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు:
“నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు!
నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు!
6 ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు.
అంతేకాక తన కుమారునిగా అంగీకరించిన ప్రతి ఒక్కణ్ణి శిక్షిస్తాడు.”(A)
యేసు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడటం
37 పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు. 38 లేఖనాలు చెప్పినట్లు, నన్ను నమ్మిన వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి” అని అన్నాడు. 39 అంటే, తనను నమ్మిన వాళ్ళకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయన మహిమ పర్చబడలేదు. కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ యివ్వలేదు.
ప్రజలు యేసును గురించి వాదించటం
40 ఆయన మాటలు విన్నాక కొందరు, “ఈయన తప్పక ప్రవక్త అయివుండాలి” అని అన్నారు.
41 మరికొందరు, “ఈయన క్రీస్తు అయ్యి ఉండాలి” అని అన్నారు.
కాని యితర్లు, “క్రీస్తు గలిలయనుండి ఎట్లావస్తాడు? 42 ఆయన దావీడు వంశంనుండి, దావీదు నివసించిన బేత్లెహేమునుండి వస్తాడని లెఖానాల్లో వ్రాసారు కదా!” అని అన్నారు. 43 యేసును బట్టి అక్కడున్న ప్రజలలో భేధాభిప్రాయం కలిగింది. 44 కనుక ఆయన్ని బంధించాలనుకున్నారు. కాని ఎవ్వరూ ఆయన పై చెయ్యి వెయ్యలేదు.
యూదుల నాయకులు విశ్వసించకపోవటం
45 చివరకు భటులు ప్రధానయాజకుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు తిరిగి వెళ్ళిపొయ్యారు. వాళ్ళు ఆ భటుల్ని, “అతణ్ణెందుకు పిలుచుకొని రాలేదు?” అని అడిగారు.
46 వాళ్ళు, “అతడు మాట్లాడినట్లు ఇంత వరకు ఎవ్వరూ మాట్లాడలేదు!” అని అన్నారు.
© 1997 Bible League International