Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 16-17

దావీదుకు అభిమాన కావ్యము.

16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
“యెహోవా, నీవు నా యజమానివి
    నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
    అని నేను యెహోవాతో చెప్పాను.
మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
    “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”

కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
    ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
    ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
    యెహోవా, నీవే నన్ను బలపరచావు.
    యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
నా వంతు చాలా అద్భుతమయింది.
    నా స్వాస్థ్యము చాలా అందమయింది.
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
    రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
    ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
    నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
    నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
    నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
    యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
    నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

దావీదు ప్రార్థన.

17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
    నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
    నీవు సత్యాన్ని చూడగలవు.
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
    దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
    నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
    నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
నేను నీ మార్గాలు అనుసరించాను.
    నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
    కనుక ఇప్పుడు నా మాట వినుము.
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
    నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
    నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
    మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
    ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
    వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.

13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
    నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14     యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
    ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.

15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
    మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.

కీర్తనలు. 22

సంగీత నాయకునికి: అయ్యలెత్ షహరు రాగం. దావీదు కీర్తన.

22 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
    నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
    సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
    కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు.
మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.

దేవా, నీవు పవిత్రుడవు.
    నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం.
మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
    అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు.
    వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
కాని, నేను మనిషిని కానా, పురుగునా?
    మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
    నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
    ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో!
    నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”

దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే.
    నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
    నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.

11 కనుక దేవా, నన్ను విడువకు.
    కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
    వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు.
    (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
    వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి.

14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
    నా బలం పోయినది.
నా ఎముకలు విడిపోయాయి.
    నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
    నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది.
    “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి.
    ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది.
    సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు.
17 నేను నా ఎముకల్ని చూడగలను.
    ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు.
    వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు!
18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు.
    నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.

19 యెహోవా, నన్ను విడువకుము!
    నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
    ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
    ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.

22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
    ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
    ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
    ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
    యెహోవా వారిని ద్వేషించడు.
    ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.

25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
    నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
    యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
    మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
    ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
    ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
    సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
    చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
    యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
    దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.

యెషయా 42:1-17

యెహోవా యొక్క ప్రత్యేకమైన సేవకుడు

42 “నా సేవకుణ్ణి చూడండి!
    నేను అతన్ని బలపరుస్తాను.
    నేను ఏర్పరచుకొన్నవాడు అతడే.
    అతని గూర్చి నేను ఎంతో ఆనందిస్తున్నాను.
నా ఆత్మను నేను అతనిలో ఉంచాను.
    జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు.
అతడు వీధుల్లో కేకలు వేయడు
    అతడు గట్టిగా అరిచి శబ్దం చేయడు.
అతడు సౌమ్యుడు. అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు.
    మిణుకు మిణుకు మంటున్న మంటనుగూడ అతడు ఆర్పడు.
    అతడు న్యాయాన్ని ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు.
లోకానికి న్యాయం చేకూర్చేవరకు
    అతడు బలహీనం కాడు, నలిగిపోడు.
దూర స్థలాల్లోని ప్రజలు అతని ఉపదేశాలను విశ్వసిస్తారు.”

ప్రపంచాన్ని చేసినవాడు, పరిపాలించేవాడు యెహోవా

యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.)

“మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను.
    నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను.
ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం.
    నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు.
గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు.
    అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు.
    అనేక మంది ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి నీవు వారిని బయటకు నడిపిస్తావు.

“నేను యెహోవాను.
    నా పేరు యెహోవా.
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
    నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలకు (అబద్ధపు దేవుళ్ళకు) చెందనివ్వను.
కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను,
    ఆ సంగతులు జరిగాయి.
ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి,
    అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబుతాను.”

దేవునికొక స్తుతి గీతం

10 యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి.
    భూమి మీద చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా,
    సముద్రాల్లో ప్రయాణం చేసే సర్వ ప్రజలారా,
    మహా సముద్రాల్లోని సర్వ ప్రాణులారా,
    దూర స్థలాల్లో ఉన్న సర్వ ప్రజలారా యెహోవాను స్తుతించండి!
11 అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు
    యెహోవాను స్తుతించండి
సెలా నివాసులారా ఆనందంగా పాడండి.
    మీ పర్వత శిఖరం మీదనుండి పాడండి.
12 యెహోవాకు మహిమ ఆపాదించండి.
    దూర దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి.
13 యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు.
    ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలూగుతూంటాడు.
ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు.
    ఆయన తన శత్రువులను ఓడిస్తాడు.

దేవుడు చాలా ఓర్పుగలవాడు

14 “చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను.
    నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను నిగ్రహించుకొన్నాను.
కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను.
    నేను కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను.
15 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను.
    అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండిపోయేట్టు చేస్తాను.
నదులను నేను పొడి నేలగా చేస్తాను.
    నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు చేస్తాను.
16 గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను
    ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపిస్తాను.
చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను.
    కరకు నేలను నేను చదును చేస్తాను.
నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను.
    నా ప్రజలను నేను విడువను.
17 కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు.
    బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు.
ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు.
    కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”

ఎఫెసీయులకు 3:1-13

పౌలు యూదులు కానివాళ్ళకు బోధించుట

అందువల్ల యూదులుకాని మీ కోసం పౌలు అను నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను. దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే వుంటారు. ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను యిదివరకే క్లుప్తంగా మీకు వ్రాసాను. క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వికులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులైన అపొస్తలులకు, ప్రవక్తలకు తెలియచేసాడు. ఆ రహస్యం ఏమిటంటే, సువార్తవల్ల యూదులు కానివాళ్ళు ఇశ్రాయేలువాళ్ళతో సహా వారసులౌతారు. వాళ్ళు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసు క్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్ళు భాగస్తులు. ఇది సువార్త వల్ల సంభవిస్తోంది.

దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను. దేవుని ప్రజలందరిలో నేను అధముణ్ణి. అయినా దేవుడు నాకీవరం ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కానివాళ్ళకు బోధించే అవకాశం నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు. అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయమని నాకు అప్పగించాడు. 10 భూమండలంలో ఉన్న పాలకులకు, అధికారులకు సంఘం ద్వారా అన్నిటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన ఉద్దేశ్యం. 11 దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు. 12 క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యతవల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము. 13 మీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాలవల్ల మీకు గౌరవం లభిస్తుంది.

మార్కు 2:13-22

లేవి (మత్తయి) యేసును వెంబడించటం

(మత్తయి 9:9-13; లూకా 5:27-32)

13 యేసు మళ్ళీ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన వాళ్ళకు బోధించటం మొదలుపెట్టాడు. 14 అక్కడి నుండి బయలుదేరి ముందుకు నడుస్తూండగా అల్ఫయి కుమారుడైన లేవి[a] పన్నులు వసూలు చేసే పాకలో కూర్చుని వుండటం చూసాడు. యేసు అతనితో, “నా వెంటరా” అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని అనుసరించాడు.

15 యేసు, ఆయన శిష్యులు లేవి యింట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది యేసు అనుచరులు. 16 పరిసయ్యులలోని శాస్త్రులు యేసు పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో భోజనం చెయ్యటం చూసారు. వాళ్ళు ఆయన శిష్యులతో, “ఆయన పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఎందుకు కలసి తింటాడు?” అని అడిగారు.

17 ఇది విని యేసు వాళ్ళతో, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మత్తయి 9:14-17; లూకా 5:33-39)

18 యోహాను శిష్యులు, పరిసయ్యులు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసాలు చేస్తారు కదా! మీ శిష్యులు ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.

19 యేసు, “పెళ్ళికుమారుడు వాళ్ళతో ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు, 20 కాని, వాళ్ళనుండి పెళ్ళికుమారుణ్ణి తీసుకు వెళ్ళేరోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.

21 “పాత వస్త్రంపై ఉన్న చిరుగుకు క్రొత్త వస్త్రంతో ఎవరు కుడ్తారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి మొదటి చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 22 పాత తోలు సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం ఎవరూ దాచారు. అలా దాస్తే క్రొత్త ద్రాక్షరసం ఆ తోలు సంచిని చినిగేటట్లు చేస్తుంది. తోలుసంచీ, ద్రాక్షారసం రెండూ నాశనమౌతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు సంచుల్లోనే దాచాలి” అని కూడా యేసు అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International