Book of Common Prayer
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
3 ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
వారు యెహోవాను నమ్ముకొంటారు.
4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.
6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.
12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
“యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.
17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.
సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.
54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
2 దేవా, నా ప్రార్థనను,
నేను చెప్పే సంగతులను ఆలకించుము.
3 పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.
4 చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
5 తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.
6 దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
7 నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15 నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.
అష్షూరు గర్వాన్ని దేవుడు శిక్షిస్తాడు
5 దేవుడు అంటాడు: “అష్షూరును నేను ఒక కర్రలా వాడుకొంటాను. కోపంతో నేను ఇశ్రాయేలును శిక్షించడానికి అష్షూరును వాడుకొంటాను.” 6 చెడుకార్యాలు చేసే వారిమీద యుద్ధం చేయటానికి నేను అష్షూరును పంపిస్తాను. వాళ్ల మీద నేను కోపంగా ఉన్నాను. వారిమీద యుద్ధం చేయమని అష్షూరుకు నేను ఆజ్ఞాపిస్తాను. వారిని అష్షూరు ఓడించి, వారి ఐశ్వర్యాలను కొల్లగొట్టుకొంటారు. ఇశ్రాయేలీయులు, వీధుల్లో అష్షూరు వారి పాదాల క్రింద తొక్కబడే ధూళిలా ఉంటారు.
7 “అయితే అష్షూరును నేను వాడుకొంటాను అనే విషయం వారికి తెలియదు. అష్షూరు నాకు ఒక సాధనం అని అతనికి తెలియదు. ఇతరులను నాశనం చేయటమే అష్షూరుకు కావాలి. అష్షూరు అనేక రాజ్యాలను నాశనం చేయాలని మాత్రమే పథకం వేస్తుంది. 8 అష్షూరు తనకు తాను ఇలా చెప్పుకొంటాడు, ‘నా నాయకులంతా రాజుల్లాంటి వాళ్లు. 9 కల్కో పట్టణం కర్కెమీషు పట్టణంలా ఉంటుంది. అర్పాదు పట్టణం హమాతు పట్టణంలా ఉంటుంది. షోమ్రోను పట్టణం దమస్కు పట్టణంలా ఉంటుంది. 10 అనేక విగ్రహాలున్న ఆ రాజ్యాలను నేను ఓడించేశాను, ఇప్పుడు అవి నా అధికారంలో ఉన్నాయి. వాళ్లు పూజించే విగ్రహాలు యెరూషలేము, సమరయలో ఉన్న విగ్రహాలకంటె గొప్పవి. 11 షోమ్రోనును, దాని విగ్రహాలను నేను ఓడించాను. యెరూషలేమును, దాని ప్రజలు తయారుచేసిన విగ్రహాలను కూడ నేను ఓడిస్తాను.’”
12 యెరూషలేముకు, సీయోను కొండకు నా ప్రభువు చేయదలచిన వాటిని చేయటం ముగిస్తాడు. అప్పుడు యెహోవా అష్షూరును శిక్షిస్తాడు. అష్షూరు రాజు చాలా గర్విష్ఠి. అతడు గర్వం చేత చాలా చెడ్డ పనులు చేశాడు. అందుచేత దేవుడు అతణ్ణి శిక్షిస్తాడు.
13 అష్షూరు రాజు అంటున్నాడు: “నేను చాలా తెలివిగలవాడ్ని. నా స్వంత జ్ఞానం, శక్తి మూలంగా నేను ఎన్నోగొప్ప కార్యాలు చేశాను. అనేక రాజ్యాల్ని నేను ఓడించాను. వారి ఐశ్వర్యం నేను దోచుకొన్నాను. వారి ప్రజలను నేను బానిసలుగా చేసుకొన్నాను. నేను చాలా శక్తిగలవాణ్ణి. 14 ఒకడు పక్షి గూటిలోనుండి గుడ్లు తీసినట్టుగా, నేను నా స్వంత చేతుల్తో ఈ ప్రజలందరి సంపదలు తీసుకొన్నాను. ఒక పక్షి తన గూడును, గుడ్లను తరచు విడిచిపెడ్తుంటుంది. ఆ గూటిని కాపాడేందుకు ఏమీ లేదు. కిచకిచలాడ్తూ, తన రెక్కలతో, ముక్కుతో కొట్లాడేందుకు అక్కడ ఏ పక్షి లేదు. అందుచేత మనుష్యులు ఆ గుడ్లు తీసుకొంటారు. ఆదే విధంగా భూలోకంలోని మనుష్యులందరినీ నేను తీసుకొనకుండా నన్ను ఆపగలిగిన వాడు ఎవడూ లేడు.”
15 గొడ్డలి, దానిని ప్రయోగించే వానికంటె గొప్పదేంకాదు. రంపం, దానితో కోసే వానికంటె గొప్పదేంకాదు. కాని అష్షూరు తాను దేవునికంటే ముఖ్యం అనుకొంటుంది. ఎవరినైనా శిక్షించేందకు ఒకడు బెత్తం తీసుకొని ప్రయోగిస్తే, అతనికంటె ఆ బెత్తం ఎక్కువ శక్తి గలది, ముఖ్యమయింది అన్నట్టు ఉంటుంది. 16 అష్షూరు చాల గొప్పవాడ్ని అని అనుకొంటాడు. కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా అష్షూరు మీదికి గొప్ప రోగం పంపిస్తాడు. ఒక రోగి బరువు కోల్పోయినట్టు అష్షూరు తన ఐశ్వర్యాన్ని, శక్తిని పోగొట్టుకొంటాడు. అప్పుడు అష్షూరు మహిమ నాశనం అవుతుంది. సర్వం పోయేవరకు మండుతూ ఉండే అగ్నిలా అది ఉంటుంది. 17 ఇశ్రాయేలు వెలుగు (దేవుడు) అగ్నిలా ఉంటాడు. ఆ పరిశుద్ధుడు ఒక జ్వాలలా ఉంటాడు. మొట్టమొదట పొదలను, ముళ్లకంపలను కాల్చేసే అగ్నిలా ఆయన ఉంటాడు. 18 ఆ తర్వాత అగ్ని మహా వృక్షాలను, ద్రాక్షాతోటలను కాల్చివేస్తుంది. చివరికి సర్వం, ప్రజలతో సహా నాశనం చేయబడుతుంది. దేవుడు అష్షూరును నాశనం చేసినప్పుడు అలా ఉంటుంది. అష్షూరు కుళ్లిపోతున్న మొద్దులా ఉంటుంది. 19 అరణ్యంలో కొన్ని చెట్లు మాత్రం నిలిచి ఉండవచ్చు. కానీ అవి ఒక పిల్లవాడు కూడ లెక్కబెట్ట గలిగినన్ని ఉంటాయి.
17 ఇలాంటి దుర్బోధకులు నీళ్ళు లేని బావుల్లాంటివాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొనిపోయే మేఘాల్లాంటివాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు. 18 ఆ బోధకులు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంతేకాక, అప్పుడే మోసగాళ్ళ నుండి తప్పించుకొన్న వ్యక్తుల శారీరక వాంఛల్ని ప్రేరేపించి, అడ్డదారి పట్టిస్తూ ఉంటారు. 19 తాము స్వయంగా దుర్వ్యసనాలకు బానిసలై ఉండి, యితరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తూ ఉంటారు. తనను జయంచినదానికి మానవుడు బానిసై పోతాడు.
20 ప్రపంచంలో ఉన్న దుర్నీతి నుండి తప్పించుకోవాలంటే, మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తును తెలుసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆ దుర్నీతిలో చిక్కుకొని బానిసలైతే యిప్పటి స్థితి మునుపటి స్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది. 21 వాళ్ళకందివ్వబడిన పవిత్ర ఆజ్ఞను తెలుసుకుని వెనక్కి మళ్ళటం కన్నా ఆ ధర్మమార్గాన్ని తెలుసుకోకపోయినట్లయితే ఉత్తమంగా ఉండేది. 22 అలా వెనక్కు మళ్ళిన వాళ్ళ విషయంలో ఈ సామెతలు నిజమౌతాయి: “కుక్క తాను కక్కిన దాన్ని తిరిగి తింటుంది. దేహాన్ని కడిగిన పంది బురదలో పొర్లాడటానికి తిరిగి వెళ్తుంది.”
2 కారాగారంలోవున్న యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నాడు. అతడు తన శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి, 3 వాళ్ళ ద్వారా, “రావలసిన వాడవు నువ్వేనా? లేక మరెవరికోసమైనా మేము ఎదురు చూడాలా?” అని అడిగించాడు.
4 యేసు, “మీరు విన్నవాటిని గురించి, చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి. 5 గ్రుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారని, కుంటివాళ్ళు నడువ గలుగుతున్నారని, కుష్టురోగులకు నయమైపోతోందని, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారని, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తున్నారని, సువార్త పేదవాళ్ళకు ప్రకటింపబడుతోందని చెప్పండి. 6 నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు.
7 యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే, యేసు యోహానును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాల్లోకి ఏం చూడాలని వెళ్ళారు? గాలికి కొట్టుకొనే రెల్లును చూడాలని వెళ్ళారా? 8 మరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి దుస్తులు వేసుకొన్న మనిషిని చూడాలని వెళ్ళారా? మంచి దుస్తులు వేసుకొన్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు. 9 మరి, ఏం చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? అవును, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను. 10 అతణ్ణి గురించి ఈ విధంగా వ్రాసారు:
‘నీ కన్నా ముందు నా దూతను పంపుతాను,
అతడు నీ కన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు.’(A)
11 “ఇది సత్యం. ఇదివరకు జన్మించిన వాళ్ళలో బాప్తిస్మము ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు. 12 బాప్తీస్మము ఇచ్చే యోహాను కాలం నుండి, నేటివరకు దేవుని రాజ్యం ముందడుగు వేస్తూవుంది. శక్తిగల వాళ్ళు దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు. 13 యోహాను కాలం వరకు ప్రవక్తలు, ధర్మశాస్త్రము వీటిని గురించి వచించటం జరిగింది. 14 ఆ యోహానే రానున్న ఏలీయా. ఇష్టముంటే అంగీకరించండి. 15 ఇష్టమున్నవాడు వింటాడు.
© 1997 Bible League International