Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 41

సంగీత నాయకునికి: దావీదు కీర్తన

41 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు.
    కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు.
    ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి.
    దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు.
ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు
    యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు.

నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము.
    నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు.
    “వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు.
    కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు.
ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమే వస్తారు,
    మరియు వారు వెళ్లి, వారి గాలి కబుర్లు ప్రచారం చేస్తారు.
నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబుతారు.
    వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
“ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు.
    ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు.
    నేను అతన్ని నమ్మాను. కాని ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు.
10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము.
    అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను.
11 యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల
    అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి.
    నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.

13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక.
    ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు.
ఆమేన్! ఆమేన్!

కీర్తనలు. 52

సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.

52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
    నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
    సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.

నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
    ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.

మంచి వాళ్లు ఇది చూచి,
    దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
    “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
    ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”

అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
    నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
    నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.

కీర్తనలు. 44

సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవ ధ్యానం.

44 దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము.
    మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు.
    చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు.
దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు.
    మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు.
ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు.
    వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు.
ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసికోలేదు.
    వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు.
నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది.
    దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే!
నా దేవా, నీవు నా రాజువు.
    నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి.
నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు త్రోసివేసాము.
    నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము.
నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను.
    నా ఖడ్గం నన్ను రక్షించజాలదు.
దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు.
    మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు.
మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము!
    నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము!

కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు.
    నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.
10 మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు.
    మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు.
11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్మల్నిచ్చి వేశావు.
    రాజ్యాల మధ్య నీవు మమ్మల్ని చెదరగొట్టావు.
12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు.
    ధర విషయం నీవేమీ వాదించలేదు.
13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు.
    మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు.
14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము.
    ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు.
15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను.
    రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను.
16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు.
    నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు.
17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు.
    అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు.
మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు!
18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు.
    నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు.
19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్మల్ని చితుక గొట్టావు.
    మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్మల్ని కప్పివేశావు.
20 మా దేవుని పేరు మేము మరచిపోయామా?
    అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు!
21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు.
    లోతైన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు.
22 దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము!
    చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము.
23 నా ప్రభువా, లెమ్ము!
    నీవేల నిద్రపోతున్నావు?
    లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము!
24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు?
    మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు?
25 బురదలోకి మేము త్రోసివేయబడ్డాము.
    మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము.
26 దేవా, లేచి మాకు సహాయం చేయుము!
    నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.

యెషయా 8:16-9:1

16 యెషయా చెప్పాడు, “ఒక ఒడంబడిక చేసి, దాన్ని ముద్రించండి. నా ఉపదేశాలను భవిష్యత్తు కోసం భద్రపర్చండి. నన్ను అనుసరించే వాళ్లు చూస్తూ ఉండగా దీనిని చేయండి.”

17 ఆ ఒడంబడిక ఇదేః యెహోవా మాకు సహాయం చేసేవరకు నేను వేచి ఉంటాను.
యాకోబు (ఇశ్రాయేలు) వంశం విషయం యెహోవా సిగ్గు పడుతున్నాడు. ఆయన వాళ్లను చూచేందుకు నిరాకరిస్తున్నాడు.
కానీ నేను యెహోవా కోసం నిరీక్షిస్తాను.
ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు.

18 “ఇశ్రాయేలు ప్రజలకు నేనూ, నా పిల్లలే సూచనగా రుజువుగా ఉన్నాము. సీయోను కొండమీద నివాసం చేసే సర్వశక్తిమంతుడైన యెహోవా మమ్మల్ని పంపించాడు.”

19 కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బ్రతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి? 20 మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. ఈ ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆ ఆదేశాలను పాటించటం వల్ల మీకేమీ లాభం ఉండదు.) 21 ఆ తప్పు ఆదేశాలను మీరు పాటిస్తే దేశంలో కష్టాలు, ఆకలి ఉంటాయి. ప్రజలు ఆకలితో ఉంటారు. అప్పుడు వాళ్లకు కోపం వచ్చి రాజును, అతని దేవుళ్లను తిడతారు. అప్పుడు వాళ్లు సహాయం కోసం దేవునివైపు చూస్తారు. 22 వారు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడుతుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు తమను తాము విడిపించుకోలేరు.

ఒక క్రొత్త రోజు వస్తుంది

గతంలో జెబూలూను దేశం, నఫ్తాలి దేశం ముఖ్యంకాదు అనుకొన్నారు. కానీ ఉత్తరార్థంలో దేవుడు ఆ దేశాన్ని గొప్ప చేస్తాడు. సముద్రం దగ్గర దేశం, యొర్దాను నది అవతల దేశం, యూదులు కానివారు నివసించే గలిలయ.

2 పేతురు 1:1-11

యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్ళకు వ్రాస్తున్నది.

దేవుణ్ణి గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.

మనకవసరమైన ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చాడు

మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. ఈ విధంగా, అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసాడు.

అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి. ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి, తాను యిదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచిపోయాడన్నమాట.

10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు. 11 తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది.

లూకా 22:39-53

యేసు ఏకాంతంగా ప్రార్థించటం

(మత్తయి 26:36-46; మార్కు 14:32-42)

39 “అలవాటు ప్రకారం యేసు ఒలీవల కొండ మీదికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. 40 అక్కడికి చేరుకొన్నాక వాళ్ళతో, మీరు శోధనలో పడకుండ ఉండటానికి ప్రార్థించాలి” అని అన్నాడు.

41 ఆయన వాళ్ళనుండి రాయి విసిరినంత దూరం వెళ్ళి, మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు: 42 “తండ్రీ! నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివెయ్యి. కాని నెరవేరవలసింది నా యిచ్ఛ కాదు: నీది.” 43 అప్పుడు ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి ఆయనకు శక్తినివ్వటానికి ప్రత్యక్షమైనాడు. 44 ఆయన ఆవేదనతో యింకా తీవ్రంగా దేవుణ్ణి ప్రార్థించాడు. నేలమీద పడ్తున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా ఉన్నాయి. 45 ప్రార్థించటం ముగించాక ఆయన తన శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. దుఃఖంవల్ల అలసిపోయి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. 46 వాళ్ళతో, “ఎందుకు పడుకున్నారు? లేచి మీరు శోధింపబడకూడదని ప్రార్థించండి” అని అన్నాడు.

యేసును బంధించటం

(మత్తయి 26:47-56; మార్కు 14:43-50; యోహాను 18:3-11)

47 ఆయనింకా మాట్లాడుతుండగా ప్రజల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. పన్నెండుమందిలో ఒకడైన యూదా అన్నవాడు అందరి కన్నా ముందు ఉన్నాడు. వాడు యేసును ముద్దు పెట్టుకోవటానికి ఆయన దగ్గరకు వెళ్ళాడు.

48 కాని యేసు వానితో, “యూదా! ముద్దు పెట్టుకొని దేవుని కుమారునికి ద్రోహం చెయ్యాలని నీ ఉద్దేశ్యమా?” అని అడిగాడు. 49 యేసు శిష్యులు జరుగబోయే సంఘటనను గ్రహించారు. వాళ్ళు, “ప్రభూ! మా కత్తులతో వాళ్ళను నరకమంటారా?” అని అడిగారు. 50 ఇంతలో ఆయన శిష్యుల్లో ఒకడు తన కత్తి దూసి ప్రధానయాజకుని సేవకుని యొక్క కుడిచెవి నరికి వేశాడు.

51 యేసు, “ఆపండి” అని అంటూ ఆ సేవకుని చెవి తాకి అతనికి నయం చేశాడు.

52 ఆ తర్వాత యేసు తనను బంధించటానికి వచ్చిన ప్రధానయాజకులతో, మందిరం యొక్క ముఖ్య ద్వారపాలకులతో, పెద్దలతో ఈ విధంగా అన్నాడు: “నేనొక దొంగనైనట్లు మీరు కత్తులతో, కర్రలతో రావలసిన అవసరమేమొచ్చింది? 53 నేను మీతోపాటు ప్రతిరోజు ఆలయంలో ఉన్నాను. కాని మీరు అప్పుడు నన్ను బంధించలేదు. ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International