Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 25

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.
    కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే
    అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.
    అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.
    ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.
    ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.
    నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.
    నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.
    నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,
    నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను.
    కనుక నన్ను కాపాడుము.
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

కీర్తనలు. 9

సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.

పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
    యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
    మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
    కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.

నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
    యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
    యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
    బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
శత్రువు పని అంతం అయిపోయింది.
    యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
    ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
    ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
    యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
    గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
    యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

10 నీ నామం తెలిసిన ప్రజలు
    నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
    సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
    యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
    ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
    మరి యెహోవా వారిని మరచిపోలేదు.

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
    నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
    ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
    నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
    కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
    ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
    కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
    యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
    ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
    కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
    వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
    వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

కీర్తనలు. 15

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

యెషయా 5:8-12

మీరు చాలా కిక్కిరిసి నివసిస్తారు. ఇంక దేనికి స్థలంలేనంతగా మీరు ఇళ్లు నిర్మించేస్తారు. కానీ యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దేశం మొత్తంలో మీరు మాత్రమే ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవా నాతో ఇలా చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లన్నీ నాశనం చేయబడుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు ఖాళీ అయిపోతాయి. 10 ఆ సమయంలో ఒక పదెకరాల ద్రాక్షాతోట కొంచెం మాత్రమే ద్రాక్షారసం ఇస్తుంది. చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం దిగుబడి అవుతుంది.”

11 మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుంటారు. ద్రాక్షామద్యంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకువగా ఉంటారు. 12 మీరు ద్రాక్షామద్యంతో, సితారాలు, డప్పులు, పిల్లన గ్రోవులు, ఇతర సంగీత వాయిద్యాలతో మీరు విందులు చేసుకొంటారు. యెహోవా చేసిన కార్యాలు మీరు చూడరు. యెహోవా హస్తాలు ఎన్నెన్నో కార్యాలు చేశాయి. కాని మీరు వాటిని గమనించరు. అందుచేత అది మీకు చాలా కీడు.

యెషయా 5:18-23

18 ఆ మనుష్యుల్ని చూడండి. మనుష్యులు తాళ్లతో బండ్లను లాగినట్టు, వాళ్లు తమ పాపాల్ని దోషాన్ని వారి వెనుక లాగుతున్నారు. 19 వాళ్లు అంటారు: “దేవుడు చేయాలనుకొనే పనులు ఆయన త్వరగా చేస్తే బాగుండును. అప్పుడు జరిగేది ఏమిటో మాకు తెలుస్తుంది. యెహోవా పథకం త్వరగా జరిగిపోతే బాగుండును. ఆయన పథకం ఏమిటో అప్పుడు మాకు తెలుస్తుంది.”

20 ఆ మనుష్యులు మంచివాటిని చెడ్డవి అంటారు, చెడ్డవాటిని మంచివి అంటారు. వెలుగును చీకటి అని, చీకటిని వెలుగు అని వాళ్లు అనుకొంటారు. వాళ్లు చేదును తీపి, తీపిని చేదు అనుకొంటారు. 21 వాళ్లు చాలా తెలివిగల వాళ్లు అని ఆ మనుష్యులు తలస్తారు. వాళ్లు చాలా జ్ఞానంగలవాళ్లు అని తలస్తారు. 22 ద్రాక్షామద్యం తాగటంలో ఆ మనుష్యులు చాలా ప్రసిద్ది. మద్యము కలపటంలో వారు ప్రముఖులు. 23 మీరు వారికి డబ్బు చెల్లిస్తే, వారు నేరస్థుల్ని క్షమించేస్తారు. కానీ వారు మంచి వాళ్లకు న్యాయం జరుగనివ్వరు.

1 థెస్సలొనీకయులకు 5:1-11

ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి

సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలాలను గురించి మేము వ్రాయనవసరం లేదు. ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు. ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.

కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు. మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించినవాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించినవాళ్ళము కాము. మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను, రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగాను ధరించుదాము.

ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు. 10 మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు. 11 మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహపరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.

లూకా 21:20-28

యేసు యెరూషలేము నాశనమౌతుందని చెప్పటం

(మత్తయి 24:15-21; మార్కు 13:14-19)

20 “యెరూషలేము చుట్టూ సైన్యాలు చూసినప్పుడు అది నాశనమయ్యే రోజులు వచ్చాయని గ్రహించండి. 21 అప్పుడు యూదయలో ఉన్న మీరు పరుగెత్తి కొండల మీదికి వెళ్ళండి. పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపొండి. గ్రామాల్లో ఉన్న వాళ్ళు పట్టణాల్లోకి వెళ్ళకండి. 22 ఇది శిక్షా సమయం. ఇదివరకు లేఖనాల్లో వ్రాసినవన్నీ నిజంకానున్న సమయం. 23 ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత కష్టం కలుగుతుందో కదా! ఈ దేశానికి పెద్ద దుఃఖంకలుగనున్నది. దేవుడు తన కోపాన్ని ఈ దేశంపై చూపనున్నాడు. 24 కొందరు కత్తికి బలి అవుతారు. మరి కొందరు ఖైదీలుగా యితర దేశాలకు తీసుకు వెళ్ళబడతారు. యూదులుకాని వాళ్ళ కాలం ముగిసేదాకా వాళ్ళు యెరూషలేమును అణగత్రొక్కి ఉంచుతారు.

భయపడవద్దు

(మత్తయి 24:29-31; మార్కు 13:24-27)

25 “సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచనలు కన్పిస్తాయి. సముద్రాల రోదనకు, తీవ్రమైన అలలకు దేశాలు భయపడి కలవరం చెందుతాయి. 26 రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి. 27 అప్పుడు శక్తితో, గొప్ప తేజస్సుతో మేఘం మీద మనుష్యకుమారుడు రావటం వాళ్ళు చూస్తారు. 28 ఇవి జరగటం మొదలైనప్పుడు లేచి మీ తలలెత్తి చూడండి. అంటే మీకు రక్షణ దగ్గరకు వచ్చిందని అర్థం” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International