Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 16-17

దావీదుకు అభిమాన కావ్యము.

16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
“యెహోవా, నీవు నా యజమానివి
    నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
    అని నేను యెహోవాతో చెప్పాను.
మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
    “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”

కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
    ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
    ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
    యెహోవా, నీవే నన్ను బలపరచావు.
    యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
నా వంతు చాలా అద్భుతమయింది.
    నా స్వాస్థ్యము చాలా అందమయింది.
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
    రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
    ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
    నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
    నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
    నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
    యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
    నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

దావీదు ప్రార్థన.

17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
    నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
    నీవు సత్యాన్ని చూడగలవు.
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
    దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
    నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
    నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
నేను నీ మార్గాలు అనుసరించాను.
    నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
    కనుక ఇప్పుడు నా మాట వినుము.
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
    నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
    నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
    మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
    ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
    వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.

13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
    నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14     యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
    ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.

15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
    మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.

కీర్తనలు. 22

సంగీత నాయకునికి: అయ్యలెత్ షహరు రాగం. దావీదు కీర్తన.

22 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
    నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
    సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
    కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు.
మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.

దేవా, నీవు పవిత్రుడవు.
    నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం.
మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
    అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు.
    వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
కాని, నేను మనిషిని కానా, పురుగునా?
    మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
    నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
    ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో!
    నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”

దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే.
    నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
    నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.

11 కనుక దేవా, నన్ను విడువకు.
    కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
    వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు.
    (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
    వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి.

14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
    నా బలం పోయినది.
నా ఎముకలు విడిపోయాయి.
    నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
    నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది.
    “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి.
    ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది.
    సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు.
17 నేను నా ఎముకల్ని చూడగలను.
    ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు.
    వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు!
18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు.
    నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.

19 యెహోవా, నన్ను విడువకుము!
    నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
    ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
    ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.

22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
    ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
    ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
    ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
    యెహోవా వారిని ద్వేషించడు.
    ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.

25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
    నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
    యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
    మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
    ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
    ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
    సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
    చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
    యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
    దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.

యెషయా 3:8-15

యెరూషలేము తొట్రిల్లి, తప్పు చేసింది గనుక ఇలా జరుగుతుంది. యూదా పతనమై, యెహోవాను వెంబడించటం మానివేసింది. వారు చెప్పేవి, చేసేవి యెహోవాకు విరుద్ధం. యెహోవా మహిమ నేత్రాలు వీటన్నింటిని తేటగా చూస్తాయి.

మనుష్యులు తప్పు చేసిన దోషులని వారి ముఖాలు చెబుతున్నాయి. పైగా వారు వారి పాపము గూర్చి అతిశయిస్తున్నారు. వారు సొదొమ పట్టణ ప్రజల్లా ఉన్నారు. వారి పాపాన్ని ఎవరు చూసినా లెక్క చేయరు. అది వారికి ఎంతో కీడు. వాళ్లకు వాళ్లే చాలా కష్టం తెచ్చుకొన్నారు.

10 మంచి వారికి మంచి సంగతులు జరుగుతాయని మంచి వారితో చెప్పుము. వారు చేసే మంచి పనులకు వారికి బహుమానం లభిస్తుంది. 11 కానీ చెడ్డ వాళ్లకు అది చాలా చెడుగా ఉంటుంది. వారికి చాలా కష్టం వస్తుంది. వారు చేసిన చెడు పనులన్నింటి కోసం వారు శిక్షించబడతారు. 12 చిన్న పిల్లలు నా ప్రజలను ఓడించేస్తారు. స్త్రీలు నా ప్రజల మీద ఏలుబడి చేస్తారు.

నా ప్రజలారా మీ మార్గ దర్శకులు మిమ్మల్ని తప్పు దారిలో నడిపిస్తున్నారు. సరియైన దారినుండి వారు మిమ్మల్ని తప్పించేస్తున్నారు.

తన ప్రజల గురించి దేవుని నిర్ణయం

13 ప్రజలకు తీర్పు తీర్చేందుకు యెహోవా నిలుస్తాడు. 14 పెద్దలు, నాయకులు చేసిన పనుల మూలంగా యెహోవా వారికి తీర్పు తీరుస్తాడు.

యెహోవా చెబుతున్నాడు, “మీరు ద్రాక్ష తోటలను తగులబెట్టేశారు (యూదా) పేద ప్రజల దగ్గర్నుండి మీరు తీసుకొన్న వస్తువులు ఇంకా మీ ఇండ్లలో ఉన్నాయి. 15 నా ప్రజలను బాధించుటకు మీకు హక్కు ఎక్కడిది? పేద ప్రజల ముఖాలను కృంగదీయుటకు మీకు హక్కు ఎక్కడిది?” నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

1 థెస్సలొనీకయులకు 4:1-12

దేవునికి నచ్చిన జీవితం

సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి.[a] పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము. దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించినవాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించినవాడౌతాడు.

సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనమని దేవుడే మీకు బోధించాడు. 10 నిజానికి మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

11 మేమిదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించాలని ఆశించండి. మీ స్వహస్తాలతో పని చేస్తూ యితర్ల జోలికి పోకుండా జీవించండి. 12 అలా చేస్తే మీ నిత్య జీవితాన్ని చూసి యితర్లు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు యితర్లపై ఆధారపడనవసరం ఉండదు.

లూకా 20:41-21:4

క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?

(మత్తయి 22:41-46; మార్కు 12:35-37)

41 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు? 42-43 దావీదు, తన కీర్తనలో ఈ విధంగా వ్రాశాడు కదా!

‘ప్రభువు నా ప్రభువుతో:
నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకూ
    నా కుడి వైపు కూర్చో’(A)

44 దావీదు ఆయన్ని ‘ప్రభూ!’ అని అన్నాడు కదా! అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అని అన్నాడు.

శాస్త్రుల్ని విమర్శించటం

(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 11:37-54)

45 ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు: 46 “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు. 47 వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”

నిజమైన కానుక

(మార్కు 12:41-44)

21 యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు హుండీలో కానుకలు వేయటం ఆయన గమనించాడు. అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు. ఆయన, “నేను చెప్పేదేమిటంటే ఈ బీదవితంతువు అందరికన్నా ఎక్కువ ఆ హుండిలో వేసింది. యితర్లు తమ దగ్గరున్న సంపద నుండి కొంత మాత్రమే కానుకగా వేసారు. కాని ఆమె తాను జీవించటానికి దాచుకొన్నదంతా ఆ హుండీలో వేసింది” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International