Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 137

137 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
    సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లకు[a] మన సితారాలు తగిలించాము.
బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
    సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
    సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు.
కాని విదేశంలో మనం యెహోవాకు
    కీర్తనలు పాడలేము!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
    నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
    నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
    వాగ్దానం చేస్తున్నాను.

యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
    యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము.
    దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
    నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
    నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.

కీర్తనలు. 144

దావీదు కీర్తన.

144 యెహోవా నా దుర్గం.[a] యెహోవాను స్తుతించండి.
    యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు.
    పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం.
యెహోవా నన్ను రక్షిస్తాడు,
    యెహోవా నా కేడెం.
నేను ఆయనను నమ్ముతాను.
    నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం?
    నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
మనిషి జీవితం గాలి బుడగలాంటిది.
    వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.

యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము.
    పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది.
యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము.
    నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.
యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము.
    ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము.
    ఇతరుల నుండి నన్ను రక్షించుము.
ఈ శత్రువులు అబద్ధీకులు.
    వారు అసత్య విషయాలు చెబుతారు.

యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.
    పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.
    యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.
    ఈ శత్రువులు అబద్ధీకులు.
    వారు అసత్యాలు చెబుతారు.

12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
    మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
13 మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో
    నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా
    పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
14     మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.
శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను.
    మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను.
మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.

15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.
    యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.

కీర్తనలు. 104

104 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
    యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు.
మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
    ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు.
ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
    దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు.
దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు.
    గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు.
    నీ సేవకులను అగ్నిలా చేశావు.
దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు.
    కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు.
    నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి.
    దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత
    నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
సముద్రానికి నీవు హద్దులు నియమించావు.
    నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.

10 దేవా, నీటి ఊటలనుండి నీటి కాలువలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు.
    పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని క్రిందికి కాలువలా ప్రవహింపజేసావు.
11 నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి.
    అక్కడ నీళ్లు త్రాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి.
12 నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి.
    సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి.
13 దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు.
    దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి.
14 దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు.
మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం.
15 దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు.
    మా చర్మాన్ని నునుపు చేసే[a] తైలాన్ని నీవు మాకిస్తావు.
    మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు.

16 లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు.
    ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి.
17 పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి.
    పెద్ద కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
18 పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం,
    పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు.

19 దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము.
    ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.
20 చీకటిని నీవు రాత్రిగా చేశావు.
    ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి.
21 సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి.
    అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను అడుగుతున్నట్టు ఉంటుంది.
22 మరల సూర్యుడు ఉదయించినప్పుడు
    ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి.
23 అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు.
    సాయంత్రం వరకు వారు పని చేస్తారు.

24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
    భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
    నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
    మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
    మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
    నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[b] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.

27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
    దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
    మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
    అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
    మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
    భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.

31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
    యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
    అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
    వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.

33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
    నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
    దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!

యెహోవాను స్తుతించు!

జెకర్యా 14:12-21

12 కాని యెరూషలేముతో యుద్ధం చేసిన దేశాలన్నిటినీ యెహోవా శిక్షిస్తాడు. ఆ మనుష్యులకు ఒక భయంకర వ్యాధి సోకేలా ఆయన చేస్తాడు. ఆ జనులు జీవించి వుండగానే వారి శరీరాలు కుళ్లిపోవటం ప్రారంభిస్తాయి. వారి కండ్లు కనుగుంటలలోనే కుళ్లిపోతాయి. నాలుక నోటిలోనే కుళ్లనారంభిస్తుంది. 13-15 ఆ భయంకర వ్యాధి శత్రు స్థావరంలో ప్రబలుతుంది. పైగా వారి గుర్రాలు, కంచర గాడిదలు, ఒంటెలు మరియు గాడిదలు కూడ ఆ భయంకర వ్యాధికి గురౌతాయి.

ఆ సమయంలో ఆ ప్రజలు యెహోవా అంటే నిజంగా భయపడతారు. వారు ఒకరి కొకరు విరోధులై, ఒకరినొకరు పట్టుకుంటారు. యూదా ప్రజలు కూడా యెరూషలేముకు విరుద్ధంగా యుద్ధం చేస్తారు. నగరం చుట్టూవున్న దేశాలనుండి వారికి ధనం లభిస్తుంది. వారికి బంగారం, వెండి, బట్టలు విస్తారంగా లభిస్తాయి. 16 యెరూషలేముపై యుద్ధానికి వచ్చినవారిలో కొంతమంది బ్రతుకుతారు. వారు ప్రతి సంవత్సరం రాజును, సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి వస్తారు. పర్ణశాలల పండుగను చేసుకోటానికి వారు వస్తారు. 17 ఈ భూమిమీద ఏ వంశంవారైనా సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్ళకపోయినట్లయితే, యెహోవా వారికి వర్షాలు లేకుండా చేస్తాడు. 18 ఈజిప్టు (ఐగుప్తు) నుండి ఏ వంశంవారైనా పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రాకపోయినట్లయితే, యెహోవా శత్రు దేశాలకు సంభవింపజేసిన ఆ భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు. 19 పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రానటువంటి ఈజిప్టుకు, మరి ఏ ఇతర దేశానికైనా అదే శిక్ష.

20 ఆ సమయంలో ప్రతిదీ దేవునికి చెందివుంటుంది. గుర్రాలమీది జీనులకు కూడ “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు కట్టబడతాయి. బలిపీఠంవద్ద వుంచబడిన గిన్నెలవలె యెహోవా ఆలయంలో వాడబడే పాత్రలన్నీ ప్రాముఖ్యంగల వస్తువులే. 21 వాస్తవానికి యెరూషలేము, యూదాలలోగల ప్రతి పాత్రమీద “సర్వశక్తిమంతుడైన యెహోవాకు పవిత్రమైనది” అని వ్రానిన చీటి అంటించబడుతుంది. యెహోవాను ఆరాధించే ప్రతి వ్యక్తి ఆ పాత్రలలో వండి, తినగలిగినవారై ఉంటారు.

ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారస్తులెవ్వరూ వుండరు.

ఫిలిప్పీయులకు 2:1-11

క్రీస్తు వినయంను అనుకరించుట

క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా! అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి. స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.

నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి

యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.

ఆయన దేవునితో సమానము.
    అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
ఆయన అంతా వదులుకొన్నాడు.
    మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
    మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
    మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
    అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
    ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
    తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!

లూకా 19:41-48

యేసు యెరూషలేమును చూచి యేడవటం

41-42 ఆయన యెరూషలేము సమీపిస్తూ ఆ పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించ సాగాడు: “శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం కాదు. 43 నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు వైపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి. 44 వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.”

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మత్తయి 21:12-17; మార్కు 11:15-19; యోహాను 2:13-22)

45 ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు. 46 వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా ఆలయం.(A) కాని మీరు దాన్ని ‘దొంగలు దాగుకొనే స్థలంగా’(B) మార్చారు!” అని చెప్పబడిందని అన్నాడు.

47 ఆయన ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజా నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. 48 కాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో వింటూ ఉండటంవల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో వాళ్ళకు బోధపడలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International