Book of Common Prayer
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రుల నుండి నన్ను కాపాడుము.
2 ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
3 వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.
4 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
5 ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
నా దారిలో వారు ఉచ్చు పెడతారు.
6 యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
7 యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
8 యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
వారి పథకాలు నెగ్గనీయకు.
9 యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.
దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.
142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
యెహోవాను నేను ప్రార్థిస్తాను.
2 నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
3 నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
నా ప్రాణం నాలో మునిగిపోయింది.
అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.
4 నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
పారిపోవుటకు నాకు స్థలం లేదు.
నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
5 కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
6 యెహోవా, నా ప్రార్థన విను.
నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
7 ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.
దావీదు స్తుతి కీర్తన.
141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
త్వరపడి నాకు సహాయం చేయుము.
2 యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.
3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
4 నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.
7 మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.
దావీదు స్తుతి కీర్తన.
143 యెహోవా, నా ప్రార్థన వినుము.
నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము.
నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
2 నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.
నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
3 కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు.
వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు.
ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి
నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
4 నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.
నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
5 కాని చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.
నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను.
యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
6 యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.
7 యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!
నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను.
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము.
సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
8 యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము.
నేను నిన్ను నమ్ముకొన్నాను.
సరియైన మార్గాన్ని నాకు చూపించుము.
నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
9 యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.
నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు
నన్ను జీవించనిమ్ము.
నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,
నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము.
ఎందుకంటే నేను నీ సేవకుడను.
తీర్పు రోజు
14 చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుంది. 2 యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టుకొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని, మిగిలిన ప్రజలు నగరంనుండి తీసుకుపోబడరు. 3 అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది. 4 ఆ సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున వున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీలి పోతుంది. ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పునుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది. 5 ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని, నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయనయొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.
6-7 అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది. 8 ఆ సమయంలో యెరూషలేమునుండి నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండవది పడమటిగా మధ్యధరా సముద్రంవైపు ప్రవహిస్తుంది. అది సంవత్సరం పొడవునా వేసవిలోను, శీతాకాలంలోను ప్రవహిస్తుంది. 9 ఆ సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే. 10 అప్పుడు యెరూషలేము చుట్టూ వున్న ప్రాంతమంతా అరాబా ఎడారిలా నిర్మానుష్య మవుతుంది. గెబ నుండి దక్షిణాన రిమ్మోను వరకు దేశం ఎడారిలా మారిపోతుంది. కాని యెరూషలేము నగరమంతా బెన్యామీను ద్వారం నుండి మొదటి ద్వారం (మూల ద్వారం) వరకు, మరియు హనన్యేలు బురుజు నుండి రాజు యొక్క ద్రాక్ష గానుగల వరకు మళ్లీ నిర్మింపబడుతుంది. 11 నిషేధం తొలగింపబడుతుంది. ప్రజలు మళ్లీ అక్కడ ఇండ్లు కట్టుకుంటారు. యెరూషలేము సురక్షితంగా ఉంటుంది.
7 దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. 8 మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. 9 యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)
10 మరొక చోట:
“యూదులు కాని ప్రజలారా!
మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)
11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:
“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)
12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:
“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
ఆయన దేశాలను పాలిస్తాడు.
యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)
13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
యేసు యెరూషలేము ప్రవేశించటం
(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; యోహాను 12:12-19)
28 యేసు ఈ ఉపమానం చెప్పి యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. 29-30 వాళ్ళు ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ గ్రామాలను చేరుకొన్నాక యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరా గ్రామాన్ని ప్రవేశించగానే స్థంభానికి కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద యిదివరకు ఎవ్వరూ ఎక్కలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. 31 ఎవరైనా ‘ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ఇది ప్రభువుకు కావాలని చెప్పండి” అని అన్నాడు.
32 వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు. 33 వాళ్ళు దాన్ని విప్పుతుండగా దాని యజమానులు వచ్చి, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.
34 ఇది “ప్రభువుకు కావాలి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. 35 వాళ్ళు దాన్ని యేసు దగ్గరకు తీసుకు వచ్చి తమ వస్త్రాల్ని దానిపై పరిచి, దాని మీద యేసును ఎక్కించారు. 36 ఆయన వెళ్తుండగా, ప్రజలు తమ వస్త్రాల్ని దారి మీద పరిచారు.
37 ఆయన ఒలీవల కొండమీద నుండి క్రిందికి దిగే స్థలాన్ని చేరుకున్నాడు. శిష్యుల గుంపంతా తాము మహత్యాలు చూసినందుకు ఆనందంతో బిగ్గరగా యిలా దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు:
38 “‘ప్రభువు పేరిట రానున్న రాజు ధన్యుడు!’(A)
పరలోకంలో శాంతి! మహోన్నత స్థలాల్లో దేవునికి మహిమ!”
39 గుంపులో ఉన్న కొందరు పరిసయ్యులు యేసుతో, “బోధకుడా! మీ శిష్యుల్ని అదుపులో పెట్టుకో!” అని అన్నారు.
40 యేసు, “వాళ్ళు గొంతెత్తి మాట్లాడటం ఆపితే, రాళ్ళు గొంతెత్తి మాట్లాడటం మొదలు పెడతాయి” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International