Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:145-176

ఖాఫ్

145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
    నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
    నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు
    నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
149 నీవు దయతో నా మాట విను.
    యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము.
150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
151 యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు.
    నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
    చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.

రేష్

153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
    నీ ఉపదేశాలను నేను మరువలేదు.
154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
    నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
155 దుష్టులు జయించరు. ఎందుకంటే,
    వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
    నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము
157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
    కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను.
    ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
159 చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
    యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
    నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.

షీన్

161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
    కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
    నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
    నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
    ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
    నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
    యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
    యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.

తౌ

169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
    కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
    నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
    గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
    కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
    నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
    యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
    మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.

కీర్తనలు. 128-130

యాత్ర కీర్తన.

128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.

నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
    ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
    బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.

ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.

యాత్ర కీర్తన.

129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
    ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
    కాని వారు ఎన్నడూ జయించలేదు.
నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
    నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
    ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
    ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
    ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
    “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.

యాత్ర కీర్తన.

130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
    కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రభువా, నా మాట వినుము.
    సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
    ఒక్క మనిషి కూడా మిగలడు.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
    అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.

యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
    నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
    యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
    ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
    నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
    మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

జెకర్యా 12:1-10

యూదా చుట్టునున్న దేశాల గూర్చిన దర్శనాలు

12 ఇశ్రాయేలును గురించి యెహోవానుండి వచ్చిన విషాద వార్త. యెహోవా ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన మానవుని ఆత్మను అతనిలో పొందుపర్చాడు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను యెరూషలేమును దాని చుట్టూ ఉన్న దేశాలకు ఒక విషపు గిన్నెలా చేస్తాను. దేశాలు వచ్చి, ఆ నగరంపై దాడి చేస్తాయి. యూదా అంతా బోనులో చిక్కుతుంది. కాని నేను యెరూషలేమును ఒక బరువైన బండలా చేస్తాను. దానిని తీసుకోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది అతనినే గాయపర్చుతుంది. ఆ ప్రజలు నిజంగా నరకబడతారు, గీకబడతారు. కాని భూమిపైగల దేశాలన్నీ కలిసి యెరూషలేము మీద యుద్ధానికి వస్తాయి. కాని ఆ సమయంలో నేను గుర్రాన్ని బెదర గొడతాను. దాని మీద స్వారీ చేసే సైనికునికి భయం పుట్టిస్తాను. శత్రు గుర్రాలన్నీ గుడ్డివై పోయేలా చేస్తాను. కాని నా కండ్లు తెరవబడి ఉంటాయి. నేను యూదా వంశాన్ని కనిపెడుతూ ఉంటాను. యూదా వంశ నాయకులు ప్రజలను ప్రోత్సహిస్తారు. వారు, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ దేవుడు, ఆయన మనల్ని బలవంతులుగా చేస్తాడు’ అని అంటారు. ఆ సమయంలో యూదా నాయకులను అరణ్యంలో చెలరేగిన అగ్నిలా నేను చేస్తాను. అగ్ని ఎండు గడ్డిని దగ్ధం చేసినట్లు, వారు తమ శత్రువులను నాశనం చేస్తారు. చుట్టూవున్న వారి శత్రువులను వారు నాశనం చేస్తారు. యెరూషలేము ప్రజలు మళ్లీ తీరికగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు.”

యెరూషలేము ప్రజలు మిక్కిలి గొప్పలు చెప్పుకోకుండా చేయటానికి, యెహోవా యూదా ప్రజలను ముందుగా రక్షిస్తాడు. యూదాలో వున్న ప్రజలకంటె తాము గొప్పవారమని దావీదు వంశంవారు, యెరూషలేములో వుంటున్న ఇతర ప్రజలు గొప్పలు చెప్పుకోలేరు. కాని యెరూషలేము ప్రజలను యెహోవా రక్షిస్తాడు. ఏమీ చేతగానివాడు సహితం దావీదులా గొప్ప సైనికుడవుతాడు. దావీదు వంశంలోని మనుష్యులు దేవుళ్లవలె వుంటారు. ప్రజలను నడిపించే యెహోవా దూతలా వుంటారు.

యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన దేశాలను నేను నాశనం చేస్తాను. 10 దావీదు వంశాన్ని, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభావంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయినవాడు విలపించేలా, తన మొదటి కుమారుడు చని పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు.

ఎఫెసీయులకు 1:3-14

క్రీస్తులో ఆత్మీయ దీవెనలు

మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక! దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు. మనము తన దృష్టియందు పవిత్రంగా ఏ తప్పూ చెయ్యకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమవల్ల ఎన్నుకొన్నాడు. యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే ఆయన ఉద్దేశ్యము. ఇలా చేయటమే ఆయన ఆనందం! కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తాను ప్రేమిస్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా యిచ్చిన దేవుణ్ణి మనము స్తుతించుదాం.

ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేసాడు. ఆయన తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చెయ్యదలచిన మర్మాన్ని తన యిచ్ఛానుసారం మనకు తెలియచేసాడు. 10 సరియైన సమయం రాగానే తాను పూర్తి చేయదలచినదాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, అంటే భూలోకాన్ని, పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు.

11 అన్నీ ఆయన ఉద్దేశ్యానుసారం, ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము క్రీస్తులో ఐక్యత పొంది ఆయన ప్రజలుగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. 12 క్రీస్తు మనకు రక్షణ యిస్తాడని విశ్వసించినవాళ్ళలో మనము మొదటివాళ్ళము. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతించుదాం. 13 మీరు రక్షణను గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ. 14 తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకూ వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది.

లూకా 19:1-10

జక్కయ్య

19 యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు. ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకొన్నాడు. కాని ప్రజలు గుంపులు గుంపులుగా వుండిరి అతడు పొట్టివాడు అవటంవలన యేసును చూడలేకపోయాడు. యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయన్ని చూడటానికి అందిరకన్నా ముందు పరుగెత్తి ఒక మెడి చెట్టెక్కి కూర్చున్నాడు.

యేసు ఆ చెట్టుదగ్గరకు వచ్చాక పైకి చూసి, “జక్కయ్యా! జక్కయ్యా! వెంటనే క్రిందికి దిగిరా! ఈ రోజు నేను నీ యింట్లో బసచెయ్యాలి!” అని అన్నాడు.

అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు. ప్రజలు జరిగినదంతా చూసి, “యేసు ఒక పాపి యింట్లో బస చెయ్యటానికి వెళ్తున్నాడే!” అని గొణిగారు.

కాని జక్కయ్య ప్రభువుతో, “ప్రభూ! నేనుయిక్కడే నా ఆస్తిలో సగం పేదవాళ్ళకు యిస్తాను. నేను ఎవరినుండైనా ఏదైనా మోసం చేసి తీసుకొని ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను” అని అన్నాడు.

అప్పుడు యేసు, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. కనుక ఈ యింటికి ఈ రోజు రక్షణ వచ్చింది. 10 మనుష్యకుమారుడు తప్పిపోయిన వాళ్ళను వెతికి రక్షించటానికి వచ్చాడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International