Book of Common Prayer
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
3 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యాజకులారా, మీరు చెప్పండి.
4 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.
5 నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
6 యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
7 యెహోవా నా సహాయకుడు;
నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
8 మనుష్యులను నమ్ముకొనుటకంటే
యెహోవాను నమ్ముట మేలు.
9 మీ నాయకులను నమ్ముకొనుట కంటే
యెహోవాను నమ్ముకొనుట మేలు.
10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
17 నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26 యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”
యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”
28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దావీదు ప్రార్థన.
145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
2 ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
3 యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
6 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
7 నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.
8 యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా, అందరి యెడలా మంచివాడు.
దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
నీవు శాశ్వతంగా పాలిస్తావు.
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!
రాబోయే రాజు
9 సీయోనూ, నీవు సంతోషంగా వుండు!
యెరూషలేము ప్రజలారా, ఆనందంతో కేకలు పెట్టండి!
చూడండి, మీరాజు మీ వద్దకు వస్తున్నాడు!
ఆయన విజయం సాధించిన మంచి రాజు.
కాని ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడిదపై స్వారీ చేస్తున్నాడు. ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు.
10 రాజు చెపుతున్నాడు, “నేను ఎఫ్రాయిములో రథాలనూ,
యెరూషలేములో గుర్రవు రౌతులను నాశనం చేశాను.
యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను.”
శాంతిని గూర్చిన వార్తను అన్య దేశాలు విన్నాయి.
ఆ రాజు సముద్రంనుండి సముద్రంవరకు పరిపాలిస్తాడు.
ఆయన నదినుండి భూమిపై సుదూర ప్రాంతాలవరకు పాలిస్తాడు.
యెహోవా తన ప్రజలను రక్షించటం
11 యెరూషలేమూ, మన ఒడంబడిక రక్తంతో స్థిరపర్చబడింది.
కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రం ఆ ఖాళీ చెరసాలలో ఉండరు.
12 చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి.
మీకు ఇంకా ఆశపడదగింది ఉంది.
నేను మీవద్దకు తిరిగి వస్తున్నానని
నేను మీకు చెపుతున్నాను!
13 యూదా, నిన్ను నేను ఒక విల్లులా వినియోగిస్తాను.
ఎఫ్రాయిమూ, నిన్ను నేను బాణాల్లా వినియోగిస్తాను.
ఇశ్రాయేలూ, గ్రీసుతో యుద్ధం చేయటానికి
నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను.
14 యెహోవా వారికి కన్పిస్తాడు.
ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు.
నా ప్రభువైన యెహోవా బాకా ఊదుతాడు.
అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫానులా ముందుకు చొచ్చుకు పోతుంది.
15 సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని రక్షిస్తాడు.
శత్రువును ఓడించటానికి సైనికులు బండరాళ్లను, వడిసెలలను ఉపయోగిస్తారు.
వారి శత్రువుల రక్తాన్ని వారు చిందిస్తారు.
అది ద్రాక్షా మద్యంలా పారుతుంది.
అది బలిపీఠం మూలలపై పోసిన రక్తంలా వుంటుంది!
16 ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్టు,
దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడతాడు.
వారాయనకు చాలా విలువైనవారు.
తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటివారు.
13 ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని చేస్తారు? 14 కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.” 15 క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. 16 కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు.
17 చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.
18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం
తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
తీసుకు రావాలని నీతిమంతుడైన
క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.
19 పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. 20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. 21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.
యేసు యెరూషలేము ప్రవేశించటం
(మార్కు 11:1-11; లూకా 19:28-38; యోహాను 12:12-19)
21 యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: 2 “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. 3 ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.”
4 దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది:
5 “‘గాడిదనెక్కి వినయంగా
నీ రాజు వస్తున్నాడు చూడు!
బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’
అని సీయోను కుమారితో చెప్పండి.”(A)
6 శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. 7 గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు. 8 అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. 9 ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు.
“దావీదు కుమారునికి హోసన్నా!
‘ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు!’(B)
మహోన్నతమైన స్థలములో హోసన్నా!”
10 యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు.
11 “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు.
యేసు ఆలయంలోనికి వెళ్ళటం
(మార్కు 11:15-19; లూకా 19:45-48; యోహాను 2:13-22)
12 యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు. 13 ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’(C) అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు.
© 1997 Bible League International