Book of Common Prayer
33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి.
వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు
చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు.
బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు.
ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు.
కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.
దావీదు స్తుతి కీర్తన
108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
2 స్వర మండలములారా, సితారలారా,
మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
3 యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
4 యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
5 దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
6 దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.
7 యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
“యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
(ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
వారికి సుక్కోతులోయను ఇస్తాను.
8 గిలాదు, మనష్షే నావి.
ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
యూదా నా రాజదండం.
9 మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
ఎదోము నా చెప్పులు మోసే బానిస.
ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”
10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
తీర్పుకోసం ప్రత్యేక సమయం
13 “మీరు నన్నుగూర్చి నీచ విషయాలు చెప్పారు” అని యెహోవా అంటున్నాడు.
కానీ “నిన్ను గూర్చి మేము ఏమి చెప్పాం?” అని మీరు అంటారు.
14 “యెహోవాను ఆరాధించటం వ్యర్థం. యెహోవా మాకు చెప్పిన వాటిని మేము చేసాం, కాని మాకు లాభం ఏమీ కలుగలేదు. సమాధి దగ్గర మనుష్యులు ఏడ్చినట్టు, మేము మా పాపాల విషయంలో బాధపడ్డాం. కానీ దానివల్ల లాభం లేదు. 15 గర్విష్ఠులు సంతోషంగా ఉన్నారని మేము అనుకొంటున్నాం. దుర్మార్గులే అభివృద్ధి చెందుతున్నారు. వారు దేవుని సహనం పరీక్షించటానికి చెడు పనులు చేస్తారు-దేవుడు వారిని శిక్షించడు అని మీరు చెప్పారు”.
16 దేవుని అనుచరులు ఒకరితో ఒకరు మాట్లాడారు. అది యెహోవా విన్నాడు. ఆయన ఎదుట ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దేవుని అనుచరుల పేర్లు ఉన్నాయి. వారు యెహోవా పేరును గౌరవించేవారు.
17 ఆ ప్రజలు నాకు చెందినవాళ్లు. నేను వారికి దయ చూపుతాను. ఒక మనిషి అతనికి విధేయులయ్యే పిల్లల యెడల చాలా దయగలిగి ఉంటాడు. అదే విధంగా, నేను నా అనుచరులయెడల దయగలిగి ఉంటాను. 18 ప్రజలారా, మీరు తిరిగి నా దగ్గరకు వస్తారు. మరియు మంచికి, చెడుకు గల భేదం మీరు నేర్చుకొంటారు. దేవుని అనుసరించే మనిషికి, దేవుని అనుసరించని మనిషికి వ్యత్యాసం మీరు నేర్చుకొంటారు అని యెహోవా చెప్పాడు.
4 “తీర్పు సమయం వస్తుంది. అది కాలుతున్న అగ్ని గుండంలా ఉంటుంది. ఆ గర్విష్ఠులు అందరూ శిక్షించబడతారు. ఆ దుర్మార్గులు అందరూ గడ్డిలా కాలిపోతారు. ఆ సమయంలో వారు అగ్నిలో మండుతున్న ఒక పొదలా ఉంటారు-దాని కొమ్మగాని, వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
2 “అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చిపెడ్తుంది. పాకనుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు. 3 అప్పుడు మీరు ఆ దుర్మార్గుల మీద నడుస్తారు-వారు మీ పాదాలక్రింద బూడిదలా ఉంటారు. తీర్పు సమయంలో ఆ సంగతులను నేను సంభవింపజేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
4 “మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకొని, విధేయత చూపండి. మోషే నా సేవకుడు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయేలీయులందరికోసం ఆ చట్టాలు, నియమాలు నేను అతనికి ఇచ్చాను.”
5 “చూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు పంపిస్తాను. యెహోవానుంచి వచ్చే ఆ మహాభయంకర తీర్పు సమయానికి ముందు ఆయన వస్తాడు. 6 తల్లిదండ్రులు వారి పిల్లలకు సన్నిహితులగుటకు ఏలీయా సహాయం చేస్తాడు. మరియు అతడు (ఏలీయా) పిల్లలు వారి తల్లిదండ్రులకు సన్నిహితులగుటకు సహాయం చేస్తాడు. ఇది జరిగి తీరాలి. లేదా నేను వచ్చి, మీ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాను,” అని యెహోవా చెప్పాడు!
ప్రార్థనాశక్తి
13 మీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే అలాంటి వాడు ప్రార్థించాలి. ఆనందంగా ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడాలి. 14 అనారోగ్యంగా ఉన్నవాడు సంఘ పెద్దల్ని పిలవాలి. ఆ పెద్దలు వచ్చి, ప్రార్థించి ప్రభువు పేరిట అతనికి నూనె రాయాలి. 15 విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ రోగికి ఆరోగ్యం కలుగచేస్తుంది. ప్రభువు అతనికి ఆరోగ్యం కలుగచేస్తాడు పాపం చేసి ఉంటె అతన్ని క్షమిస్తాడు.
16 అందువల్ల చేసిన తప్పుల్ని పరస్పరం ఒప్పుకోండి. ఒకరికొకరు ప్రార్థించండి. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. నీతిమంతుని ప్రార్థన బహు బలముగలది. కనుక ఎంతో మేలు చేయగలదు. 17 ఏలీయా మనలాంటి మనిషే. ఒకప్పుడు వర్షాలు కురియరాదని అతడు ఆసక్తితో ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాల దాకా వర్షాలు కురియలేదు. 18 ఆ తర్వాత మళ్ళీ ప్రార్థించాడు. ఆకాశం నుండి వర్షాలు కురిసాయి. భూమి నుండి పంటలు పండాయి.
పాపిని నీతికి మళ్ళించటం
19 నా సోదరులారా! మీలో ఎవరైనా నీతిమార్గానికి దూరంగా పోయిన వాణ్ణి వెనక్కు పిలుచుకు వస్తే యిది గమనించండి. 20 పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించినవాడు అతని ఆత్మను పాపాలన్నిటి నుండి రక్షించినవాడౌతాడు. అదీగాక అతన్ని చావు నుండి తప్పించినవాడౌతాడు.
పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు
9 తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’
13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”
© 1997 Bible League International