Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:97-120

మేమ్

97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
    దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
    జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
    ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
    కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
    ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
    కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
    అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.

నూన్

105 యెహోవా, నీ వాక్యాలు
    నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
    నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
    దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
    కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
    కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
    అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
    నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.

సామెహ్

113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
    నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
    యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
    నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
    నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
    నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
    ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
    కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
    నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.

కీర్తనలు. 81-82

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

ఆసాపు స్తుతి కీర్తన.

82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
    ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
    దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.

“అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
    న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
    దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.

“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
    వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
    వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
నేను (దేవుడు) మీతో చెప్పాను,
    “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
    ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”

దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
    దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.

యోవేలు 2:12-19

ప్రజలు మార్పు చెందాలని యెహోవా చెప్పుట

12 ఇది యెహోవా సందేశం:
    “ఇప్పుడు మీ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగిరండి.
మీరు చెడ్డ పనులు చేసారు.
    ఏడువండి, ఏడువండి. భోజనం ఏమీ తినకండి.
13 మీ వస్త్రాలు కాదు
    మీ హృదయాలు చింపుకోండి.”
మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి.
    ఆయన దయ, జాలిగలవాడు.
ఆయన త్వరగా కోపపడడు.
    ఆయనకు ఎంతో ప్రేమఉంది.
ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో
    ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో.
14 ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు.
    మరియు ఒకవేళ ఆయన తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి పెడతాడేమో.
అప్పుడు నీవు నీ యెహోవా దేవునికి
    ధాన్యార్పణం, పానీయార్పణం అర్పించవచ్చు.

యెహోవాను ప్రార్థించు

15 సీయోనులో బూర ఊదండి.
    ఒక ప్రత్యేక ఉపవాస సమయం ఏర్పాటు చేయండి.
16 ప్రజలను సమావేశం చేయండి.
    ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి.
పెద్దవాళ్లను సమావేశపరచండి.
    చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి.
పెండ్లికుమార్తెను, ఆమె పెండ్లికుమారున్ని
    వారి పడకగదినుండి బయటకు రప్పించండి.
17 యాజకులను, యెహోవా సేవకులను
    మండపానికి బలిపీఠానికి మధ్య విలపించనివ్వండి
ఆ ప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు.
    నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు.
    నీ ప్రజలనుగూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు.
ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ
    ‘వారిదేవుడు ఎక్కడ?’ అని చెప్పనియ్యకు.”

యెహోవా దేశాన్ని మరల ఇచ్చివేస్తాడు

18 అప్పుడు యెహోవా ఈ దేశాన్నిగూర్చి ఉద్వేగపడ్డాడు.
    తన ప్రజల విషయం ఆయన విచార పడ్డాడు.
19 యెహోవా తన ప్రజలతో మాట్లాడాడు.
ఆయన చెప్పాడు, “నేను మీకు ధాన్యం, ద్రాక్షారసం, నూనె పంపిస్తాను.
    అవి మీకు సమృద్ధిగా ఉంటాయి.
    రాజ్యాల మధ్య నేను మిమ్మిల్ని ఇంకెంత మాత్రం అవమానించను.

ప్రకటన 19:11-21

తెల్లటి గుర్రంపై రౌతు

11 నేను తెరుచుకొని ఉన్న పరలోకాన్ని చూసాను. నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు నమ్మకమైన వాడని, సత్యవంతుడని పేరున్న వాడు. అతడు నీతిగా తీర్పు చెబుతాడు. న్యాయంగా యుద్ధం చేస్తాడు. 12 ఆయన కళ్ళు నిప్పులా మండుతూ ఉన్నాయి. ఆయన తలమీద ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు. 13 ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆయన పేరు దేవుని వాక్యం. 14 తెల్లగా పరిశుద్ధంగా ఉన్న సున్నితమైన దుస్తులు వేసుకొని పరలోకంలో ఉన్న సైనికులు తెల్లటి గుర్రాలపై స్వారీ చేస్తూ ఆయన్ని అనుసరించారు. 15 దేశాలను ఓడించటానికి ఆయన నోటినుండి పదునైన కత్తి బయటకు వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుని ఆగ్రహమనబడే ద్రాక్షా గానుగను త్రొక్కుతాడు. ఆ ఆగ్రహం తీవ్రమైనది. 16 ఆయన వస్త్రంమీద, ఆయన తొడమీద:

రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు

అని వ్రాయబడి ఉంది.

17 ఒక దూత సూర్యునిలో నిలబడి ఉండటం చూసాను. అతడు బిగ్గరగా గాలిలో ఎగురుతున్న పక్షులతో, “దేవుని గొప్ప విందుకొరకు అందరూ సమావేశం కండి. 18 మీరు వస్తే రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, వీరుల మాంసం, గుఱ్ఱాల మాంసం, రౌతుల మాంసం, ప్రజల మాంసం, బానిసలుకానివాళ్ళ మాంసం, బానిసల మాంసం, ముఖ్యమైనవాళ్ళ మాంసం, తినటానికి లభిస్తుంది” అని అన్నాడు.

19 ఆ తదుపరి మృగము మరియు భూపాలకులు, వాళ్ళ సైన్యాలు, అంతా కలిసి గుఱ్ఱంపై స్వారీ చేస్తున్న వానితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయటానికి సిద్ధం అయ్యారు. 20 కాని ఆ మృగము బంధింపబడింది. ఆ మృగం పక్షాన మహత్వపూర్వకమైన సూచనలు చూపిన దొంగ ప్రవక్త కూడా బంధింపబడ్డాడు. వాడు ఈ సూచనలతో మృగం యొక్క ముద్రను పొందినవాళ్ళను, ఆ మృగాన్ని ఆరాధించినవాళ్ళను మోసం చేస్తూపోయాడు. వీళ్ళందరిని గంధకంతో మండుతున్న భయానకమైన గుండంలో ఆ గుఱ్ఱంపై స్వారీ చేస్తున్నవాడు సజీవంగా పడవేసాడు. 21 గుఱ్ఱపు రౌతు నోటినుండి వచ్చిన కత్తితో మిగతా వాళ్ళు చంపబడ్డారు. పక్షులు వచ్చి వీళ్ళ దేహాలను కడుపు నిండా తిన్నాయి.

లూకా 15:1-10

తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం

(మత్తయి 18:12-14)

15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.

అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.

“ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. 10 నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International