Book of Common Prayer
ఆసాపు ధ్యాన గీతం.
78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
నేను చెప్పే విషయాలు వినండి.
2 ఈ కథ మీతో చెబుతాను.
ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
4 ఈ కథను మనము మరచిపోము.
మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
5 యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు.
మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
6 ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొంటారు.
క్రొత్త తరాలు పుడతాయి. వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబుతారు.
7 కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.
దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు.
వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
8 ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే,
అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు.
వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు.
ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు.
9 ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు[a] కలిగి ఉన్నారు.
కాని వారు యుద్ధంలో నుండి పారిపోయారు.
10 వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపుకోలేదు.
దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు వారు నిరాకరించారు.
11 ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు.
ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు.
12 ఈజిప్టులోను, సోయను వద్దను
దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు.
13 దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు.
వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి.
14 ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.
15 అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు.
భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.
16 బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు.
అది ఒక నదిలా ఉంది.
17 కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు.
అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు.
18 అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు.
కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు.
19 వారు దేవునికి విరోధంగా మాట్లాడారు.
“ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా?
20 దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది.
తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు.
21 ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు.
యాకోబు[b] మీద దేవునికి చాలా కోపం వచ్చింది.
ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది.
22 ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు.
దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు.
23-24 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు.
వారికి ఆహారంగా ఆయన మన్నాను కురిపించాడు.
అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు
ఆకాశంలోని ధాన్యాగారంనుండి ధాన్యం పోసినట్టు ఉంది.
25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు.
ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.
26-27 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు.
వర్షం కురిసినట్లుగా పూరేళ్లు[c] వారిమీద వచ్చి పడ్డాయి.
దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది.
ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.
28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో
ఆ పక్షులు వచ్చి పడ్డాయి.
29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది.
కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.
30 వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు.
అందుచేత ఆ పక్షుల రక్తం కార్చివేయక ముందే వారు ఆ పూరేళ్లను తినివేసారు.
31 ఆ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది. వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు.
ఆరోగ్యవంతులైన అనేకమంది పడుచువాళ్లు చచ్చేటట్టుగా దేవుడు చేశాడు.
32 కాని ఆ ప్రజలు యింకా పాపం చేశారు.
దేవుడు చేయగల ఆశ్చర్యకరమైన విషయాల మీద వారు ఆధారపడలేదు.
33 కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను
ఏదో విపత్తుతో అంతం చేశాడు.
34 దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలినవారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు.
వారు పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు.
35 దేవుడే తమ బండ అని ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకొన్నారు.
సర్వోన్నతుడైన దేవుడే తమని రక్షించాడని వారు జ్ఞాపకం చేసుకొన్నారు.
36 వారు ఆయన్ని ప్రేమిస్తున్నామని అన్నారు,
కాని వారి మాట నిజంకాదు. వారు అబద్ధం చెప్పారు.
37 వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు.
వారు ఒడంబడికకు నమ్మకంగా లేరు.
38 కాని దేవుడు దయకలిగినవాడు.
వారి పాపాల విషయంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన వారిని నాశనం చేయలేదు.
అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకొన్నాడు.
దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు.
39 వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు.
మనుష్యులు అప్పుడే వీచి, అంతలోనే మాయమై పోయే గాలి వంటివారు.
40 అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు.
ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు.
41 ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు.
42 ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు.
శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు.
43 ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు.
సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు.
44 నదులను దేవుడు రక్తంగా మార్చాడు!
ఈజిప్టువారు నీళ్లు త్రాగలేకపోయారు.
45 ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు.
ఈజిప్టువారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు.
46 దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు.
వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు.
47 ఈజిప్టువారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు.
వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడుకొన్నాడు.
48 దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను
వారి పశువులను పిడుగుల చేతను చంపేశాడు.
49 దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు.
నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు.
50 దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు.
ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు.
వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు.
51 ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు.
హాము[d] సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు.
52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు.
ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.
53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు.
దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు.
వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.
54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు.
తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.
55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు.
దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు.
అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.
56 కాని ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు.
ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.
57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లుకొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మకస్తులుగాను ఉన్నారు.
వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.
58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు.
దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.
59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు.
మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.
60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు.
ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.
61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాలు తన ప్రజలను బంధీలుగా చేయనిచ్చాడు.
దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.
62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు.
ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.
63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు.
పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.
64 యాజకులు చంపివేయబడ్డారు.
కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.
65 త్రాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె,
నిద్రనుండి మేల్కొన్న మనిషివలె ప్రభువు లేచాడు.
66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు.
దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.
67 కాని యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు.
ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.
68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు.
మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.
69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు.
భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.
70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు.
దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.
71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి,
తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.
72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.
15 దుఃఖపడండి! ఎందుకంటే, యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరనుండి శిక్ష ఒక దాడిలా వస్తుంది. 16 మన ఆహారం పోయింది. మన దేవుని ఆలయంనుండి ఆనందం, సంతోషం పోయాయి. 17 మనం విత్తనాలు విత్తాం, కాని ఆ విత్తనాలు ఎండిపోయి, చచ్చి, మట్టిలో పడివున్నాయి. మన మొక్కలు ఎండిపోయి, చచ్చిపోయాయి. మన కొట్టాలు ఖాళీ అయిపోయి పడిపోతున్నాయి.
18 జంతువులు ఆకలితో మూలుగుతున్నాయి. పశువుల మందలు గందరగోళంగా తిరుగుతున్నాయి. అవి మేసేందుకు గడ్డి లేదు. గొఱ్ఱెలు చస్తున్నాయి. 19 యెహోవా, సహాయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలోని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చివేశాయి. 20 అడవి జంతువులకు కూడ నీ సహాయం కావాలి. కాలువలు ఎండిపోయాయి. నీళ్ళు లేవు. మా పచ్చటి పొలాలను అగ్ని ఎడారిగా మార్చివేసింది.
రాబోతున్న యెహోవా దినం
2 సీయోనులో బూర ఊదండి.
నా పవిత్ర పర్వతంమీద హెచ్చరికగా కేకవేయండి.
దేశంలో నివసించే ప్రజలందరూ భయంతో వణుకుదురు గాక.
యెహోవా ప్రత్యేకదినం వస్తుంది.
యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది.
2 అది ఒక చీకటి దుర్దినంగా ఉంటుంది.
అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది.
సూర్యోదయాన సైన్యం పర్వతాలలో నిండి ఉండటం నీవు చూస్తావు.
అది మహాశక్తిగల సైన్యంగా ఉంటుంది.
ఇంతకుముందు ఇలాంటిది ఏదీ, ఎన్నడూ ఉండలేదు.
మరియు ఇలాంటిది ఏదీ, ఎన్నటికీ మరోసారి ఉండదు.
3 మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం చేస్తుంది.
వారి ఎదుట దేశం ఏదెను వనంలా ఉంది.
వారి వెనుక దేశం ఖాళీ ఎడారిలా ఉంది.
ఏదీ వారినుండి తప్పించుకోలేదు.
4 వారు గుఱ్ఱాల్లా కనబడతారు.
యుద్ధ గుఱ్ఱాల్లావారు పరుగెత్తుతారు.
5 వారి మాట వినండి.
అది పర్వతాలమీద రథాలు
పరుగులెత్తిన ధ్వనిలా ఉంది.
అది పొట్టును కాల్చివేస్తోన్న
అగ్నిజ్వాలల శబ్దంలా ఉంది.
వారు శక్తిగల ఒక జనం.
వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.
6 ఈ సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణకుతారు.
వారి ముఖాలు భయంతో తెల్లబడి పోతాయి.
7 ఆ సైనికులు వేగంగా పరుగెత్తుతారు.
ఆ సైనికులు గోడలు ఎక్కుతారు.
ప్రతి సైనికుడూ తిన్నగా ముందుకు దూసుకొనిపోతాడు.
వారు వారి మార్గంనుండి తప్పుకోరు.
8 వారు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడరు.
ప్రతి సైనికుడూ తన సొంత దారిలో నడుస్తాడు.
ఒక సైనికుడు దెబ్బ తగిలి పడిపోతే మిగిలిన వారు
ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు.
9 వారు పట్టణానికి పరుగెత్తుతారు.
వారు త్వరగా గోడ ఎక్కుతారు.
వారు ఇండ్లలోనికి ఎక్కిపోతారు.
వారు ఒక దొంగలా కిటికీల్లో నుండి ప్రవేశిస్తారు.
10 వారి ఎదుట భూమి, ఆకాశం వణుకుతాయి.
సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. మరియు నక్షత్రాలు ప్రకాశించటం మాని వేస్తాయి.
11 యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు.
ఆయన విడిది చాలా విశాలమైంది.
ఆ సైన్యం ఆయన ఆదేశాలకు లోబడుతుంది.
ఆ సైన్యం చాలా శక్తిగలది. యెహోవా ప్రత్యేక దినం ఒక గొప్ప భయంకర దినం. ఏ మనిషీ దానిని ఆపు చేయలేడు.
దేవుణ్ణి స్తుతించండి
19 ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది:
“దేవుణ్ణి స్తుతించండి!
రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే.
2 ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు.
తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన
ఆ వేశ్యను ఆయన శిక్షించాడు.
తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.”
3 వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు:
“దేవుణ్ణి స్తుతించండి!
కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.”
4 ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు:
“ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!”
5 అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది:
“ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి.
ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.”
6 ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు:
“దేవుణ్ణి స్తుతించండి.
సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన
దేవుడు మనల్ని పాలిస్తున్నాడు.
7 మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం.
గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది.
ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది.
8 సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి.
అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.”
(సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.)
9 ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.”
10 ఇది విన్నాక అతన్ని ఆరాధించాలని నేను అతని కాళ్ళ మీద పడ్డాను. కాని అతడు నాతో, “అలా చేయవద్దు. నేను నీ తోటి సేవకుణ్ణి. యేసు చెప్పిన దాన్ని అనుసరించే సోదరుల సహచరుణ్ణి. దేవుణ్ణి ఆరాధించు. యేసు చెప్పిన విషయాలనే ప్రవక్తలు కూడా చెప్పారు” అని అన్నాడు.
నన్ను వెంబడించగలవేమో తీర్మానించుకొనుము
(మత్తయి 10:37-38)
25 ప్రజలు గుంపులు గుంపులుగా యేసుతో ప్రయాణం చేస్తూవున్నారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, 26 “నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. 27 అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు.
28 “గోపురం కట్టాలనుకొన్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమౌతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా? 29-30 పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు.
31 “అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన పదివేల సైన్యంతో యుద్దం చేయబోతున్న ఇరవై వేల సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా? 32 యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకొంటాడు.
33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.
నీ గోప్పతనమును పోగొట్టుకొనవద్దు
(మత్తయి 5:13; మార్కు 9:50)
34 “ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే దాన్ని మళ్ళీ ఉప్పుగా ఎట్లా చెయ్యగలము? 35 అది పెంట కుప్పుకు పనికి రాదు. పొలానికి పనికి రాదు. దాన్ని పారవేయవలసి వస్తుంది.
“చెప్పిన వాటిని జాగ్రత్తగా గమనించండి” అని అన్నాడు.
© 1997 Bible League International