Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 24

దావీదు కీర్తన.

24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
    ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
    ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.

యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
    యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
అక్కడ ఎవరు ఆరాధించగలరు?
    చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
    అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
    అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
    అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.

మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
    ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
    సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
    పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
ఈ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
    యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.

గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
    పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
    మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
    ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.

కీర్తనలు. 29

దావీదు కీర్తన.

29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
    ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
    మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
    మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
    ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
    లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
    షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
    యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
    ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.

10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
    మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
    యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.

కీర్తనలు. 8

సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
    నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
    నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
    నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
    నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
    వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
    మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
    ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
    చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

కీర్తనలు. 84

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన

84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
    నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
    పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
    అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
    వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.

ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
    వారు నిన్నే నడిపించ నిస్తారు.
దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
    నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
    ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.

సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
    యాకోబు దేవా, నా మాట వినుము.

దేవా, మా సంరక్షకుని కాపాడుము.
    నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
    నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
    నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
    దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
    ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.

Error: Book name not found: Sir for the version: Telugu Holy Bible: Easy-to-Read Version
1 కొరింథీయులకు 12:27-13:13

27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. 28 దేవుడు సంఘంలో ఉన్నవాళ్ళందర్నీ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తల్ని, మూడవ స్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత మహత్కార్యాలను చేసేవాళ్ళను, వాళ్ళ తర్వాత వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు సహాయం చేసేవాళ్ళను, పరిపాలించేవాళ్ళను, తమకు తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను ఉంచాడు. 29 వీళ్ళలో అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించేవాళ్ళు కారు, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కారు. 30 వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు. 31 కనుక మీ హృదయాలను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను.

ప్రేమను నీ మార్గదర్శిగా ఉండనివ్వు

13 ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు. నాకు దైవసందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి. నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము.

ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు. దానిలో క్రూరత్వము లేదు. దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కు మీద కోపం ఉండదు. అది తప్పులు ఎంచదు. ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది. ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది.

దైవసందేశాన్ని చెప్పే వరము మనము పొందాము. అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో జ్ఞానం ఉంది. అది నశించిపోతుంది. కాని ప్రేమ నశించి పోదు. ఎందుకంటే, మన జ్ఞానం మితమైంది, మనకుండే ఈ సందేశము అసంపూర్ణమైనది. 10 అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమౌతుంది.

11 నేను పసివానిగా ఉన్నప్పుడు పసివాని మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న గుణాల్ని మరిచిపోయాను. 12 ప్రస్తుతం అద్దంలో మసకగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే మనము చూస్తున్నాము. తదుపరి మనము ఆ ముఖాన్ని స్పష్టంగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది సంపూర్ణం కాదు. కాని తదుపరి నా గురించి దేవునికి తెలిసినంత సంపూర్ణంగా నాకు ఆయన్ని గురించి తెలుస్తుంది. 13 అంతందాకా ఈ మూడు, అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటాయి. వీటిలో ప్రేమ గొప్పది.

మత్తయి 18:21-35

క్షమించని సేవకుని ఉపమానం

21 అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లు[a] క్షమించాలని చెబుతున్నాను.

23 “అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు. 24 ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలు పెట్టగానే వేలకొలది తలాంతులు[b] అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకు వచ్చారు. 25 కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. అందువల్ల ఆ రాజు అతణ్ణి, అతని భార్యను, అతని సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు.

26 “ఆ సేవకుడు రాజు ముందు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వండి, మీకివ్వ వలసిన డబ్బంతా యిచ్చేస్తాను’ అని వేడుకొన్నాడు. 27 రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేసాడు. పైగా అతని అప్పుకూడా రద్దు చేసాడు.

28 “ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనతో కలసి పనిచేసే సేవకుణ్ణి చూసాడు. తనకు వంద దేనారాలు అప్పువున్న అతని గొంతుక పట్టుకొని, ‘నా అప్పు తీర్చు!’ అని వేధించాడు.

29 “అప్పువున్నవాడు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వు! నీ అప్పు తీరుస్తాను!’ అని బ్రతిమిలాడాడు.

30 “కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు. 31 తోటి సేవకులు జరిగింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు.

32 “అప్పుడు ఆ ప్రభువు ఆ సేవకుణ్ణి పిలిచి, కోపంతో ‘దుర్మార్గుడా! నీవు బ్రతిమిలాడినందుకు నీ అప్పంతా రద్దు చేసాను. 33-34 మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు.

35 “మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International