Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 111-112

111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
    నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
    దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
    వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
    ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
    ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
    దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
    దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.

112 యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
    మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
    అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
    దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
    తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
    ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
    ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
    అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
    అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
    వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
    దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.

Error: Book name not found: 2Esd for the version: Telugu Holy Bible: Easy-to-Read Version
హెబ్రీయులకు 11:32-12:2

32 ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకును గురించి, సమ్సోనును గురించి, యెఫ్తాను గురించి, దావీదును గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు. 33 వీళ్ళు దేవుణ్ణి విశ్వసించటంవల్ల రాజ్యాలు జయించారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 34 భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి పోట్లనుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశ సైన్యాలను ఓడించారు. 35 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమవాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావునుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల కోరలేదు. 36 భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు. 37 కొందర్ని రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు. 38 ఎడారుల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో నివసించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందికాదు.

39 వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభించలేదు. 40 దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైనదాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్ళకు పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు.

కుమారులు, క్రమశిక్షణ

12 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు.

కీర్తనలు. 148

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

కీర్తనలు. 150

150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
    ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
    ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
    స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
    తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
    పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!

సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!

యెహోవాను స్తుతించండి.

ప్రకటన 21:1-4

క్రొత్త యెరూషలేము

21 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని[a] చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు. నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది.

సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు. వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు” అని అన్నది.

ప్రకటన 21:22-22:5

22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.

24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. 27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.

22 ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.

ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది. ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International