Book of Common Prayer
సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.
66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.
5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
6 సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.
16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
దేవుడు తన ప్రజలకు సహాయం చేయాలని కోరుట
9 యెహోవా ప్రజలకు ఒక పాఠం నేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు తన ఉపదేశాలను గ్రహించేట్టు చేయాలని యెహోవా ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రజలు చిన్న శిశువుల్లా ఉన్నారు. కొన్నాళ్ల నుంచే తల్లి పాలు తాగటం మొదలు పెట్టిన చిన్న శిశువుల్లా వారు ఉన్నారు. 10 కనుక వాళ్లు చిన్న శిశువులు అన్నట్టే యెహోవా వాళ్లతో మాట్లాడుతున్నాడు.
ఇక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ ఒక ఆజ్ఞ
ఇక్కడ ఒక నియమం, అక్కడ ఒక నియమం
ఇక్కడ ఒక పాఠం, అక్కడ ఒక పాఠం.
11 యెహోవా ఈ వింత విధానంలో మాట్లాడటం ప్రయోగిస్తాడు, ఈ ప్రజలతో మాట్లాడటానికి ఆయన ఇతర భాషలు ఉపయోగిస్తాడు.
12 గతంలో దేవుడు ఆ ప్రజలతో మాట్లాడి “ఇదిగో విశ్రాంతి స్థలం, ఇదే శాంతి స్థలం. అలసిపోయిన మనుష్యులు వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఇదే శాంతి స్థలం” అని చెప్పాడు.
కానీ ప్రజలు దేవుని మాట వినిపించుకోలేదు. 13 అందుచేత దేవుని మాటలు విదేశీ భాషలా ఉన్నాయి:
ఇక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ ఒక ఆజ్ఞ
ఇక్కడ ఒక నియమం, అక్కడ ఒక నియమం
ఇక్కడ ఒక పాఠం, అక్కడ ఒక పాఠం.
వారు చేసిందే వారికి నచ్చింది. కనుక ప్రజలు వెనక్కు తగ్గి, ఓడించబడ్డారు. ప్రజలు పట్టుబడి, బంధించబడ్డారు.
దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు
14 యెరూషలేములో ఉన్న నాయకులారా, యెహోవా సందేశం మీరు వినాలి. కానీ ఇప్పుడు ఆయన మాట వినడానికి మీరు నిరాకరిస్తున్నారు. 15 “మరణంతో మేము ఒక ఒడంబడిక చేసుకున్నాం. చావు స్థలం, పాతాళంతో మాకు ఒక ఒప్పందం ఉంది. కనుక మేము శిక్షించబడం. శిక్ష మమ్మల్ని బాధించకుండానే దాటి పోతుంది. మా మాయలు అబద్ధాల చాటున మేము దాక్కొంటాం” అని మీరు చెబుతున్నారు.
16 ఆ విషయాల మూలంగా, నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నేల మీద నేను ఒక బండను, ఒక మూలరాయిని ఉంచుతాను. ఇది చాలా ప్రశస్తమైన రాయి. ముఖ్యమైన ఈ బండమీదనే సమస్తం నిర్మించబడుతుంది. ఆ బండను విశ్వసించిన వారు నిరాశ చెందరు.
క్రీస్తు దేహంలో ఐక్యత
4 ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2 అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. 3 శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. 4 శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. 5 ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. 6 ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.
7 క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. 8 అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:
“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు.
మానవులకు వరాలిచ్చాడు.”(A)
9 “ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! 10 క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. 11 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. 12 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. 13 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.
14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. 15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. 16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.
116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
నాకు ఎంతో సంతోషం.
2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
నేను భయపడి చింతపడ్డాను.
4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
“యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
5 యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
యెహోవా దయగలవాడు.
6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
7 నా ఆత్మా, విశ్రమించు!
యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
10 “నేను నాశనమయ్యాను!”
అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే”
అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.
12 యెహోవాకు నేను ఏమివ్వగలను?
నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
13 నన్ను రక్షించినందుకు
నేను ఆయనకు పానార్పణం యిస్తాను.
యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.
15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము.
యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను.
యెహోవా, నీవే నా మొదటి గురువు.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను.
యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను.
యెహోవాను స్తుతించండి!
117 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి.
సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
2 దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు.
దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు.
యెహోవాను స్తుతించండి!
పవిత్రాత్మ వాగ్దానం
15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు. 16-17 మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని[a] పంపుమని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందుకంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు.
18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను. 19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. 20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు. 21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”
22 అప్పుడు యూదా (యూదా ఇస్కరియోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.
23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. 24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.
25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.
27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. 28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.
30 “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు. 31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను.
“రండి, యిక్కడి నుండి వెళ్దాం!”
© 1997 Bible League International