Book of Common Prayer
దావీదు కీర్తన.
37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4 యెహోవాను సేవించటంలో ఆనందించుము.
ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
5 యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6 నీ మంచితనం, న్యాయం
మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7 యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
8 కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20 కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
వారు పొగవలె కనబడకుండా పోతారు.
21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24 అతడు తొట్రుపడినా పడిపోడు,
ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.
32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.
35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36 కాని తర్వాత వారు లేకుండా పోయారు.
నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,
సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
పాతాళం నుండి మిడుతలు
9 ఐదవ దేవదూత తన బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమ్మీద పడ్డ నక్షత్రాన్ని చూశాను. పాతాళం[a] యొక్క తాళం చెవి ఈ నక్షత్రానికి యివ్వబడింది. 2 అతడు పాతాళాన్ని తెరిచాడు. అప్పుడు దాన్నుండి పెద్ద పొగ లేచింది. అది ఒక పెద్ద కొలిమి నుండి వచ్చినట్లు అనిపించింది. పాతాళం నుండి వచ్చిన పొగవల్ల సూర్యుడు, ఆకాశం చీకటైపోయాయి.
3 ఆ పొగనుండి మిడతలు భూమ్మీదికి వచ్చాయి. తేళ్ళవలె కుట్టే శక్తి ఆ మిడతలకివ్వబడింది. 4 భూమ్మీద ఉండే గడ్డికి కాని, మొలకకు కాని, చెట్టుకు కాని హాని చేయవద్దని, నుదుటిమీద దేవుని ముద్రలేనివాళ్ళకు మాత్రమే హాని కలిగించమని ఆ మిడతలకు చెప్పబడింది. 5 మనుష్యుల్ని ఐదు నెలల దాకా హింసించే శక్తి వాటికి యివ్వబడింది. వాళ్ళను చంపే శక్తి వాటికి యివ్వబడలేదు కాని అవి కుట్టినప్పుడు తేళ్ళు కుట్టినట్లు నొప్పి కలుగుతుంది. 6 ఆ కాలంలో మనుష్యులు చావే మంచిదని చావును వెతుకుతారు. కాని వాళ్ళకది దొరకదు. వాళ్ళు చావాలని చాలా ఆశిస్తారు. కాని చావు వాళ్ళను తప్పించుకొని వెళ్ళిపోతుంది.
7 ఆ మిడుతలు యుద్ధానికి సిద్ధం చేయబడిన గుఱ్ఱాలలా కనిపించాయి. వాటి తలలమీద బంగారు కిరీటాల్లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి. 8 వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి కోరలు సింహపు కోరల్లా ఉన్నాయి. 9 అవి ఇనుప కవచాలు వేసుకొని ఉన్నాయి. వాటి రెక్కల ధ్వని గుఱ్ఱాలు, రథాలు యుద్ధానికి వెడుతున్నప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 10 వాటి తోకలు తేళ్ళ తోకల్లా కొండ్లతో ఉన్నాయి. వాటి తోకల్లో ఐదు నెలల దాకా ప్రజల్ని హింసించే శక్తి ఉంది. 11 పాతాళ లోకపు దూత వాటికి రాజుగా ఉన్నాడు. హీబ్రూ భాషలో వాని పేరు అబద్దోను. గ్రీకు భాషలో వాని పేరు అపొల్లుయోను.
12 మొదటి శ్రమ సమాప్తమయింది. మిగతా రెండు శ్రమలు యింకా జరుగవలసి ఉన్నాయి.
మంచి సమరయుని ఉపమానం
25 ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం[a] పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
26 దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.
27 అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.
28 యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”
29 ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.
30 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.
31 “అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు. 32 అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.
33 “ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. 34 అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. 35 మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”
36 ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.
37 ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు.
దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.
© 1997 Bible League International