Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 146-147

146 యెహోవాను స్తుతించండి!
    నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
    నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
    మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
    అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
    సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
    గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
    విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
    అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!

147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    మన దేవునికి స్తుతులు పాడండి.
    ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
    బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
    వారి గాయాలకు కట్లు కడతాడు.
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
    వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
    ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
పేదలను యెహోవా బలపరుస్తాడు.
    కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
    స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
    భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
    పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
    ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
    సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
    నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
    ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
    దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
    ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
    ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
    మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.

19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
    దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
    ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.

యెహోవాను స్తుతించండి!

కీర్తనలు. 111-113

111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
    నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
    దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
    వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
    ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
    ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
    దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
    దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.

112 యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
    మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
    అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
    దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
    తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
    ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
    ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
    అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
    అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
    వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
    దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.

113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
    యెహోవా నామాన్ని స్తుతించండి.
ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
    సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
    ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
    దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
    ఆయన తప్పక కిందికి చూడాలి.
దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
    భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
    ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
    కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.

యెహోవాను స్తుతించండి!

మీకా 6:1-8

యెహోవా ఫిర్యాదు

యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను.
నీవు లేచి, పర్వతాలముందు నిలబడు.
    వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి.
తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది.
    పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి.
భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి.
    ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు!

యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను?
    మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను?
    మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి!
నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను!
    ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్మల్ని నేను తీసుకువచ్చాను.
మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను.
    నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను.
నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి.
    బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి.
అకాసియ (షిత్తీము) నుండి గిల్గాలువరకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి.
    అప్పుడు యెహోవా న్యాయ వర్తనుడని మీరు తెలుసుకుంటారు!”

దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?

దేవుడైన యెహోవా సన్నిధికి నేను వచ్చినప్పుడు,
    నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి?
ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను
    దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా?
యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా?
    నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్ని బలి ఇవ్వనా?
నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో
    భాగంగా పుట్టిన శిశువును అర్పించనా?

మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు.
    యెహోవా నీనుండి కోరేవి ఇవి:
ఇతరులపట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు.
    ప్రజలపట్ల ప్రేమ, దయ కలిగిఉండటానికి ఇష్టపడు.
    అణకువ కలిగి నీ దేవునితో జీవించు.

1 కొరింథీయులకు 4:9-16

మరణ శిక్ష పొందిన నేరస్థుల్లాగా, దేవుడు అపొస్తులులమైన మమ్మల్ని చివరన ఉంచాడు. లోకమంతటికీ, దేవదూతలకు, మానవులకు అపొస్తులమైన మేము ప్రదర్శనా వస్తువులయ్యాము. 10 క్రీస్తు కొరకు మేము మూర్ఖులమయ్యాము. కాని మీరు క్రీస్తు విషయంలో తెలివిగా నడచుకొన్నారు. మేము బలహీనులము. మీరు బలవంతులు. మీకు గౌరవం లభిస్తోంది. మాకు అవమానం లభిస్తోంది. 11 ఇప్పటికీ మేము ఆకలిదప్పులతో బాధపడ్తున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తున్నాము. నిర్దాక్షిణ్యమైన హింసలు అనుభవిస్తున్నాము. మాకు ఇల్లు వాకిలి లేదు. 12 మేము మా చేతుల్తో కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం. 13 అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము.

14 మిమ్మల్ని సిగ్గుపరచాలని ఇలా వ్రాయటంలేదు. నా పుత్రులవలె ప్రేమించి హెచ్చరిస్తున్నాను. 15 క్రీస్తులో మీకు పదివేల మంది ఉపదేశకులు ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితం మూలంగా సువార్త తెచ్చి మీకు తండ్రినయ్యాను. 16 కనుక నన్ను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను.

మత్తయి 15:21-28

యేసు యూదులు కాని స్త్రీకి సహాయం చేయటం

(మార్కు 7:24-30)

21 యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22 కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది.

23 యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు.

24 యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల[a] కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు.

25 ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది.

26 యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు.

27 “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది.

28 అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International