Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 107:33-108:13

33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
    నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
    ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
    ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
    ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
    వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి.
    వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు
    చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు.
    బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు.
    ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు.
    కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
    ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.

దావీదు స్తుతి కీర్తన

108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
    నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
    స్వర మండలములారా, సితారలారా,
    మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
    ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
    నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
    సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
    నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.

యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
    “యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
    (ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
    నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
    వారికి సుక్కోతులోయను ఇస్తాను.
    గిలాదు, మనష్షే నావి.
    ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
    యూదా నా రాజదండం.
    మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
    ఎదోము నా చెప్పులు మోసే బానిస.
    ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”

10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
    ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
    నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
    మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
    దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.

కీర్తనలు. 33

33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
    ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
దేవుని మాట సత్యం!
    ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
    యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
    భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
    మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
    ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
    ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
    వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
    ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
    దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
    మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
    ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
    ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
    ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
    తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
    ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
    ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
    ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
    నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
    కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.

హోషేయ 11:1-9

ఇశ్రాయేలు యెహోవాను మరచి పోవుట

11 “ఇశ్రాయేలు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను.
    మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను.
కాని, ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే
    అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు.
బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు.
    విగ్రహాలకు వారు ధూపం వేశారు.

“అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే!
    ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తుకొన్నాను!
నేను వారిని స్వస్థపరిచాను.
    కాని అది వారికి తెలియదు.
తాళ్లతో నేను వారిని నడిపించాను.
    కాని అవి ప్రేమ బంధాలు.
నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను.
    నేను వంగి వారికి భోజనం పెట్టాను.

“ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు. వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.

“నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”

యెహోవా ఇశ్రాయేలుని నాశనం చేయడు

“ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకు లేదు.
    ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె.
నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు!
    నిన్ను సెబొయీములాగ చెయ్యాలనీ లేదు!
నేను నా మనసు మార్చుకుంటున్నాను,
    నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
నేను నా కోపాగ్నిని అణచుకొంటాను.
    నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను.
నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి.
    నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.

అపొస్తలుల కార్యములు 22:17-29

17 “నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది. 18 ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను.

19 “నేను, ‘ప్రభూ! నేను యూదుల ప్రతి సమాజమందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. 20 నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్నవాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.

21 “అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కానివాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.”

22 ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు. 23 వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు. 24 సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. 25 అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతితో, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.

26 ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోమా పౌరుడట!” అని అన్నాడు.

27 ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోమా పౌరుడివా?” అని అడిగాడు.

“ఔను!” పౌలు సమాధానం చెప్పాడు.

28 సహస్రాధిపతి, “నేను రోమా పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు.

పౌలు, “నేను పుట్టినప్పటినుండి రోమా పౌరుణ్ణి!” అని అన్నాడు.

29 అతణ్ణి ప్రశ్నలడగాలనుకొన్నవాళ్ళు తక్షణమే వెనుకంజ వేసారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోమా పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు.

లూకా 6:27-38

శత్రువులను ప్రేమించు

(మత్తయి 5:38-48; 7:12)

27 “కాని, నా మాటలు వినే వాళ్ళకు యిది నేను చెబుతున్నాను: మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి. 28 మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి. 29 ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు. 30 అడిగిన వాళ్ళకు యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి. 31 ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి.

32 “మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు. 33 మీకు మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులుకూడా అదే విధంగా చేస్తారు. 34 అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు.

35 “మీ శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. 36 మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి.

ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము

(మత్తయి 7:1-5)

37 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అప్పుడు ఇతర్లు మీపై తీర్పు చెప్పరు. ఇతర్లను నిందించకండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు. 38 ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International