Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 56-58

సంగీత నాయకునికి: “దూరపు సింధూర మ్రానులోని పావురము” రాగం. ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.

56 దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము.
    రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.
    నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను.
నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
    దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.
    వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.
    నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,
    వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.
    నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు
నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.

కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.
దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు.

10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
    యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.
    మనుష్యులు నన్ను బాధించలేరు.

12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.
    నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.
    నేను ఓడిపోకుండా నీవు కాపాడావు.
కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే
    చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.

57 దేవా, నన్ను కరుణించు
    నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
    నేను నీ శరణు జొచ్చియున్నాను.
మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
    దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
    నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
    నాకు చూపిస్తాడు.

నా జీవితం ప్రమాదంలో ఉంది.
    నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
    మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.

దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
    నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
    వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
    కాని వారే దానిలో పడ్డారు.

దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
    నేను నీకు స్తుతులు పాడుతాను.
నా ఆత్మా, మేలుకొనుము!
    స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
    ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
    ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం.

58 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.
    మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.
    ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.
    పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.
    వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
త్రాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.
    ఆ దుర్మార్గులు అలా ఉన్నారు.

యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.
    కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.
    బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.
    చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా
    కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.

10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం
    వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు.
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.
    లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”

కీర్తనలు. 64-65

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

64 దేవా, నా ప్రార్థన ఆలకించుము.
    నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
    వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీపరుని మీద వేస్తారు.
    అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడతాడు.
అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
    వారు వారి ఉరులను పెడతారు. “వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని” వారనుకొంటారు.
మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
    మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతో కష్టం.
కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు.
    అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
    కాని దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
    అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
    వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
    ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
    వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యుల్లారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
    నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
    ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
    నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
    నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
    నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
    ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
    మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
    మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
    దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
    నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
    నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
    భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
    అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
    బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
    లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.

యోబు 40

40 యోబుతో యెహోవా ఇలా చెప్పాడు:

“యోబూ, సర్వశక్తిమంతుడైన దేవునితో నీవు వాదించావు.
    తప్పు చేశానని నీవు నాకు తీర్పు చెప్పావు.
    ఇప్పుడు నీవు తప్పుచేశావని ఒప్పుకుంటావా? నాకు జవాబు ఇస్తావా?”

అప్పుడు దేవునికి యోబు ఇలా జవాబు చెప్పాడు.

“నేను ముఖ్యం కాదు.
    నీకు నేను ఏమి చెప్పగలను?
నీకు నేను జవాబు ఇవ్వలేను.
    నా చేతితో నేను నా నోరు మూసుకొంటాను.
నేను ఒకసారి మాట్లాడాను. కానీ నేను మరల జవాబు ఇవ్వను.
    నేను రెండుసార్లు మాట్లాడాను. కానీ నేను ఇంక ఏమీ చెప్పను.”

అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా అన్నాడు:

“యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు.

“యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా?
    నీదే సరిగ్గా ఉన్నట్లు కనబడేలా చేయాలని, నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా?
యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా ఉన్నాయా?
    నీ స్వరాన్ని నా స్వరంలా ఉరిమేట్టు నీవు చేయగలవా?
10 ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, తేజస్సును వస్త్రాల్లా ధరించు.
11 యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్ఠులను తక్కువగా చూడు.
    యోబూ, ఆ గర్విష్ఠుల మీద నీ కోపం కుమ్మరించు. ఆ గర్విష్ఠులను దీనులుగా చేయి.
12 అవును, యోబూ, ఆ గర్విష్ఠులను చూడు.
    వారిని దీనులనుగా చేయి. దుర్మార్గులను వారు ఉన్న చోటనే చితుకగొట్టు.
13 గర్విష్ఠులందరినీ మట్టిలో పాతిపెట్టు.
    వారి శరీరాలను చుట్టేసి వారి సమాధులలో పెట్టు
14 యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే
    అప్పుడు నిన్ను నీవే రక్షించుకొనుటకు సమర్ధుడవని నీ దగ్గర నేను ఒప్పుకొంటాను.

15 “యోబూ, నీటి గుర్రాన్ని చూడు.
    నేను (దేవుణ్ణి) నీటి గుర్రాన్ని చేశాను. మరియు నిన్నూ (యోబు) నేను చేశాను.
    నీటి గుర్రం ఆవులా గడ్డి తింటుంది.
16 నీటి గుర్రం శరీరంలో చాలా బలం ఉంది.
    దాని కడుపులోని కండరాలు చాలా శక్తివంతంగా ఉంటాయి.
17 నీటి గుర్రం తోక దేవదారు వృక్షంలా బలంగా నిలుస్తుంది.
    దాని కాలి కండరాలు చాలా బలంగా ఉంటాయి.
18 నీటి గుర్రం యొక్క ఎముకలు ఇత్తడిలా గట్టిగా ఉంటాయి.
    దాని కాళ్లు ఇనుప కడ్డీలా ఉంటాయి.
19 నీటి గుర్రం నేను (దేవుణ్ణి) చేసిన మహా అద్భుత జంతువు.
    కాని నేను దానిని ఓడించగలను.
20 అడవి జంతువులు ఆడుకొనే కొండల మీద
    నీటి గుర్రం తినే గడ్డి పెరుగుతుంది.
21 తామర చెట్ల క్రింద నీటి గుర్రం పండుకుంటుంది.
    జమ్ము గడ్డీ మడుగులలో నీటి గుర్రం దాక్కుంటుంది.
22 తామర మొక్కలు తమ నీడలో నీటి గుర్రాన్ని దాచిపెడతాయి.
    నది సమీపంగా పెరిగే నిరవంజి చెట్ల క్రింద అది నివసిస్తుంది.
23 నది వరదలై పొర్లినా నీటి గుర్రం పారిపోదు.
    యొర్దాను నది దాని ముఖం మీద చిమ్మితే అది భయపడదు.
24 నీటి గుర్రానికి కళ్లు కట్టి ఒక ఉచ్చులో
    దానిని ఎవరూ పట్టుకొనలేరు.

అపొస్తలుల కార్యములు 15:36-16:5

పౌలు, బర్నబా విడిపోవటం

36 కొంతకాలం తర్వాత పౌలు బర్నబాతో, “ప్రభువు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి, మనం మళ్ళీ వెళ్దాం. అక్కడి సోదరుల్ని కలుసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి వద్దాం” అని అన్నాడు.

37 బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. 38 కాని తమతో పని చెయ్యకుండా తమను పంఫూలియలో వదిలి వేసాడు కాబట్టి పౌలు అతణ్ణి పిలుచుకు వెళ్ళటం మంచిది కాదనుకొన్నాడు. 39 బర్నబా, పౌలు మధ్య తీవ్రమైన వివాదము కలగటం వల్ల వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట పిలుచుకొని ఓడలో సైప్రసుకు వెళ్ళాడు.

40 పౌలు, సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభువు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు. 41 అతడు సిరియ, కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు.

పౌలు, సీల వెంట తిమోతి వెళ్ళటం

16 ఆ తర్వాత పౌలు దెర్బే వెళ్ళి అక్కడినుండి లుస్త్రకు వెళ్ళాడు. లుస్త్రలో తిమోతి అనే పేరుగల ఒక విశ్వాసి ఉండేవాడు. అతని తల్లి భక్తిగల యూదురాలు; తండ్రి గ్రీసు దేశస్థుడు. లుస్త్ర, ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. పౌలు అతణ్ణి తన వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతంలో నివసించే యూదులందరికి తెలుసు. కాబట్టి అతనికి సున్నతి చేయించాడు.

అపొస్తలులు, పెద్దలు యెరూషలేములో నిర్ణయించిన నియమాల్ని, వాళ్ళు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలకు తెలియచేసి, వాటిని పాటించమని చెప్పారు. తద్వారా సంఘాల్లో భక్తి అభివృద్ధి చెందింది. రోజు రోజుకూ ఆ సంఘాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

యోహాను 11:55-12:8

55 యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేముకు వెళ్ళారు. 56 అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. 57 ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.

యేసు బేతనియలో తన స్నేహితులతో

(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)

12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.

4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.

యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International