Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 40

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
    నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
    ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
    ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
    యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
    వారు యెహోవాను నమ్ముకొంటారు.
ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
    ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
    ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
    మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
    నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.

యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
    బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
    దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
    నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
    నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
    యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
    ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
    నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
    నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
    లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
    నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
    నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
    త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
    ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
    వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
    “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
    యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
    నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

కీర్తనలు. 54

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

కీర్తనలు. 51

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
    వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
    నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15     నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
    లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
    దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
    యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
    మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.

యోబు 29:1

యోబు తన మాటలు కొనసాగించటం

29 యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:

యోబు 31:24-40

24 “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు.
    ‘నీవే నా ఆశ అని’ స్వచ్ఛమైన బంగారంతో నేను ఎన్నడూ చెప్పలేదు.
25 నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండిపోలేదు.
    లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో మురిసిపోలేదు.
26 నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి
    లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు.
27 సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు
    నేను ఎన్నడూ మోసగించబడలేదు.
28 అలాంటివి ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే.
    ఎందుచేతనంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైనవాడి నవుతాను.

29 “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు
    నేను ఎన్నడూ సంతోషించలేదు.
నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు
    నేను ఎన్నడూ నవ్వలేదు.
30 నా శత్రువులను శపించటం ద్వారానూ, వారు చావాలని కోరుకోవటం ద్వారానూ,
    నేను ఎన్నడూ నా నోటితో పాపం చేయలేదు.
31 పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు
    నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు.
32 పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా
    నేను అలాంటి వారిని ఎల్లప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను.
33 ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
    కాని నేను నా దోషాన్ని దాచిపెట్టలేదు.
34 ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు.
    నేను ఎన్నడూ మౌనంగా ఉండలేదు.
    బయటకు వెళ్లకుండా ఉండలేదు. ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయం నాకు లేదు గనుక.

35 “ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును.
    ఇప్పుడు నేను నా వాదం చెబుతాను.
సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు జవాబిచ్చును గాక.
    నన్ను నిందించే ఆయన, నేను చేశానని నిందించబడుతున్న సంగతులను వ్రాసి పెట్టును గాక.
36 నిశ్చయంగా ఆ వ్రాతను నేను నా భుజం మీద ధరిస్తాను.
    నేను దానిని కిరీటంలా ధరిస్తాను.
37 నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను.
    నేను ఒక అధికారిలా నా తలపైకి ఎత్తుకొని దేవుని దగ్గరకు వస్తాను.

38 “నేను సాగుచేస్తున్న భూమిని దాని స్వంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే,
    ఆ భూమి దాని స్వంత కన్నీళ్లతో తడిసి ఉంటే,
39 ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే
    నేను దొంగిలించి ఉంటే,
40 అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే
    పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!”

యోబు మాటలు సమాప్తం.

అపొస్తలుల కార్యములు 15:12-21

12 సభలో ఉన్నవాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. బర్నబా, పౌలు యూదులు కానివాళ్ళలో దేవుడు తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని గురించి చెప్పగా వాళ్ళు విన్నారు. 13 పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి! 14 దేవుడు మొదట్లో యూదులు కానివాళ్ళ పట్ల తన అభిమానాన్ని చూపి వాళ్ళనుండి కొందర్ని ఎన్నుకొని తన ప్రజలుగా ఎలా చేసుకొన్నాడో సీమోను మనకు వివరించి చెప్పాడు. 15 ఈ సంఘటనను ప్రవక్తలు ఈ వాక్యాల్లో సరిగ్గా వర్ణించారు:

16 ‘కూలిపోయిన దావీదు యింటిని పునర్నిర్మిస్తాను!
    ఆ శిథిలాలతో క్రొత్త యింటిని నిర్మిస్తాను!
17 మిగతా వాళ్ళంతా ప్రభువును వెతుకుతారు!
    నేనెన్నుకొన్న యూదులుకాని ప్రజలు కూడా వెతుకుతారు.’(A)

18 ‘అని ప్రభువు చాలా కాలం క్రిందటే తెలియచేసాడు.’

19 “దేవుడు యూదులు కానివాళ్ళను కూడా అంగీకరించాడు కాబట్టి, దేవుని వైపు మళ్ళుతున్న వాళ్ళ మనస్సుకు కష్టం కలిగించ కూడదని నా అభిప్రాయం. 20-21 కాని తరతరాలనుండి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి పట్టణంలో ప్రకటిస్తూ, వాటిని ప్రతి విశ్రాంతి రోజు సమాజ మందిరాల్లో చదివారు కాబట్టి,

విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం ముట్టరాదని,

లైంగిక పాపము చేయరాదని,

గొంతు నులిమి చంపిన జంతువుల మాంసం ముట్టరాదని, జంతువుల రక్తాన్ని తినరాదని వాళ్ళకు మనం వ్రాయాలి.”

యోహాను 11:30-44

30 యేసు గ్రామంలోకి రాలేదు. ఆయనింకా మార్త కులుసుకొన్న చోటే ఉన్నాడు. 31 మరియ యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్తోందని ఆమె వెంట వెళ్ళారు. 32 మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు!” అని అన్నది.

33 ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన హృదయం కరిగి పోయింది. 34 “అతన్నెక్కడ సమాధిచేసారు?” అని యేసు అడిగాడు.

“వచ్చి చూడండి ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

35 యేసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

36 అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా ప్రేమించాడో చూడండి!” అని అన్నారు.

37 కాని కొందరు, “గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించిన యితడు, చనిపోకుండా చెయ్యలేక పోయాడా?” అని అన్నారు.

యేసు లాజరును బ్రతికించటం

38 యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది. 39 “ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు.

చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అన్నది.

40 అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు.

41 వాళ్ళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి చూసి, “తండ్రి నీవు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుణ్ణి. 42 నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలాని అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు. 43 ఈ విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, “లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు. 44 చినిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నాయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది.

యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, అతణ్ణి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International