Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 45

సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.

45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
    అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
    నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.

నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
    నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
    కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
    అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
    అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
    నీ నీతి రాజదండము.
నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
    కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
    నీ దేవుడు కోరుకొన్నాడు.
నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
    నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
    నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.

10 కుమారీ, నా మాట వినుము.
    నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11     రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
    నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
    వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.

13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
    ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
    ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
    సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.

16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
    దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
    శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.

కీర్తనలు. 47-48

సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.

47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
    సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
    భూలోకమంతటికీ ఆయన రాజు.
ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
    ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
    యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.

బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
    యెహోవా దేవుడు లేచాడు.
దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
    మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
దేవుడు సర్వలోకానికి రాజు.
    స్తుతిగీతాలు పాడండి.
దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
    దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
    దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
    దేవుడు మహోన్నతుడు.

కోరహు కుమారుల స్తుతి పాట.

48 యెహోవా గొప్పవాడు.
    మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
    అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
    అది మహారాజు పట్టణం.
ఇక్కడ ఆ పట్టణంలోని
    భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
    వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
    ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
    వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
    ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
దేవా, బలమైన తూర్పుగాలితో
    తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
    మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.

దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
    భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
    మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
    ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
    సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
    ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.

యోబు 29:1-20

యోబు తన మాటలు కొనసాగించటం

29 యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:

“దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసుకొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే
    నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
    (నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను.
    అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా
    నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట.
    నా మార్గం అంతా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.

“నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి
    ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు.
    పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి
    నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు.
    అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
11 నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు.
    నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.
12 ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను.
    తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకొనేవారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.
13 మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు.
    అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.
14 సక్రమంగా జీవించటం నాకు వస్త్రం.
    న్యాయం నాకు అంగీలా, తలపాగాలా ఉండేది.
15 గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను.
    కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.
16 పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
    కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.
17 దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను.
    దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.

18 “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బ్రతుకుతాను.
    తర్వాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.
19 వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు
    మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.
20 నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది.
    నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.

అపొస్తలుల కార్యములు 14:1-18

ఈకొనియలో

14 ఈకొనియలో పౌలు, బర్నబా ఎప్పటిలాగే యూదుల సమాజమందిరానికి వెళ్ళి, బాగా మాట్లాడారు. తద్వారా చాలా మంది యూదులు, యూదులు కానివాళ్ళు విశ్వాసులయ్యారు. వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు.

కాబట్టి, వాళ్ళు ప్రభువు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భుతాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి రుజువు చేసాడు. ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల పక్షం చేరిపోయారు.

యూదులు కానివాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు. కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు.

లుస్త్ర, దెర్బే పట్టణాల్లో

లుస్త్రలో ఒక కుంటివాడుండేవాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు. పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి, 10 “లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలు పెట్టాడు.

11 పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా అన్నారు. 12 బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు. 13 వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలనే ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణ ద్వారాల దగ్గరకు తెచ్చారు.

14 కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు: 15 “అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికిరానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు.

16 “ఇదివరలో దేవుడు ప్రజల్ని తమ యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు. 17 కాని ఆకాశంనుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన మనసుల్ని ఆనందంతో నింపి మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేసాడు.”

18 ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము యివ్వాలనుకొన్న బలినివ్వటం మానుకోలేదు.

యోహాను 10:31-42

31 యూదులు ఆయన్ని కొట్టాలని మళ్ళీ రాళ్ళెత్తారు. 32 కాని యేసు వాళ్ళతో, “నేను నా తండ్రి చేయుమన్న ఎన్నో మంచి పనులు చేసాను. వీటిలో దేన్ని చేసినందుకు మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు?” అని అన్నాడు.

33 యూదులు, “నీవు మంచి పనులు చేసినందుకు రాళ్ళు రువ్వటం లేదు కాని, నీవు దైవదూషణ చేస్తున్నందుకు. మనిషివై దేవుణ్ణి అని అంటున్నందుకు నిన్ను చంపదలచాము” అని అన్నారు.

34 యేసు సమాధానంగా, “మీ ధర్మశాస్త్రంలో, ‘మీరు దేవుళ్ళని’ దేవుడు అన్నట్లు వ్రాయబడి ఉంది. 35 మీ ధర్మశాస్త్రం అసత్యం చెప్పదు. దేవుడు తన సందేశం విన్న ప్రజల్ని దేవుళ్ళుగా అన్నాడు. 36 తండ్రి నన్ను ఎన్నుకొని తన కార్యం చెయ్యటానికి ఆ ప్రపంచంలోకి పంపాడు. మరి నేను దేవుని కుమారుణ్ణి అని అనటం ఆయన్ని దూషించటం ఎట్లా ఔతుంది? 37 నేను, నా తండ్రి కార్యం చేస్తే తప్ప నన్ను విశ్వసించకండి. 38 నేను నా తండ్రి కార్యాన్ని చేసాను. కనుక మరి నన్ను విశ్వసించకపోయినా కనీసం నా కార్యన్ని విశ్వసించండి. అలా చేస్తే నా తండ్రి నాలో ఉన్నాడని, నేను నా తండ్రిలో ఉన్నానని మీకు స్పష్టంగా తెలిసిపోతుంది” అని అన్నాడు.

39 ఆయన్ని బంధించాలని వాళ్ళు మరొక సారి ప్రయత్నించారు. కాని ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

40 యేసు మళ్ళీ యొర్దాను నది యొక్క అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉండిపొయ్యాడు. ఇదివరలో యోహాను బాప్తిస్మము నిచ్చింది ఇక్కడే. 41 అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. “వాళ్ళు యోహాను ఏ మహాత్యం చెయ్యలేదు. కాని ఈయన్ని గురించి అతను చెప్పిన ప్రతీ విషయం నిజం” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 42 అక్కడ అనేకులు యేసును విశ్వసించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International