Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 38

జ్ఞాపకార్థ దినం[a] కోసం దావీదు కీర్తన.

38 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు.
    నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
యెహోవా, నీవు నన్ను బాధించావు.
    నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.
    నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
నేను చెడు కార్యాలు చేసిన దోషిని,
    ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
నేను తెలివితక్కువగా ఉన్నాను.
    ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.
    రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
నా నడుము వేడిగా కాలిపోతోంది.
    నా శరీరం అంతా బాధగా ఉంది.
నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.
    నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.
    నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది.
    నా చూపు దాదాపు పోయింది.
11 నా రోగం మూలంగా నా స్నేహితులు,
    నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు.
    నా కుటుంబం నా దగ్గరకు రాదు.
12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.
    నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను.
    మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను.
    నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.
    నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.
    నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.
    నేను నా బాధను మరచిపోలేను.
18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.
    నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,
    వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
20 నా శత్రువులు నాకు కీడు చేశారు,
    నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను.
మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను.
    కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.
    నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
    నా దేవా, నన్ను రక్షించుము.

కీర్తనలు. 119:25-48

దాలెత్

25 నేను త్వరలోనే చనిపోతాను.
    యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
26 నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు.
    ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
27 యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను.
    ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము,
    నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను.
    జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
31 యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను.
    నన్ను నిరాశ పరచవద్దు.
32 నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను.
    యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.

హే

33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
    నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
    నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
    నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
    నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
    నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
    నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
    జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
    నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.

వావ్

41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
    నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
    యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
    ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
    వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
    ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
    మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.

యోబు 12:1

తన స్నేహితులకు యోబు జవాబు

12 అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు:

యోబు 14

14 యోబు ఈ విధంగా చెప్పాడు:

“మనమందరం కష్టంతో నిండిన
    కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం.
మనిషి జీవితం పువ్వులాంటిది.
    అతడు త్వరగా పెరిగి, త్వరగా చస్తాడు.
కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం.
దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా?
    నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము.

“మురికి దానిలో నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు.
నరుని జీవితం పరిమితం.
    దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు.
    నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు.
కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు.
    అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు.

“అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది.
    దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది.
    అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది.
భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును.
    దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును.
కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది.
    మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది.
10 అయితే మనిషి మరణిస్తాడు.
    అతని శరీరం పాతి పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, అతుడు వెళ్లిపోయాడు.
11 సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు,
    ఒక నది నీరు ఎండిపోయినట్టు
12 సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు,
    అతడు పండుకొని, మళ్లీ లేవలేడు.
మరణించే మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత వరకు
    మేల్కొనరు, నిద్రించటం మానుకోరు.

13 “నీవు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ.
    నీ కోపం పోయేవరకు, నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండుననిపిస్తుంది నాకు.
అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచుకోవచ్చు
14 ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బ్రతుకుతాడా?
    నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత వరకు కష్టపడి పోరాడుతాను.
15 దేవా, నీవు నన్ను పిలుస్తావు,
    నేను (యోబు) నీకు జవాబు ఇస్తాను.
నన్ను నీవు చేశావు,
    నన్ను నీవు కోరుతావు
16 అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు.
    కానీ, నేను చేసిన పాపాలు నీవు జ్ఞాపకం చేసుకోవు.
17 నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా పారవేయి.

18 “సరిగ్గా ఒక పర్వతం కూలిపోయినట్టు
    ఒక బండదాని స్థలం నుండి తొలగించబడినట్టు
19 నీళ్లు రాళ్లను కడిగివేసి వాటిని అరగ దీసినట్టు,
    నీళ్లు నేలమీద మట్టిని కొట్టుకుపోవునట్లు,
    అదే విధంగా, దేవా నీవు ఒక మనిషి ఆశను నాశనం చేస్తావు.
20 నీవు మనిషిని ఒకసారి ఓడించి ముగిస్తే
    మనిషి పోయినట్టే.
నీవు వాని ముఖాన్ని చావు ముఖంగా మార్చివేసి
    శాశ్వతంగా వానిని పంపించివేస్తావు.
21 వాని కుమారులు గౌరవించబడినా అది ఎన్నటికీ అతనికి తెలియదు.
    అతని కుమారుడు చెడు చేస్తే అతడు ఎన్నటికీ దానిని చూడడు.
22 మనిషి తన స్వంత శరీరంతో బాధ అనుభవిస్తాడు.
    అతడు తన కోసమే ఎక్కువగా దుఃఖిస్తాడు.”

అపొస్తలుల కార్యములు 12:18-25

18 ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది. “పేతురు ఏమై ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. 19 హేరోదు పేతుర్ని వెతకటానికి అంతా గాలించమన్నాడు. కాని పేతురు కనిపించలేదు. హేరోదు కాపలావాళ్ళను అడ్డు ప్రశ్నలు వేసి విచారించాడు. ఆ తదుపరి ఆ కాపలావాళ్ళను చంపమని ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన తదుపరి హేరోదు యూదయనుండి కైసరియకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపాడు.

హేరోదు మరణం

20 హేరోదు తూరు, సీదోను ప్రజల పట్ల చాలా కోపంతో ఉన్నాడు. వాళ్ళంతా యిప్పుడు ఒకటై హేరోదుతో మాట్లాడటానికి వెళ్ళారు. రాజు ఆంతరంగిక స్నేహితుడైన బ్లాస్తు రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు అని దానియేలు బదులు చెప్పాడు. ను తమ వైపు త్రిప్పుకొని శాంతి కావాలని అడిగారు. వీళ్ళ రాజ్యం తమ ఆహారధాన్యాల కోసం హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం.

21 ఒక నియమితమైన రోజు హేరోదు రాజ దుస్తులు ధరించాడు. సింహాసనంపై కూర్చొని ప్రజల్ని సంబోధిస్తూ ఒక ఉపన్యాసం యిచ్చాడు. 22 “ఇది దేవుని కంఠం. మనిషిది కాదు” అని ప్రజలు ఆపకుండా కేకలు వేసారు. 23 దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీకరించినందుకు ప్రభువు దూత అతణ్ణి తక్షణమే రోగంతో పడవేసాడు. పురుగులు పట్టి అతడు చనిపోయాడు.

24 దైవసందేశం విని విశ్వసిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

25 బర్నబా, సౌలు తమ పని ముగించుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చారు. తమ వెంట మార్కు అని పిలువబడే యోహాన్ను కూడా పిలుచుకు వచ్చారు.

యోహాను 8:47-59

47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”

యేసు, అబ్రాహాము

48 “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు.

49 యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు. 50 నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. 51 ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు.

52 ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు. 53 నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు.

54 యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు. 55 ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను. 56 మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు.

57 ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు.

58 యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు. 59 ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International