Book of Common Prayer
ఖాఫ్
145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము.
నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు
నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
149 నీవు దయతో నా మాట విను.
యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము.
150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
151 యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు.
నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.
రేష్
153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
నీ ఉపదేశాలను నేను మరువలేదు.
154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
155 దుష్టులు జయించరు. ఎందుకంటే,
వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము
157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను.
ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
159 చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.
షీన్
161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.
తౌ
169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.
యాత్ర కీర్తన.
128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
3 ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.
ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.
యాత్ర కీర్తన.
129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
కాని వారు ఎన్నడూ జయించలేదు.
3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
8 ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
“యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
16 దాను వంశీయులైన ఆ ఆరువందల మంది మనుష్యులు వెలుపల ద్వారం వద్ద నిలిచారు. వారి వద్ద ఆయుధాలు ఉన్నాయి. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు. 17-18 ఐదుగురు గూఢచారులు ఇంట్లోకి వెళ్లారు. వెలుపల ద్వారం పక్కగా యుద్ధ సన్నద్ధులైన ఆ ఆరువందల మంది మనుష్యులతో యాజకుడు నిలబడివున్నాడు. ఆ మనుష్యులు మలిచిన విగ్రహం, ఏఫోదు, గృహదేవతలు మరియు వెండి విగ్రహం తీసుకున్నారు. యువకుడైన లేవీ యాజకుడు, “మీరేమి చేస్తున్నారు?” అని అడిగాడు.
19 ఆ ఐదుగురు ఇలా బదులు చెప్పారు: “ఊరక వుండు! ఒక్కమాట కూడా మాట్లాడ వద్దు. మాతో పాటు రా. మా తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీవు ఎన్నుకుని తీరాలి. కేవలం ఒక్క వ్యక్తికి తండ్రిగా, యాజకుడుగా ఉండటం మంచిదా? లేక ఇశ్రాయేలు ప్రజలలో ఒక వంశం వారికి యాజకుడుగా ఉండడం మంచిదా?”
20 లేవీ వ్యక్తికిది సంతోషదాయకమయింది. అందువల్ల అతను ఏఫోదు, గృహదేవతలు మరియు విగ్రహం తీసుకొని, దాను వంశం వారివద్ద నుంచి వచ్చిన మనుష్యులతో వెళ్లిపోయాడు.
21 తర్వాత దాను వంశానికి చెందిన ఆ ఆరువందల మంది మనుష్యులు లేవీ యాజకునితో కలిసి వెనుదిరిగి మీకా ఇల్లు విడిచి వెళ్లారు. వారు తమ చిన్న పిల్లలను, తమ జంతువులను తమ అన్ని వస్తువులను వారి ముందు విడిచిపెట్టి వెళ్లారు.
22 దాను వంశమునకు చెందిన ఆ మనుష్యులు ఆ చోటునుండి చాలా దూరం వెళ్లారు. మీకాదగ్గర నివసించే వారు ఒకటిగా కలుసుకున్నారు. తర్వాత దాను మనుష్యుల్ని వెంబడించారు. వారిని పట్టుకున్నారు. 23 దాను మనుష్యుల్ని మీకా మనుష్యులు కేకలు వేయసాగారు. దాను మనుష్యులు నిలబడ్డారు. “సమస్య ఏమిటి? ఎందుకు కేకలు వేస్తున్నారు?” అని మీకాని అడిగారు.
24 మీకా బదులు చెప్పెను: “దాను మనుష్యులైన మీరు నా విగ్రహాలు తీసుకుపోతున్నారు. వాటిని నా కోసం తయారు చేసుకున్నాను. మీరు నా యాజకుని కూడా తీసుకువెళ్తున్నారు. ఇక నాకు ఏమి మిగిలింది? ‘సమస్య ఏమిటి?’ అని మీరెలా అడుగుతారు?”
25 దాను వంశీయులు అందుకు ఇలా అన్నారు: “మాతో నీవు వివాదానికి పాల్పడడం మంచిది కాదు. మాలో కొందరు కోపిష్ఠులు. మమ్మల్ని నీవు కేకలు వేస్తే, వారు నిన్ను ప్రతిఘటించవచ్చు. నీవు, మీ కుటుంబాలవారూ చంపబడవచ్చు.”
26 తర్వాత దాను వంశానికి చెందిన మనుష్యులు వెనుదిరిగి తమ తోవను వెళ్లారు. ఆ మనుష్యులు తనకంటె బలాఢ్యులని మీకా గ్రహించాడు. అందువల్ల అతను ఇంటికి వెళ్లిపోయాడు.
27 కాగా మీకా చేసిన విగ్రహాలను దాను వంశీయులు తీసుకొనిపోయారు. మీకాతో ఉండిన యాజకుని కూడా తమతో పాటు తీసుకొనిపోయారు. తర్వాత వారు లాయిషుకి వచ్చారు. లాయిషులో నివసిస్తున్న వారి మీద దాడిచేశారు. ఆ మనుష్యులు శాంతముగా ఉన్నారు. వారు దాడిని ఎదురుచూడలేదు. దానుకు చెందిన మనుష్యులు వారిని తమ కత్తులతో చంపివేశారు. తర్వాత నగరాన్ని కాల్చివేశారు. 28 లాయిషులో నివసించేవారికి తమను కాపాడేవారు లేరు. వారు సీదోను నగరానికి చాలా దూరాన నివసించుటచే, ఆ నగర ప్రజలు సహాయం చేయలేకపోయారు. మరియు లాయిషు ప్రజలు అరాము ప్రజలతో ఒడంబడికయేమీ చేసుకొని ఉండలేదు. అందువల్ల వారు సహాయం చెయ్యలేదు. లాయిషు నగరం ఒక లోయలో ఉంది. అది బెత్రెహోబు పట్టణానికి చెందింది. దాను ప్రజలు ఆ ప్రదేశంలో ఒక కొత్త నగరం నిర్మించుకున్నారు. ఆ నగరం వారి నివాసమయింది. 29 దాను ప్రజలు ఆ నగరానికి కొత్త పేరు పెట్టారు. దానిని లాయిషు అన్నారు. కాని దానిని దాను అని మార్చివేశారు. ఆ నగరానికి ఇశ్రాయేలు కుమారులలో ఒకడైన దాను అను పూర్వీకుని పేరు పెట్టారు.
30 దాను వంశానికి చెందిన ప్రజలు దాను నగరంలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. వారు గెర్షోము కుమారుడైన యోనాతానును తమ యాజకునిగా నియమించుకున్నారు. గెర్షోము మోషే[a] కుమారుడు. యోనాతాను మరియు అతని కుమారులు ఇశ్రాయేలు ప్రజల్ని బందీలుగా చేసి బబులోనుకు తీసుకు వెళ్లేంతవరకు దాను వంశం వారికి యాజకులుగా ఉన్నారు. 31 దాను ప్రజలు మీకా చేసిన విగ్రహాలను పూజిస్తూండేవారు. దేవాలయము షిలోహులో ఉన్నంత కాలము వారు ఆ విగ్రహాలను పూజించుచుండిరి.
14 యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు. 15 పేతురు, యోహాను వచ్చి అక్కడివాళ్ళు పవిత్రాత్మను పొందాలని ప్రార్థించారు. 16 ఎందుకంటే అక్కడివాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు. 17 వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు.
18 అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో, 19 “నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే ఈ శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు.
20 పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ! 21 దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు. 22 నీ దుర్బుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు. 23 నీలో దుష్టత్వం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అపవిత్రతకు లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు.
24 ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు.
25 పేతురు, యోహాను తాము ప్రభువును గురించి విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు.
యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17)
6 ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ సముద్రం (తిబెరియ సముద్రం) దాటి వెళ్ళాడు. 2 ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగుచెయ్యటం చూసి, పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని అనుసరిస్తూవచ్చింది. 3 యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. 4 అవి పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదల పండుగ.
5 యేసు తలెత్తి పెద్ద ప్రజలగుంపు తన వైపు రావటం చూసి, ఫిలిప్పుతో, “వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం?” అని అడిగాడు. 6 అతణ్ణి పరీక్షించటానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చెయ్యాలో ముందే ఆలోచించుకొన్నాడు.
7 ప్రతి ఒక్కనికి ఒక్కొక్క ముక్క దొరకాలన్నా, రెండువందల దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది. అయినా అది చాలదు.
8 యేసు శిష్యుల్లో ఒకడైన అంద్రెయ అక్కడున్నాడు. యితడు సీమోను పేతురు సోదరుడు. 9 “ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని యింతమందికి అవి ఎట్లా సరిపోతాయి?” అని అన్నాడు.
10 యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!” అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య ఐదువేలు. 11 యేసు ఆ రొట్టెల్ని తీసుకొని, దేవునికి కృతజ్ఞత చెప్పి, అక్కడ కూర్చున్నవాళ్ళకు పంచిపెట్టాడు. అదే విధంగా చేపల్ని కూడా పంచి పెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు.
12 వాళ్ళు తృప్తిగాతిన్నాక, తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని ఎత్తి పెట్టండి!” అని అన్నాడు. 13 ఐదు బార్లీ రొట్టెల్ని పంచగా మిగిలిన ముక్కల్ని శిష్యులు పండ్రెండు గంపలనిండా నింపారు.
14 ప్రజలు యేసు చేసిన ఆ మహాకార్యాన్ని చూసి, “లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం మొదలు పెట్టారు.
15 యేసు వాళ్ళు తనను బలవంతంగా రాజును చెయ్యాలనుకుంటున్నారని గ్రహించాడు. కనుక ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళిపోయ్యాడు.
© 1997 Bible League International