Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 118

118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యాజకులారా, మీరు చెప్పండి.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.

నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
    యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
    నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
యెహోవా నా సహాయకుడు;
    నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
మనుష్యులను నమ్ముకొనుటకంటే
    యెహోవాను నమ్ముట మేలు.
మీ నాయకులను నమ్ముకొనుట కంటే
    యెహోవాను నమ్ముకొనుట మేలు.

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
    కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
    యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

17 నేను జీవిస్తాను! కాని మరణించను.
    మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
    కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
    నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
    ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
    మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
    అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
    ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
    దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26     యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”

యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
    బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”

28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
    నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

కీర్తనలు. 145

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా, అందరి యెడలా మంచివాడు.
    దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
    నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
    నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
    మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
    నీవు శాశ్వతంగా పాలిస్తావు.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
    కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
    సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
    జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

న్యాయాధిపతులు 16:15-31

15 అప్పుడు దెలీలా సమ్సోనుతో అన్నది: “‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’ అని నీవు ఎలా చెప్పగలవు? నా మీద నీకు నమ్మకం కూడా లేదు. నీవు మూడవ సారిగా నన్ను అవివేకిని చేశావు. నీ మహా బలానికిగల రహస్యాన్ని చెప్పనే లేదు.” 16 ఇలా ప్రతిరోజూ ఆమె సమ్సోనును వేధించుకు తినసాగింది. ఆమె అలా వేధించుకు తినడం చూసి అతను విసిగిపోయాడు. మరణం సంభవించేలా అనిపించింది. 17 చివరికి సమ్సోను దెలీలాతో అన్నీ చెప్పాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా జుట్టుని గొరిగించుకొనలేదు. నేను పుట్టుటకు మునుపే, నన్ను దేవునికి అర్పించారు. ఎవరైనా నా తలను గొరిగినట్లయితే, అప్పుడు నా బలాన్ని కోల్పోతాను. ఇతర మనుష్యుల్లా నేనప్పుడు బలహీనుణ్ణి అవుతాను.”

18 సమ్సోను తన రహస్యాన్ని చెప్పినట్లుగా దెలీలా గ్రహించింది. ఫిలిష్తీయుల పరిపాలకులకు ఒక సందేశం పంపింది. ఆమె ఇలా చెప్పింది: “మళ్లీ రండి. సమ్సోను నాతో అన్నీ చెప్పాడు.” అందువల్ల ఫిలిష్తీయుల పరిపాలకులు దెలీలా వద్దకు మళ్లీ వచ్చారు. తమతో పాటు వాళ్లు మాట యిచ్చిన ప్రకారం డబ్బు కూడా తీసుకు వచ్చారు.

19 సమ్సోను తన తొడమీద పడుకుని వున్నప్పుడు దెలీలా అతనిని నిద్ర పుచ్చింది. అప్పుడొక వ్యక్తిని లోనికి పిలిచి, సమ్సోను తల వెంట్రుకలను గొరిగి వేయమనింది. ఈ విధంగా సమ్సోనుని ఆమె బలహీనపరిచింది. సమ్సోను బలహీనుడయ్యాడు. 20 అప్పుడు అతణ్ణి లేవమని చెప్పి, “సమ్సోనూ, ఫిలిష్తీయులిప్పుడు నిన్ను పట్టుకోనున్నారు” అని ఆమె చెప్పింది. అతను మేల్కొన్నాడు. ఆలోచన చేశాడు, “నేను పూర్వం చేసినట్లుగా చేసి తప్పించుకుంటాను. స్వతంత్రుణ్ణి అవుతాను.” కాని యెహోవా అతనిని విడనాడి వెళ్లినట్లు సమ్సోను గ్రహించలేదు.

21 ఫిలిష్తీయులు సమ్సోనును పట్టుకున్నారు. వారతని కళ్లు పెరికి వేశారు. గాజా నగరానికి తీసుకుని వెళ్లారు. అతను పారిపోకుండా ఉండేందుకుగాను, సంకెళ్లతో బంధించారు. వారు సమ్సోనును చెరసాలలో ఉంచారు. అతని చేత ధాన్యం విసిరించారు. 22 కాని సమ్సోను వెంట్రుకలు మళ్లీ మొలవసాగాయి.

23 ఫిలిష్తీయుల పాలకులు ఒకటిగా చేరి పండగ చేసుకోవాలనుకున్నారు. తమ దేవుడైన దాగోనుకు[a] పెద్ద బలి కూడా ఇవ్వాలనుకున్నారు. “మన శత్రువైన సమ్సోనును ఓడించేందుకు మన దేవుడు మనకు సహాయం చేశాడు.” అని అనుకున్నారు. 24 సమ్సోనుని చూడగానే వారు తమ దేవుణ్ణి ప్రశంసించారు. వారు ఇలా అన్నారు:

“ఈ మనిషి మనవారిని నాశనం చేశాడు.
    ఈ మనిషి మనవారిలో పలువురిని చంపాడు,
కాని మన దేవుడు మన శత్రువుని వశం చేసుకునేందుకు సహాయం చేశాడు!”

25 ఉత్సవ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు వారిలా అన్నారు: “సమ్సోనును వెలికి తీసుకురండి. అతనిని చూసి మేము పరిహాసం చెయ్యాలి.” కనుక చెరసాల నుంచి సమ్సోనును బయటికి తీసుకువచ్చారు. అతనిని పరిహసించారు. దేవుడైన దాగోను గుడిలో స్తంభాల మధ్య సమ్సోనును నిలబెట్టారు. 26 ఒక సేవకుడు సమ్సోను చెయ్యి పట్టుకున్నాడు. అతనితో సమ్సోను, “ఈ ఆలయానికి ఆధారంగా వున్న స్తంభాల మధ్య నన్ను ఉంచు. వాటిని ఆనుకుని వుంటాను” అన్నాడు.

27 ఆ ఆలయం స్త్రీ పురుషులతో కిటకిటలాడుతున్నది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడికి చేరారు. ఆలయ కప్పుమీద సుమారు మూడువేల మంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారందరూ సమ్సోనును చూసి ఎగతాళి చేస్తున్నారు. 28 అప్పుడు యెహోవాను సమ్సోను స్తుతించాడు. “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నన్ను మరచిపోవద్దు. దేవుడా, మరొకసారి నాకు బలం ప్రసాదించు. నా రెండు కళ్లనీ చీల్చివేసిన ఈ ఫిలిష్తీయులను శిక్షించేందుకు నాకు శక్తి ఇయ్యి.” అని ప్రార్థించాడు. 29 అప్పుడు ఆలయం మధ్య వున్న రెండు స్తంభాలను సమ్సోను పట్టుకున్నాడు. ఆ రెండు స్తంభాలు ఆలయాన్ని భరిస్తున్నవి. ఆ రెండు స్తంభాలను అతను కౌగిలించుకున్నాడు. ఒక స్తంభం అతని కుడిచేయి వైపున వున్నది. మరొకటి ఎడమ చేతివైపున వున్నది. 30 సమ్సోను ఇలా అన్నాడు; “ఈ ఫిలిష్తీయులతో పాటు నేను మరణిస్తాను” అని, తర్వాత తన శక్తికొద్దీ వాటిని తోశాడు. ఆలయంలోపల వున్న పరిపాలకులు మరియు మనుష్యుల మీద ఆలయం పడిపోయింది. ఈ విధంగా సమ్సోను ఇంకా మరికొందరు ఫిలిష్తీయులను చంపివేశాడు. అతను జీవించిన నాటికంటె మరణ సమయంలోనే, చాలా మందిని చంపి వేశాడు.

31 సమ్సోను యొక్క సోదరులు, అతని కుటుంబంలోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి వెళ్లారు. అతనిని తీసుకు వచ్చి, తండ్రి సమాధిలో పాతి పెట్టారు. ఆ సమాధి జోర్యా, ఏష్తాయోలు నగరాల మధ్య ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను ఇరవై సంవత్సరాలపాటు న్యాయాధిపతిగా వ్యవహరించాడు.

2 కొరింథీయులకు 13:1-11

చివరి హెచ్చరికలు

13 మూడవసారి మీ దగ్గరకు వస్తున్నాను. “ప్రతి విషయం యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలతో రుజువు పరచాలి.”(A) నేను రెండవ సారి వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని యిదివరకే హెచ్చరించాను. నేను యిప్పుడు మీ సమక్షంలో లేను కనుక మళ్ళీ చెపుతున్నాను. కనుక నేను ఈ సారి వచ్చినప్పుడు ఇదివరలో పాపంచేసినవాళ్ళను ఇప్పుడు పాపంచేసినవాళ్ళను శిక్షిస్తాను. క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడన్న దానికి మీరు రుజువు అడుగుతున్నారు. మీ పట్ల క్రీస్తు బలహీనంగా ఉండడు. ఆయన మీ మధ్య శక్తివంతంగా ఉన్నాడు. బలహీనతల్లో ఆయన సిలువ వేయబడ్డాడు. అయినా, దైవశక్తివల్ల జీవిస్తున్నాడు. అదే విధంగా మేము ఆయనలో బలహీనంగా ఉన్నా, దైవశక్తి వల్ల ఆయనతో సహా జీవించి మీ సేవ చేస్తున్నాము.

మీరు నిజమైన “విశ్వాసులా, కాదా” అని తెలుసుకోవాలనుకొంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము. మీరు బలంగా ఉంటే, మేము బలహీనంగా ఉండటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. 10 అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు.

11 తుదకు, సోదరులారా! పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చెయ్యండి. ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. ప్రేమను, శాంతినిచ్చే దేవుడు మీతో ఉంటాడు.

మార్కు 5:25-34

25 పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది.

27 ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది. 28 తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది. 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది. 30 వెంటనే, యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని ఎవరు తాకారు?” అని అన్నాడు.

31 ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని త్రోసుకొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు?” అని అన్నారు.

32 కాని యేసు, “ఎవరు తాకారు?” అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. 33 అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది. 34 ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International