Book of Common Prayer
సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.
66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.
5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
6 సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.
16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.
67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
దయచేసి మమ్ములను స్వీకరించుము.
2 దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
6 దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
7 దేవుడు మమ్మల్ని దీవించుగాక.
భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
11 యెఫ్తా గిలాదు వంశంవాడు. అతడు బలమైన సైనికుడు. అయితే యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. అతని తండ్రి పేరు గిలాదు. 2 గిలాదు భార్యకు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులు పెద్దవారైనప్పుడు, యెఫ్తా అంటే వారికి ఇష్టంలేకపోయింది. ఆ కుమారులు యెఫ్తాను అతని స్వగ్రామం నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. “మా తండ్రి ఆస్తిలో నీకు ఎలాంటి భాగం లేదు. నీవు మరో స్త్రీ కుమారుడివి” అని వారు అతనితో చెప్పారు. 3 కనుక యెఫ్తా తన సోదరుల మూలంగా వెళ్లిపోయాడు. అతడు టోబు దేశంలో నివసించాడు. టోబు దేశంలో కొందరు అల్లరి జనం యెఫ్తాను వెంబడించటం మొదలు పెట్టారు.
4 కొంతకాలం తర్వాత అమ్మోనీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. 5 అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేస్తున్నారు గనుక గిలాదులోని పెద్దలు (నాయకులు) యెఫ్తా దగ్గరకు వెళ్లారు. యెఫ్తా టోబు దేశం విడిచిపెట్టి, గిలాదుకు తిరిగి రావాలని వారు కోరారు.
6 ఆ పెద్దలు, “మనం అమ్మోనీయులతో యుద్ధం చేయగలిగేటట్టు, నీవు వచ్చి మాకు నాయకునిగా ఉండు” అని యెఫ్తాతో చెప్పారు.
7 కానీ యెఫ్తా, “మీరే నన్ను నా తండ్రి ఇంటి నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. నేనంటే మీకు అసహ్యం. కనుక మీకు కష్టం వచ్చిందని మీరు ఇప్పుడు నా దగ్గరకు రావటం ఎందుకు?” అని గిలాదు దేశపు పెద్దలను (నాయకులను) అడిగాడు.
8 “ఆ కారణం వల్లనే ఇప్పుడు మేము నీ దగ్గరకు వచ్చాము. దయచేసి మాతో వచ్చి అమ్మోనీయుల మీద యుద్ధం చేయి. గిలాదులో నివసిస్తున్న ప్రజలందరి మీద నీవు సైన్యాధికారిగా ఉంటావు” అని గిలాదు పెద్దలు యెఫ్తాతో చెప్పారు.
9 అప్పుడు యెఫ్తా, “నేను గిలాదుకు తిరిగి వచ్చి, అమ్మోనీయులతో యుద్ధం చేయాలని మీరు కోరితే, మంచిదే. కానీ గెలిచేందుకు యెహోవా నాకు సహాయం చేస్తే, అప్పుడు మీకు నేను కొత్త నాయకునిగా ఉంటాను” అని గిలాదు పెద్దలతో చెప్పాడు.
10 గిలాదు పెద్దలు (నాయకులు), “మనం చెప్పుకొంటున్నది అంతా యెహోవా వింటున్నాడు. మేము చేయాలని నీవు చెప్పేది అంతా మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాము” అని యెఫ్తాతో చెప్పారు.
11 కనుక గిలాదు పెద్దలతో యెఫ్తా వెళ్లాడు. ఆ ప్రజలు యెఫ్తాను తమ నాయకునిగా, సైన్యాధికారిగా చేసుకున్నారు. మిస్పా పట్టణంలో యెహోవా ఎదుట యెఫ్తా తన మాటలన్నింటినీ మళ్లీ చెప్పాడు.
యెఫ్తా వాగ్దానం
29 అప్పుడు యెహోవా అత్మ యెఫ్తా మీదికి వచ్చింది. గిలాదు, మనష్షే ప్రాంతాలలో యెఫ్తా సంచారం చేశాడు. అతడు గిలాదులోని మిస్పా పట్టణానికి వెళ్లాడు. గిలాదులోని మిస్పా పట్టణంనుండి యెఫ్తా అమ్మోనీయుల దేశంలోనికి వెళ్లాడు.
30 యెహోవాకు యెఫ్తా ఒక ప్రమాణం చేసాడు, “అమ్మోనీయులను నేను ఓడించేటట్టుగా నీవు చేస్తే, 31 ఆ విజయంతో నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలోనుండి మొట్టమొదట బయటకు వచ్చేదానిని నేను నీకు అర్పిస్తాను. దానిని నేను దహన బలిగా యెహోవాకు అర్పిస్తాను” అని అతడు చెప్పాడు.
32 అప్పుడు యెఫ్తా అమ్మోనీ ప్రజల దేశం వెళ్ళాడు. అమ్మోనీయులతో యెఫ్తా యుద్ధం చేశాడు. వారిని ఓడించటానికి యెహోవా అతనికి సహాయం చేశాడు. 33 అరోయేరు పట్టణంనుండి మిన్నీతు పట్టణం వరకు అతడు వారిని ఓడించాడు. యెఫ్తా ఇరవై పట్టణాలను పట్టుకొన్నాడు. ఆబేల్కెరామీము పట్టణంవరకు అమ్మోనీయులతో అతడు పోరాడాడు. ఇశ్రాయేలీయులు అమ్మోనీ ప్రజలను ఓడించారు. అది అమ్మోనీ ప్రజలకు ఒక గొప్ప పరాజయం.
34 యెఫ్తా తిరిగి మిస్పా వెళ్లాడు. యెఫ్తా తన ఇంటికి వెళ్లగా, అతని కుమార్తె అతన్ని ఎదుర్కొనేందుకు ఇంటిలో నుండి బయటకు వచ్చింది. ఆమె తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ వచ్చెను. ఆమె అతనికి ఒక్కతే కుమార్తె. యెఫ్తా ఆమెను ఎంతో ప్రేమించాడు. యెఫ్తాకు ఇంకా కుమారులు, కుమార్తెలు ఎవరూ లేరు. 35 యెఫ్తా ఇంటి నుండి మొట్టమొదట బయటకు వచ్చింది తన కుమార్తె అని అతడు చూడగానే, అతడు తన దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి తన బట్టలు చింపివేసికున్నాడు. అప్పుడు అతడు, “అయ్యో, నా కుమారీ, నీవు నన్ను దుఃఖంతో నింపివేశావు. నీవు నన్ను ఎంతో ఎంతో భాధపెట్టేశావు. యెహోవాకు నేను వాగ్దానం చేశాను, దానిని నేను మార్చలేను” అని చెప్పాడు.
36 అప్పుడు అతని కుమార్తె, “నా తండ్రీ, నీవు యెహోవాకు ఒక వాగ్దానం చేశావు. కనుక నీ వాగ్దానం నిలబెట్టుకో. నీవు చెప్పినట్టే చేయి. నీ శత్రువులైన అమ్మోనీయులను ఓడించటానికి యెహోవాయేగదా నీకు సహాయం చేసాడు” అని యెఫ్తాతో చెప్పింది.
37 అప్పుడు యెఫ్తా కుమార్తె, “అయితే నా కోసం ముందుగా ఈ ఒక్కటి చేయి. రెండు నెలలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వు. నన్ను కొండలకు వెళ్లనివ్వు. నేను పెళ్లి చేసుకోను, పిల్లలు ఉండరు, కనుక నన్ను నా స్నేహితురాండ్రను కలిసి ఏడ్వనివ్వు” అని తన తండ్రితో చెప్పింది.
38 “వెళ్లి అలాగే చేయి” అని చెప్పాడు యెఫ్తా. రెండు నెలల కోసం యెఫ్తా ఆమెను పంపించివేశాడు. యెఫ్తా కుమార్తె, ఆమె స్నేహితురాండ్రు కొండలలో నివసించారు. ఆమెకు పెళ్లి, పిల్లలు ఉండరు కనుక వారు ఆమె కోసం ఏడ్చారు.
39 రెండు నెలల అనంతరం, యెఫ్తా కుమార్తె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది. యెఫ్తా యెహోవాకు వాగ్దానం చేసిన ప్రకారమే జరిగించాడు. యెఫ్తా కుమార్తెకు ఎవరితోనూ ఎన్నడూ లైంగిక సంబంధాలు లేవు. కనుక ఇశ్రాయేలులో ఇది ఒక ఆచారం అయ్యింది. 40 గిలాదు వాడైన యెఫ్తా కుమార్తెను ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారు. యెఫ్తా కుమార్తె కోసం ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు ఏడుస్తారు.
21 వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది.
ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది. 22 వాళ్ళు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుణ్ణి, వాళ్ళు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడను. వాళ్ళు అబ్రాహాము వంశీయులా? నేను కూడా అబ్రాహాము వంశీయుణ్ణి. 23 వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను.
24 యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు. 25 మూడు సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు సార్లు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం మీద గడిపాను. 26 విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకానివాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరులవల్ల ప్రమాదం కలిగింది.
27 నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను. 28 ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను. 29 మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా?
30 నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను. 31 యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని తెలుసు.
యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం
(మత్తయి 8:23-27; లూకా 8:22-25)
35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు. 36 శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. 37 ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. 38 పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు.
39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది.
40 ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు.
41 వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.
© 1997 Bible League International