Book of Common Prayer
కోరహు కుమారుల స్తుతి కీర్తన.
87 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
2 ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
3 దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతారు.
4 దేవుడు తన ప్రజలందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబులోనులోను జీవిస్తున్నారు.
ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది.
5 సీయోనుగడ్డ మీద జన్మించిన
ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును.
సర్వోన్నతుడైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.
6 దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు.
ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.
7 దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు.
దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు.
“మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.
నాలుగవ భాగం
(కీర్తనలు 90–106)
దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.
90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
2 పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
3 మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
తిరిగి రండని నీవు చెప్పుతావు.
4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
గత రాత్రిలా అవి ఉన్నాయి.
5 నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
6 ఉదయం గడ్డి పెరుగుతుంది.
సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
7 దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము.
నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది!
8 మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు.
దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు.
9 నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు.
మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి.
10 మేము 70 సంవత్సరాలు జీవిస్తాము.
బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము.
మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి.
అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము.
11 దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు.
కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి.
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
136 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి!
ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది.
3 యెహోవా దేవున్ని స్తుతించండి.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
4 ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి.
ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది.
5 జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి.
ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది.
6 దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
7 దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
8 దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
9 దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రున్న్, నక్షత్రాలను చేసాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
10 దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
11 దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
13 దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
14 దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నడిపించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
15 దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచివేశాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
16 దేవుడు తన ప్రజలను ఎడారిలో నడిపించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
19 దేవుడు అమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
20 దేవుడు బాషాను రాజైన ఓగును ఓడించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
25 దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు.
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
26 పరలోకపు దేవుణ్ణి స్తుతించండి!
ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
షెకెముతో అబీమెలెకు యుద్ధం
22 అబీమెలెకు ఇశ్రాయేలు ప్రజలను మూడు సంవత్సరాలు పాలించాడు. 23-24 అబీమెలెకు చంపిన డెభ్భై మంది యెరుబ్బయలు కుమారులు అబీమెలెకునకు స్వంత సోదరులే. ఈ చెడు కార్యాలు చేయటంలో షెకెము నాయకులు అతనిని బలపర్చారు. కనుక అబీమెలెకునకు షెకెము నాయకులకు మధ్య దేవుడు చిక్కు కలిగించాడు. మరియు అబీమెలెకును బాధించుటకు షెకెము నాయకులు అన్వేషించుట మొదలుపెట్టారు. 25 షెకెము పట్టణ నాయకులకు అబీమెలెకు అంటే ఇంకెంత మాత్రం ఇష్టం లేదు. మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరినీ దాడి చేసి దోచుకొనేందుకు వారు కొండల శిఖరాలన్నిటి మీద మనుష్యులను ఉంచారు. ఆ దాడుల విషయం అబీమెలెకునకు తెలిసిపోయింది.
అబీమెలెకు మరణం
50 అప్పుడు అబీమెలెకు, అతని మనుష్యులు తేబేసు పట్టణం వెళ్లారు. అబీమెలెకు, అతని మనుష్యులు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. 51 కాని ఆ పట్టణం లోపల ఒక బలమైన గోపురం ఉంది. నాయకులు ఇతర స్త్రీ పురుషులు ఆ గోపురమునకు పారిపోయారు. ప్రజలు ఆ గోపురం లోపల ఉండగా వారు లోపల నుండి తాళం వేసారు. తరువాత వారు ఆ గోపురపు కప్పు మీదికి ఎక్కారు. 52 ఆ గోపురం మీద దాడి చేయుటకు అబీమెలెకు, అతని మనుష్యులు దాని దగ్గరకు వచ్చారు. అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ గోపురాన్ని తగులబెట్టాలి అనుకున్నాడు. 53 కాని అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గర నిలబడి ఉండగా పై కప్పు మీద ఉన్న ఒక స్త్రీ తిరుగటి రాయి ఒకటి అతని తలమీద వేసింది. ఆ తిరుగటి రాయి అబీమెలెకు తలను చితకగొట్టింది. 54 వెంటనే అబీమెలెకు తన ఆయుధాలు మోసే సేవకునితో, “నీ ఖడ్గం తీసుకుని నన్ను చంపివేయి. ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపేసింది’ అని ప్రజలు చెప్పకుండా ఉండేందుకు నీవే నన్ను చంపివేయాలి” అని చెప్పాడు. కనుక ఆ సేవకుడు తన కత్తితో అబీమెలెకును పొడిచివేయగా అబీమెలెకు చనిపోయాడు. 55 అబీమెలెకు చనిపోయినట్టు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. కనుక వారంతా తిరిగి ఇంటికి వెళ్లారు.
56 ఆ విధంగా అబీమెలెకు చేసిన చెడు విషయాలు అన్నింటికోసం దేవుడు అతణ్ణి శిక్షించాడు. అబీమెలెకు తన డెభ్భై మంది సోదరులను చంపి తన స్వంత తండ్రికి విరోధంగా పాపం చేసాడు. 57 షెకెము పట్టణ ప్రజలు చేసిన చెడుపనుల కోసం దేవుడు వారిని కూడా శిక్షించాడు. కనుక యోతాము చెప్పిన విషయాలు నిజం అయ్యాయి. (యెరుబ్బయలు చిన్న కుమారుడు యోతాము. యెరుబ్బయలు అనగా గిద్యోను).
విశ్వాసుల ఐకమత్యం
32 విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ “ఇది నాది” అని అనకుండా తమకున్న వాటిని ఇతర్లతో పంచుకొనేవాళ్ళు. 33 దైవికమైన శక్తితో అపొస్తలులు ప్రభువు బ్రతికి వచ్చాడని రుజువు చేసారు. దేవుని అనుగ్రహం వాళ్ళందరిపై సంపూర్ణంగా ఉంది. 34 వాళ్ళలో ఎవ్వరికీ ఏ కొరతలు ఉండేవి కావు. ఇండ్లు, పొలాలు ఉన్నవాళ్ళు వాటిని అమ్మి, 35 ఆ డబ్బును అపొస్తలుల పాదాల ముందుంచేవాళ్ళు. ఆ అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు.
36 యోసేపు అనే అతడు లేవి వంశీయుడు. ఇతడు సైప్రసు (కుప్ర) ద్వీపానికి చెందినవాడు. ఇతణ్ణి అపొస్తలులు బర్నబా (ప్రోత్సాహపు కుమారుడని ఈ పదానికి అర్థం) అని పిలిచేవాళ్ళు. 37 ఇతడు తన పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల ముందుంచాడు.
అననీయ మరియు సప్పీరా
5 “అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. 2 “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.
3 అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? 4 అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”
5 ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. 6 కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.
7 మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. 8 పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు.
“ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.
9 పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. 10 తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. 11 సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.
యెసు మందిరాన్ని పరిశుభ్రం చేయటం
(మత్తయి 21:12-13; మార్కు 11:15-17; లూకా 19:45-46)
13 యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. 14 ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు. 15 త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు. 16 పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు.
17 ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు:
“నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.”(A)
18 యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు.
19 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.”
20 యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు.
21 కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. 22 ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.
23 పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాల్ని ప్రజలు చూసారు. వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది. 24 కాని ఆయనకు మానవ స్వభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు. 25 మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి ఆయనకు ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు.
© 1997 Bible League International