Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 88

కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.

88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
    రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
    కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
    మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
    ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
    నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
    మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
    నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
నీవు నా మీద కోపగించావు.
    నీవు నన్ను శిక్షించావు.

నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
    అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
    నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
    దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!

11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
    చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
    మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
    ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
    నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
    నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
    శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
    నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
    చీకటి మాత్రమే నాకు మిగిలింది.

కీర్తనలు. 91-92

91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
    సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
“నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
    అని నేను యెహోవాకు చెబుతాను.
దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
    ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
    పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
    దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
    పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
చీకటిలో దాపురించే రోగాలకు గాని
    మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
నీ ప్రక్కన వేయిమంది,
    నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు.
    నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా
    నీకు కనబడుతుంది.
ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
    సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
    నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
    దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
    నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
    నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
    నేను వారికి జవాబు ఇస్తాను.
    వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
    నేను వాళ్లను రక్షిస్తాను.”

సబ్బాతుకోసం స్తుతి కీర్తన.

92 యెహోవాను స్తుతించుట మంచిది.
    సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
    రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
    సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
    నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
    నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
    మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
    చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.
యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
    చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
    సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
    నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.

12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
    వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
    వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
    వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
    ఆయనలో అవినీతి లేదు.

న్యాయాధిపతులు 9:1-16

అబీమెలెకు రాజు అవటం

అబీమెలెకు యెరుబ్బయలు (గిద్యోను) కుమారుడు. అబీమెలెకు షెకెము పట్టణంలో నివసిస్తున్న తన మామల దగ్గరకు వెళ్లాడు. అతడు తన మామలతోను, తన తల్లి వంశస్థులందరితోను ఇలా చెప్పాడు: “షెకెము పట్టణపు నాయకులను ఈ ప్రశ్న అడగండి: ‘యెరుబ్బయలు యొక్క డెబ్బై మంది కుమారులచేత పాలించబడటం మీకు మంచిదా లేక ఒకే మనిషిచేత పాలింపబడుట మంచిదా? నేను మీ బంధువునని జ్ఞాపకం ఉంచుకోండి.’”

అబీమెలెకు మామలు షెకెము నాయకులతో మాట్లాడి, వారిని ఆ ప్రశ్న అడిగారు. షెకెము నాయకులు అబీమెలెకు అనుచరులుగా ఉండాలని నిర్ణయం చేసారు. “అతడు మా సోదరుడు గదా” అని ఆ నాయకులు చెప్పారు. కనుక షెకెము నాయకులు డెభ్భై వెండి నాణెములు అబీమెలెకుకు ఇచ్చారు. ఆ వెండి బయలు బెరీతు[a] దేవతా మందిరానికి చెందినది. అబీమెలెకు కొంతమంది కిరాయి మనుష్యులను తెచ్చేందుకు ఆ వెండిని ఉపయోగించాడు. ఈ మనుష్యులు పనికిమాలిన వాళ్లు, నిర్లక్ష్యపు మనుష్యులు. అబీమెలెకు ఎక్కడికి వెళ్లినా వారు అతనిని వెంబడించారు.

అబీమెలెకు ఒఫ్రాలోని తన తండ్రి ఇంటికి వెళ్లాడు. అబీమెలెకు తన సోదరులను చంపివేసాడు. అబీమెలెకు తన తండ్రియైన యెరుబ్బయలు (గిద్యోను) కుమారులు డెభ్భై మందిని చంపివేశాడు. అతడు వారందరినీ ఒకే సమయంలో[b] చంపివేశాడు. అయితే యెరుబ్బయలు చిన్న కుమారుడు అబీమెలెకునకు కనబడకుండా దాగుకొని తప్పించుకొన్నాడు. ఆ చిన్న కుమారుని పేరు యోతాము.

అప్పుడు షెకెము నాయకులందరూ, మిల్లో ఇంటి వారూ సమావేశం అయ్యారు. షెకెములో స్తంభపు మహావృక్షము (మస్తకి) పక్క ఆ ప్రజలంతా సమావేశమై అబీమెలెకును వారి రాజుగా చేసుకున్నారు.

యోతాము కథ

షెకెము పట్టణ నాయకులు అబీమెలెకును రాజుగా చేసారని యోతాము విన్నాడు. అతడు ఇది విన్నప్పుడు వెళ్లి గెరిజీము కొండ శిఖరం మీద నిలబడ్డాడు. యోతాము ఈ కథను గట్టిగా అరచి, ప్రజలకు ఇలా చెప్పాడు:

“షెకెము పట్టణ నాయకులారా, నా మాట వినండి. తర్వాత దేవుడు మీ మాట వినును.

“ఒకనాడు వృక్షాలన్నీ వాటిని ఏలేందుకు ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలని అనుకొన్నాయి. ఆ చెట్లు, ‘నీవే మా రాజుగా ఉండు’ అని ఒలీవ చెట్టుతో అన్నాయి.

“కాని ఒలీవ చెట్టు అంది: ‘నా తైలం కోసం మనుష్యులు, దేవుళ్లు నన్ను పొగడుతారు. కేవలం నేను వెళ్లి ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగేందుకోసం నా తైలాన్ని తయారు చేయడం నేను మానివేయాలా?’

10 “అప్పుడు ఆ చెట్లు అంజూరపు చెట్టుతో, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని అడిగాయి.

11 “కాని, ‘కేవలం ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం మధురమైన నా మంచి ఫలం ఫలించటం మానివేయాలా?’ అన్నది ఆ అంజూరపు చెట్టు.

12 “అప్పుడు ఆ చెట్లు, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ద్రాక్షావల్లితో, అన్నాయి.

13 “కాని ద్రాక్షావల్లి, ‘నా ద్రాక్షారసం మనుష్యులను, రాజులను సంతోష పెడుతుంది. కేవలం నేను వెళ్లి ఆ చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం నా ద్రాక్షరసం తయారు చేయటం నేను మానివేయాలా?’ అన్నది.

14 “చివరికి చెట్లన్నీ కలసి, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ముళ్లకంపతో అన్నాయి.

15 “కాని ఆ ముళ్లకంప, ‘మీరు నన్ను నిజంగా మీ మీద రాజుగా చేయాలని కోరితే మీరు వచ్చి నా నీడలో ఆశ్రయం తీసుకోండి. కాని అలా చేయటం ఇష్టం లేకపోతే అప్పుడు ముళ్ల కంపలో నుండి అగ్ని వచ్చునుగాక. ఆ అగ్ని లెబానోను దేవదారు వృక్షాలను కూడా కాల్చి వేయును గాక’ అని ఆ చెట్లతో చెప్పినది.

16 “అబీమెలెకును మీరు రాజుగా చేసినప్పుడు మీరు పూర్తి నిజాయితీగా ఉన్నట్లయితే, మీరు అతనితో సంతోషించి ఉండేవారు. మరియు మీరు గనుక యెరుబ్బయలు, అతని కుటుంబముతో న్యాయంగా ఉండి ఉంటే మంచిదే. మరియు యెరుబ్బయలును పరామర్శించాల్సినట్టు, పరామర్శించియుంటే మంచిదే.

న్యాయాధిపతులు 9:19-21

19 కనుక ఈనాడు యెరుబ్బయలుకు, అతని కుటుంబానికి మీరు సంపూర్ణంగా న్యాయంగా ఉంటే, అబీమెలెకు మీకు రాజుగా ఉన్నందుకు మీరు సంతోషంగా ఉండవచ్చు. మరియు అతడు మీతో సంతోషంగా ఉండవచ్చు. 20 కాని మీరు సరిగ్గా ప్రవర్తించి ఉండకపోతే, షెకెము నాయకులైన మిమ్మల్ని మిల్లో ఇంటివారిని అబీమెలెకు నాశనం చేయును గాక. మరియు అబీమెలెకు కూడా నాశనం చేయబడును గాక.”

21 యోతాము ఇదంతా చెప్పగానే అతడు పారిపోయాడు. అతడు బెయేరు అనే పట్టణానికి తప్పించుకొని పోయాడు. యోతాము అతని సోదరుడైన అబీమెలెకు విషయంలో భయపడినందున ఆ పట్టణంలోనే ఉండిపోయాడు.

అపొస్తలుల కార్యములు 4:13-31

13 పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు. 14 కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు.

15 వాళ్ళను మహాసభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు: 16 “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం. 17 కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.”

18 వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. 19 కాని పేతురు, యోహాను వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, లేక దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి. 20 ఎందుకంటే మేము చూసినదాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు.

21 వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు. 22 దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.

విశ్వాసుల ప్రార్థన

23 విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. 24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. 25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు:

‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి?
ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు?

26 ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును,
    ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’(A)

27 హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. 28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. 29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! 30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”

31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.

యోహాను 2:1-12

కానా పట్టణంలో వివాహం

మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.

యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.

ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.

ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.

యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.

ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు.

వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, 10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.

11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.

12 ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International