Book of Common Prayer
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
నూన్
105 యెహోవా, నీ వాక్యాలు
నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
సామెహ్
113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.
81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
2 సంగీతం ప్రారంభించండి.
గిలక తప్పెట వాయించండి.
స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
3 నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
5 ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
6 దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
నేను దానిని నింపుతాను.
11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”
ఆసాపు స్తుతి కీర్తన.
82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
2 ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.
3 “అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
6 నేను (దేవుడు) మీతో చెప్పాను,
“మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”
8 దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
19 కనుక గిద్యోను, అతనితో ఉన్న వంద మంది మనుష్యులు వారి శత్రువుల విడిది చివరి భాగానికి వెళ్లారు. కావలి వారు మారిన వెంటనే వారు అక్కడికి వచ్చారు. అది నడిజాము వేళ. గిద్యోను, అతనితో ఉన్న మనుష్యులు వారి బూరలు ఊది, వారి కుండలు పగులగొట్టారు. 20 అప్పుడు గిద్యోను మనుష్యులు మొత్తం మూడు గుంపులవారు వారి బూరలు ఊది వారి కుండలు పగులగొట్టారు. ఆ మనుష్యులు దివిటీలను వారి ఎడమ చేతులలోను, బూరలు వారి కుడిచేతులలోను పట్టుకొన్నారు. ఆ మనుష్యులు వారి బూరలు ఊదుతూ, “యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం” అని కేకలు వేసారు.
21 గిద్యోను మనుష్యులు వారు ఉన్న చోటనే నిలబడ్డారు. కాని ఆ విడిదిలో మిద్యాను వారు కేకలు వేస్తూ పారిపోవటం మొదలుపెట్టారు. 22 గిద్యోను మూడు వందల మంది మనుష్యులు వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు చంపుకొనేట్టు యెహోవా చేశాడు. సెరేరాతు పట్టణం వైపు ఉన్న బేత్‌షిత్తా పట్టణానికి శత్రుసైన్యం వాళ్లు పారిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న ఆబేల్మెహోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు పారిపోయారు.
23 అప్పుడు నఫ్తాలి, ఆషేరు, మొత్తం మనష్షే వంశాల నుండి వచ్చిన సైనికులు మిద్యాను ప్రజలను తరమవలసిందిగా ఆజ్ఞాపించబడ్డారు. 24 ఎఫ్రాయిము కొండ దేశమంతటికీ గిద్యోను వార్తాహరులను పంపించాడు. “దిగి వచ్చి మిద్యాను ప్రజలను ఎదుర్కొనండి. వీరిని బేత్బారా వరకూ తరిమి, నదిని అదుపు చేసి, యోర్దాను నదిని స్వాధీనం చేసుకోండి. మిద్యాను ప్రజలు అక్కడికి చేరక ముందే ఈ పని చేయండి” అని వార్తాహరులు చెప్పారు.
కనుక ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులందరినీ వారు పిలిచారు. బేత్బారా వరకు వారు నదిని స్వాధీనం చేసుకున్నారు. 25 మిద్యాను నాయకులు ఇద్దరిని ఎఫ్రాయిము మనుష్యులు పట్టుకున్నారు. ఈ ఇద్దరు నాయకుల పేర్లు ఓరేబు, జెయేబు, ఓరేబు బండ అనుచోట ఎఫ్రాయిము మనుష్యులు ఓరేబును చంపివేసారు. జెయేబు ద్రాక్షగానుగ అనుచోట వారు జెయేబును చంపివేసారు. ఎఫ్రాయిము మనుష్యులు మిద్యాను వారిని ఇంకా తరుముతూనే ఉన్నారు. కానీ మొదట ఓరేబు, జెయేబు తలలను వారు నరికివేసి ఆ తలలను గిద్యోను వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రజలు యోర్దాను నదిని దాటేచోట గిద్యోను ఉన్నాడు.
8 ఎఫ్రాయిము వారికి గిద్యోను మీద కోపం వచ్చింది. ఎఫ్రాయిము వారికి గిద్యోను కనబడినప్పుడు, “ఎందుకు నీవు మాపట్ల ఇలా వ్యవహరించావు. నీవు మిద్యాను ప్రజలమీద యుద్ధానికి వెళ్లినప్పుడు నీవు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని వారు గిద్యోనును అడిగారు.
2 ఎఫ్రాయిము మనుష్యులకు గిద్యోను ఇలా జవాబు ఇచ్చాడు: “మీరు చేసినట్టు నేనేమీ చేయలేదు. మా అబీయెజెరు వంశస్థులకంటె, మీ ఎఫ్రాయిము వారికి ఎక్కువ పంట వచ్చింది. కోతకాలంలో మా వారు కూర్చే ద్రాక్షపళ్లకంటె, మీరు పొలంలో పరిగె విడిచిపెట్టే ద్రాక్షపళ్లు ఎక్కువ ఉంటాయి. అది నిజం కాదా? 3 (అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట వచ్చింది) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబలను పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా పోల్చుకోగలను?” గిద్యోను మాటలు ఎఫ్రాయిము వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత కోపపడలేదు.
మిద్యాను రాజులు ఇద్దరిని గిద్యోను పట్టుకున్నాడు
4 అప్పుడు గిద్యోను, అతని మూడు వందల మంది మనుష్యులు యోర్దాను నది దగ్గరకు వచ్చి దానిని దాటి అవతలికి వెళ్లారు. కానీ వారు అలసిపోయి ఆకలితో[a] ఉన్నారు, 5 “నా సైనుకులు భోజనం చేసేందుకు ఏమైనా పెట్టండి. నా సైనికులు చాలా అలసిపోయారు. మిద్యాను రాజులు జెబహు, సల్మున్నాలను మేము ఇంకా తరుముతున్నాము” అని గిద్యోను సుక్కోతు పట్టణం వారితో చెప్పాడు.
6 కానీ సుక్కోతు పట్టణ నాయకులు, “నీ సైనికులు భోజనం చేసేందుకు ఏదైనా మేము ఎందుకు పెట్టాలి? జెబహు, సల్మున్నాలను మీరు ఇంకా పట్టుకోలేదు గదా?” అని గిద్యోనుతో చెప్పారు.
7 అప్పుడు గిద్యోను, “మీరు మాకు భోజనం పెట్టరు. జెబహు, సల్మున్నాలను పట్టుకొనేందుకు యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నేను తిరిగి ఇక్కడికి వస్తాను. అడవి ముళ్లకంపతోను, నూర్చుకొయ్యతోను మిమ్మల్ని కొడతాను” అని చెప్పాడు.
8 గిద్యోను సుక్కోతు పట్టణం విడిచి, పెనూయేలు పట్టణం వెళ్లాడు. సుక్కోతు వారిని అడిగినట్టే, గిద్యోను భోజనం కోసం పెనూయేలు వారిని అడిగాడు. కాని సుక్కోతు వారు ఇచ్చిన జవాబే పెనూయేలు వారు గిద్యోనుకు ఇచ్చారు. 9 కనుక గిద్యోను, “నేను విజయం సాధించిన తర్వాత, నేను ఇక్కడకు తిరిగి వచ్చి ఈ గోపురాన్ని కూలగొట్టేస్తాను” అని పెనూయేలు వారితో చెప్పాడు.
10 జెబహు, సల్మున్నా, వారి సైన్యం కర్కోరు పట్టణంలో ఉన్నారు. వారి సైన్యంలో పదిహేను వేలమంది సైనికులు ఉన్నారు. తూర్పు ప్రాంతపు ప్రజలందరి సైన్యంలో మిగిలిన సైనికులు వీరు. ఆ సైన్యంలో లక్షా ఇరవై వేల మంది బలమైన సైనికులు అప్పటికే చంపివేయబడ్డారు. 11 గిద్యోను, అతని మనుష్యులు గుడారవాసుల మార్గం ఉపయోగించారు. ఆ మార్గం నోబహు, యొగ్భెహ పట్టణాలకు తూర్పున ఉంది. గిద్యోను కర్కోరు పట్టణం వచ్చి శత్రువుమీద దాడి చేశాడు. ఈ దాడిని శత్రుసైన్యం ఊహించలేదు. 12 మిద్యాను ప్రజల రాజులు జెబహు, సల్మున్నాలు పారిపోయారు. కానీ గిద్యోను ఆ రాజులను తరిమి పట్టుకొన్నాడు. గిద్యోను, అతని మనుష్యులు శత్రు సైన్యాన్ని ఓడించారు.
12 పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు? 13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. 14 పవిత్రుడు, నీతిమంతుడు అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు. 15 మీరు మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.
16 “మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.
17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. 18 కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు. 19 మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి. 20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు.
21 “చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయమిచ్చాడు. సర్వం పునఃస్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు పరలోకంలోనే ఉండాలి. 22 మోషే ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి. 23 దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళనుండి దూరం చేసి నాశనం చేస్తాడు.’(A)
24 “సమూయేలు కాలంనుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానున్నాయని చెప్పారు. 25 మీ పూర్వికులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’(B) అని అన్నాడు. 26 దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.”
దేవుని గొఱ్ఱె పిల్ల
29 మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. 30 నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే! 31 అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు.
32 ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను. 33 బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు. 34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”
యేసు మొదటి శిష్యులు
35 మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు. 36 అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు.
37 ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు. 38 యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు.
వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.)
39 యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది.
40 యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో 41 అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు.
42 తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా[a] అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం.
© 1997 Bible League International