Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 80

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
    మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
    మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
    నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
    మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
    నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

కీర్తనలు. 77

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.

77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
    దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
    రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
    నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
    నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
నీవు నన్ను నిద్రపోనియ్యవు.
    నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
    చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
    నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
“మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
    ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
    ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
    ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.

10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
    అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.

11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
    ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
    దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
    నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
    యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.

16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
    లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
    ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
    అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
    మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
    భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
    కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
    మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.

కీర్తనలు. 79

ఆసాపు స్తుతి కీర్తన.

79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
    ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
    యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
    అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
    మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
    మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
    బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
    నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
    వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
    త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
    నీవు మాకు ఎంతో అవసరం.
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
    నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
    నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
    అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
    నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
    దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
    ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
    మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
    దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.

న్యాయాధిపతులు 6:25-40

గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టటం

25 అదే రాత్రి గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీ తండ్రికి చెందిన బాగా ఎదిగిన ఎద్దును, అనగా ఏడు సంవత్సరాల ఎద్దును తీసుకో. నీ తండ్రికి బూటకపు బయలు దేవతా బలిపీఠము ఒకటి ఉంది. ఆ బలిపీఠము ప్రక్కగా ఒక కొయ్యస్తంభం ఉంది. బూటకపు దేవత అషేరా ఘనత కోసం ఆ స్తంభం చేయబడింది. బయలు బలిపీఠాన్ని పడదోసేందుకు, అషేరా స్తంభాన్ని విరగగొట్టేందుకు ఆ ఎద్దును ఉపయోగించు. 26 అప్పుడు నీ యెహోవా దేవునికి సరయిన బలిపీఠం నిర్మించు. ఎత్తైన ఈ స్థలంలో బలిపీఠాన్ని నిర్మించు. అప్పుడు బాగా ఎదిగిన ఆ ఎద్దును ఈ బలిపీఠం మీద చంపి దహించు. నీ అర్పణను దహించేందుకు అషేరా స్తంభపు కట్టెను ఉపయోగించు.”

27 కనుక గిద్యోను తన సేవకులు పది మందిని తీసుకొని యెహోవా చేయమని చెప్పినట్టు చేశాడు. కాని తన కుటుంబము వారు, పట్టణము వారు తాను చేస్తున్న దానిని చూస్తారేమోనని గిద్యోను భయపడ్డాడు. తాను ఏమి చేయాలని తనతో యెహోవా చెప్పాడో దానినే గిద్యోను చేశాడు. కానీ అతడు ఆ పనిని పగలు కాక రాత్రివేళ చేశాడు.

28 మరునాడు ఉదయాన్నే ఆ పట్టణ ప్రజలు మేల్కొన్నారు. బయలు బలిపీఠం పాడుచేయబడి ఉండటం వారు చూశారు. అషేరా స్తంభం నరకబడి ఉండటం కూడా వారు చూశారు. అషేరా స్తంభం బయలు బలిపీఠానికి పక్కగా వుంది. గిద్యోను కట్టిన బలిపీఠాన్ని కూడా ఆ మనుష్యులు చూశారు. ఆ బలిపీఠం మీద అర్పించబడిన ఎద్దును వారు చూశారు.

29 ఆ పట్టణస్తులు ఒకర్నొకరు చూసి, “మన బలిపీఠాన్ని ఎవరు పడగొట్టారు? మన అషేర స్తంభాన్ని ఎవరు నరికి వేసారు?” అని చెప్పుకొన్నారు. వారు ఎన్నో ప్రశ్నలు వేసుకొని, ఆ పనులు చేసినదెవరో తెలిసికొనేందుకు ప్రయత్నించారు.

“యోవాషు కుమారుడైన గిద్యోను ఈ పని చేసాడు” అని వారితో ఎవరో చెప్పారు.

30 కనుక ఆ పట్టణస్తులు యోవాషు దగ్గరకు వచ్చారు, “నీవు నీ కుమారుని బయటకు తీసుకురా! అతడు బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు. ఆ బలిపీఠం పక్కనే ఉన్న అషేరా స్తంభాన్ని అతడు నరికి వేసాడు. కనుక నీ కుమారుడు చావాల్సిందే” అని వారు యోవాషుతో చెప్పారు.

31 అప్పుడు యోవాషు తన చుట్టూరా ఉన్న జనంతో మాట్లాడాడు: “మీరు బయలు పక్షాన ఉంటారా? మీరు బయలును కాపాడుతారా? ఎవడైనా బయలు పక్షం వహిస్తే ఉదయానికల్లా వాడు చంపబడునుగాక. ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, వాని బలిపీఠాన్ని ఎవరైనా పడగొట్టుతున్నప్పుడు తనను తానే కాపాడుకోవాలి” అని యోవాషు చెప్పాడు. 32 “ఒకవేళ బయలు బలిపీఠాన్ని గిద్యోను పడగొట్టియుంటే అతనితోనే బయలును వాదించమనండి.” అని యోవాషు చెప్పాడు. కనుక ఆ రోజున యోవాషు గిద్యోనుకు యెరుబ్బయెలు[a] అని ఒక కొత్త పేరు పెట్టాడు.

గిద్యోను మిద్యాను ప్రజలను ఓడించటం

33 మిద్యాను, అమాలేకు తూర్పు ప్రాంతపు ఇతర ప్రజలు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసేందుకు సమావేశమయ్యారు. ఆ ప్రజలు యోర్దాను నది దాటి వెళ్లి యెజ్రెయేలు లోయలో నివాసం చేశారు. 34 యెహోవా ఆత్మ గిద్యోను మీదికి వచ్చి అతనికి గొప్ప శక్తిని ఇచ్చింది. అబీయెజెరు కుటుంబం తనను వెంబడించేందుకు గిద్యోను ఒక బూర ఊదాడు. 35 మనష్షే వంశం మనుష్యులందరి దగ్గరకు గిద్యోను వార్తాహరులను పంపించాడు. ఆయుధాలు తీసుకుని యుద్ధానికి సిద్ధం కావాలని ఆ వార్తాహరులు మనష్షే మనుష్యులతో చెప్పారు. ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వంశాలకు కూడా గిద్యోను వార్తాహరులను పంపించాడు. వార్తాహరులు అదే సందేశం తీసుకుని వెళ్లారు. కనుక ఆ వంశాల వారు కూడా గిద్యోనును, అతని మనుష్యులను కలుసుకొనటానికి వెళ్లారు.

36 అప్పుడు గిద్యోను దేవునితో చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు నీవు నాకు సహాయం చేస్తానని చెప్పావు. నాకు ఋజువు చూపు! 37 నేను కళ్ళెంలో గొర్రెచర్మం ఉంచుతాను. చుట్టూరా ఉన్న నేల అంతా పొడిగా ఉండి, ఆ చర్మం మీద మాత్రమే మంచుపడివుంటే, అప్పుడు నీవు చెప్పినట్టే ఇశ్రాయేలును రక్షించేందుకు నీవు నన్ను వాడుకొంటావని నేను తెలుసుకొంటాను.”

38 సరిగ్గా అలాగే జరిగింది. మరునాడు ఉదయాన్నే గిద్యోను లేచి ఆ గొర్రెచర్మాన్ని పిండాడు. ఆ గొర్రె చర్మం నుండి ఒక పాత్ర నిండుగా అతడు నీళ్లు పిండాడు.

39 అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోపగించకు. మరొక్క విషయం నిన్ను అడుగనియ్యి. గొర్రెచర్మంతో నిన్ను మరొక్కసారి పరీక్షించనియ్యి. ఈసారి దాని చుట్టూరా ఉన్న నేల మంచుతో తడిసి గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉండనియ్యి” అని చెప్పాడు.

40 ఆ రాత్రి దేవుడు సరిగ్గా అలాగే చేసాడు. గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉంది, కానీ దాని చుట్టూరా నేల మంచుతో తడిసి ఉంది.

అపొస్తలుల కార్యములు 2:37-47

37 ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.

38 పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. 39 దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”

40 వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.” 41 అతని సందేశాన్ని అంగీకరించినవాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.

విశ్వాసుల సహవాసం

42 వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై, ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు. 43 దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. 44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు. 45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు. 46 ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించేవాళ్ళు, 47 దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించినవాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.

యోహాను 1:1-18

వాక్యము మానవాతారం ఎత్తటం

సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు. ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు. ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు. ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను. వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.

దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ వుండెను.

10 ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు. 11 ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు. 12 అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. 13 కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.

14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. 15 యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”

16 ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. 17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు. 18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International