Book of Common Prayer
సంగీత నాయకునికి: దావీదు కీర్తన
41 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు.
కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
2 ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు.
ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి.
దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు.
3 ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు
యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు.
4 నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము.
నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
5 నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు.
“వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
6 కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు.
కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు.
ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమే వస్తారు,
మరియు వారు వెళ్లి, వారి గాలి కబుర్లు ప్రచారం చేస్తారు.
7 నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబుతారు.
వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
8 “ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు.
ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
9 నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు.
నేను అతన్ని నమ్మాను. కాని ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు.
10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము.
అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను.
11 యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల
అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి.
నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.
13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు.
ఆమేన్! ఆమేన్!
సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.
52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.
4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
5 అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.
6 మంచి వాళ్లు ఇది చూచి,
దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”
8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవ ధ్యానం.
44 దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము.
మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు.
చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు.
2 దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు.
మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు.
ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు.
వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు.
3 ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసికోలేదు.
వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు.
నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది.
దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే!
4 నా దేవా, నీవు నా రాజువు.
నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి.
5 నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు త్రోసివేసాము.
నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము.
6 నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను.
నా ఖడ్గం నన్ను రక్షించజాలదు.
7 దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు.
మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు.
8 మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము!
నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము!
9 కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు.
నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.
10 మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు.
మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు.
11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్మల్నిచ్చి వేశావు.
రాజ్యాల మధ్య నీవు మమ్మల్ని చెదరగొట్టావు.
12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు.
ధర విషయం నీవేమీ వాదించలేదు.
13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు.
మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు.
14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము.
ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు.
15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను.
రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను.
16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు.
నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు.
17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు.
అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు.
మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు!
18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు.
నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు.
19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్మల్ని చితుక గొట్టావు.
మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్మల్ని కప్పివేశావు.
20 మా దేవుని పేరు మేము మరచిపోయామా?
అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు!
21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు.
లోతైన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు.
22 దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము!
చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము.
23 నా ప్రభువా, లెమ్ము!
నీవేల నిద్రపోతున్నావు?
లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము!
24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు?
మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు?
25 బురదలోకి మేము త్రోసివేయబడ్డాము.
మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము.
26 దేవా, లేచి మాకు సహాయం చేయుము!
నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.
ఆకాను పాపం
7 అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. యూదా వంశానికి చెందిన జబ్ది మనుమడు, కర్మి కుమారుడు ఆకాను అనే పేరుగలవాడు ఒకడు ఉన్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నింటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది.
2 వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి[a] పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపించాడు. బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉంది హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ మనుష్యులు వెళ్లారు.
3 తర్వాత ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మనకు మన మనుష్యులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి రెండువేల మంది లేక మూడు వేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరాడేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” అన్నారు వారు.
4-5 కనుక సమారు మూడువేల మంది మనుష్యులు హాయికి వెళ్లారు. కాని హాయివారు ఇశ్రాయేలు మనుష్యులను 36 మందిని చంపివేసారు. పైగా ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. హాయివాళ్లు తమ పట్టణ ద్వారాల దగ్గరనుండి షేబారీమువరకు వాళ్లను తరిమివేసారు. హాయివాళ్లు వారిని బాగా కొట్టివేసారు.
ఇశ్రాయేలు ప్రజలు అది చూసి, చాలా భయపడిపోయారు, ధైర్యం కోల్పోయారు. 6 యెహోషువ ఇది విని, తన బట్టలు చింపుకొని, పవిత్ర పెట్టె ముందర నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి పోసుకొన్నారు.
7 అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యొర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యొర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది. 8 నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు. 9 కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?”
10 యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు నీవు సాష్టాంగ పడతావు? 11 ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేసారు. వాళ్లు విధేయులు కావాలని నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు కొన్ని తీసుకొన్నారు. వారు నా దగ్గర దొంగతనం చేసారు. వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ వస్తువుల్ని వాళ్లు వారికోసం దాచుకొన్నారు. 12 అందుచేతనే ఇశ్రాయేలు సైన్యం యుద్ధంలో ఓడిపోయి పారిపోయింది. వారు తప్పు చేసినందువల్లనే ఇలా జరిగింది. వాళ్లు నాశనం కావాలి. నేను ఇంక మీకు సహాయం చేయను. మీరు నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే తప్ప నేను ఇక మీదట మీకు తోడుగా ఉండును.
13 “ఇప్పుడు వెళ్లి, ప్రజలను పవిత్రం చేసి, ప్రజలతో ఇలా చెప్పు, ‘మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపటికోసం సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు నాశనం చేయుమని ఆజ్ఞాపించిన వాటిని కొంత మంది దాచిపెట్టుకొన్నారని ఆయన చెబుతున్నాడు. వాటిని మీరు పారవేసేటంతవరకు మీరెన్నటికీ మీ శత్రువుల్ని ఓడించలేరు.
ప్రేమ
8 తోటివాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి. 9 “వ్యభిచారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం చెయ్యరాదు; ఇతర్లకు చెందిన వాటిని ఆశించరాదు”(A) అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి. 10 ప్రేమ పొరుగు వానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్నదాన్ని ప్రేమ సాధిస్తుంది.
11 యేసు క్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్రనుండి మేలుకోండి. 12 రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చీకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయుధాల్ని ధరించండి. 13 పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి. 14 యేసు క్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.
యేసు ఏకాంతంగా ప్రార్థించటం
(మార్కు 14:32-42; లూకా 22:39-46)
36 ఆ తర్వాత యేసు శిష్యులతో కలసి గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళతో, “ఇక్కడే కూర్చోండి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాను” అని అన్నాడు. 37 యేసు పేతుర్ని, జెబెదయి యొక్క యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం చెందింది. 38 అప్పుడాయన వాళ్ళతో, “నా ఆత్మ మరణ వేదన పొందుతోంది. ఇక్కడే ఉండి నాతో సహా మేలుకొని ఉండండి” అని అన్నాడు.
39 యేసు యింకా కొంత దూరం వెళ్ళి సాష్టాంగపడి, “నా తండ్రి! వీలైతే దుఃఖంతో నిండిన ఈ పాత్రను నా నుండి తీసివేయి! అయినా నెరవేరవలసింది నా యిచ్ఛకాదు, నీది” అని అంటూ ప్రార్థించాడు. 40 ఆ తర్వాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయన, “నాతో సహా ఒక గంట సేవు మేలుకోలేక పొయ్యారా?” అని అన్నాడు. 41 “మెలకువగా ఉండి ప్రార్థించండి! అప్పుడే మీరు దుష్ప్రేరేపణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో అన్నాడు.
42 ఆయన రెండవసారి వెళ్ళి, “నా తండ్రీ! ఈ పాత్రలోవున్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాన్ని త్రాగుతాను. నీ యిష్టమే నెరవేరు గాక!” అని ప్రార్ధించాడు.
43 ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్ళీ నిద్రిస్తుండటం గమనించాడు. కళ్ళు బరువెక్కటంవల్ల వాళ్ళు నిద్రనాపుకోలేక పోయారు. 44 ఆయన మూడవ సారి వాళ్ళను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినట్లే మళ్ళీ ప్రార్ధించాడు.
45 ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు వచ్చి, “మీరింకా నిద్రిస్తూ, విశ్రాంతి తీసుకొంటున్నారా. చూడండి! మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది. 46 వెళ్దాం, లేవండి. అదిగో! నాకు ద్రోహం చేయనున్నవాడు వస్తున్నాడు!” అని అన్నాడు.
© 1997 Bible League International