Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 63

దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.

63 దేవా, నీవు నా దేవుడవు.
    నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
    నీకొరకు దాహంగొని ఉన్నాయి.
అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
    నీ బలము నీ మహిమలను నేను చూశాను.
నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
    నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
    నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
    రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
    నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
    నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
    వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
    అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
    ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.

కీర్తనలు. 98

స్తుతి కీర్తన.

98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
    గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
    ఆయనకు విజయం తెచ్చింది.
యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
    యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
    రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
    త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
    స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
బూరలు, కొమ్ములు ఊదండి.
    మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
భూమి, సముద్రం, వాటిలో ఉన్న
    సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
నదులారా, చప్పట్లు కొట్టండి.
    పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
    గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
    నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.

కీర్తనలు. 103

దావీదు కీర్తన.

103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
    నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
    ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
    మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
    ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
    ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
యెహోవా న్యాయం కలవాడు.
    ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
    తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
    దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
    యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
    కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
    తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
    దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
    అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
    మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
    మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16     ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
    త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
    దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18     దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
    దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
    మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
    దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
    మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
    మీరు ఆయన సేవకులు,
    దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
    అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!

యెహోషువ 6:15-27

15 ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. 16 పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు! 17 ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యెహోవాదే.[a] వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు. 18 మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు. 19 వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యెహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.”

20 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు. 21 ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు.

22 ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపించిన ఇద్దరు మనుష్యులతో యోహోషువ మాట్లాడాడు: “ఆ వేశ్య ఇంటికి వెళ్లండి. ఆమెను బయటకు తీసుకొని రండి. మరియు ఆమెతో ఉన్న వాళ్లందరినీ బయటకు తీసుకొని రండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం ప్రకారం మీరు ఇలా చేయండి.”

23 కనుక ఆ ఇద్దరు మనుష్యులూ ఆ ఇంట్లోకి వెళ్లి, రాహాబును బయటకు తీసుకొని వచ్చారు. ఆమె తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, ఆమెతో ఉన్న వాళ్లందర్నీ వారు బయటకు తీసుకొనివచ్చారు. ఆ మనుష్యులందరినీ ఇశ్రాయేలీయుల పాళెము వెలుపల క్షేమకరమైన చోట వారు ఉంచారు.

24 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం మొత్తాన్ని తగులబెట్టేసారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుముతో చేయబడినవి తప్ప ఆ పట్టణంలో ఉన్న వాటన్నింటినీ వారు కాల్చేసారు. ఇవన్నీ యెహోవా కోసం భద్రం చేయబడ్డాయి. 25 వేశ్య రాహాబును, ఆమె కుటుంబాన్ని, ఆమెతో ఉన్నవారందరినీ యెహోషువ రక్షించాడు. యెరికోను వేగు చూచేందుకు యెహోషువ పంపిన మనుష్యులకు రాహాబు సహాయం చేసింది కనుక యెహోషువ వారిని బ్రదుకనిచ్చాడు. నేటికీ రాహాబు ఇశ్రాయేలు ప్రజల్లో సజీవంగా ఉండిపోయింది.

26 ఆ సమయంలోనే ముఖ్యమైన ఈ వాగ్దానం యెహోషువ చేసాడు:

“ఈ యెరికో పట్టణాన్ని మరల ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే
    వారు యెహోవా వలన ప్రమాదానికి గురి అవుతారు.
ఈ పట్టణానికి పునాది వేసే మనిషి
    తన పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకుంటాడు.
ద్వారాలు నిలబెట్టేవాడు
    తన చిన్న కుమారుణ్ణి పోగొట్టుకొంటాడు.”

27 కనుక యెహోవా, యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరియు యెహోషువ ఆ దేశం అంతటా ప్రసిద్ధి చెందాడు.

అపొస్తలుల కార్యములు 22:30-23:11

పౌలు యూదుల నాయకులతో మాట్లాడటం

30 అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకొన్నాడు. కనుక మరుసటి రోజు ప్రధానయాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు.

23 పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు. ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.

పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళు, “దేవుని ప్రధానయాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు.

అందుకు పౌలు, “సోదరులారా! ప్రధానయాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’”(A)

పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు.

అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు. సద్దూకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు. సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు.

10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.

11 ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోమాలో కూడా బోధించాలి” అని అన్నాడు.

మార్కు 2:1-12

యేసు పక్షవాత రోగిని నయం చేయటం

(మత్తయి 9:1-8; లూకా 5:17-26)

కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు.

అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు.

వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, 11 “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.

12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International