Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 38

జ్ఞాపకార్థ దినం[a] కోసం దావీదు కీర్తన.

38 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు.
    నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
యెహోవా, నీవు నన్ను బాధించావు.
    నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.
    నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
నేను చెడు కార్యాలు చేసిన దోషిని,
    ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
నేను తెలివితక్కువగా ఉన్నాను.
    ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.
    రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
నా నడుము వేడిగా కాలిపోతోంది.
    నా శరీరం అంతా బాధగా ఉంది.
నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.
    నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.
    నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది.
    నా చూపు దాదాపు పోయింది.
11 నా రోగం మూలంగా నా స్నేహితులు,
    నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు.
    నా కుటుంబం నా దగ్గరకు రాదు.
12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.
    నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను.
    మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను.
    నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.
    నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.
    నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.
    నేను నా బాధను మరచిపోలేను.
18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.
    నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,
    వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
20 నా శత్రువులు నాకు కీడు చేశారు,
    నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను.
మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను.
    కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.
    నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
    నా దేవా, నన్ను రక్షించుము.

కీర్తనలు. 119:25-48

దాలెత్

25 నేను త్వరలోనే చనిపోతాను.
    యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
26 నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు.
    ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
27 యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను.
    ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము,
    నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను.
    జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
31 యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను.
    నన్ను నిరాశ పరచవద్దు.
32 నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను.
    యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.

హే

33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
    నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
    నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
    నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
    నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
    నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
    నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
    జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
    నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.

వావ్

41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
    నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
    యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
    ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
    వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
    ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
    మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.

యెహోషువ 3:1-13

యొర్దాను నదిలో అద్భుత కార్యం

మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ లేచి, షిత్తీము విడిచి పెట్టారు. యొర్దాను నదికి వారు ప్రయాణం చేసారు. నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యొర్దాను నది దగ్గర గుడారాలు వేసారు. మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు. నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను[a] యాజకులు, లేవీయులు[b] మోయటం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి. కాని, మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 1,000 గజాలు[c] వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు.

అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు.

తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసుకొనిపోయారు.

అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు. యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, ‘యొర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి.’”

అంతట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు: “రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి. 10 జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే ఋజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే ఋజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల గొట్టేస్తాడు. 11 ఇదే ఋజువు. మీరు యొర్దాను దాటేటప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది. 12 ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకొనండి. 13 సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యొర్దాను నదిలోనికి మోసుకొని వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యొర్దాను నదీ ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి, ఆ స్థలానికి వెనుక ఆనకట్ట వేసినట్టు నిలిచిపోతాయి.”

రోమీయులకు 11:25-36

25 సోదరులారా! మీరు తెలుసుకోవాలని మీకీ రహస్యం చెప్పాలనుకొంటున్నాను. మీరు అజ్ఞానులుగా ఉండటం నాకిష్టం లేదు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత్వంతో ఉన్నారు. నాటబడాలని కోరుకొంటున్న యూదులుకాని ప్రజలు నాటబడే వరకు ఈ మూర్ఖత్వం వీళ్ళలో ఉంటుంది. 26 శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు:

“రక్షకుడు సీయోను నుండి వస్తాడు;
    అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు.
27 నేను వాళ్ళ పాపాలను తొలగించినప్పుడు,
    వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.”(A)

28 ఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎన్నుకొన్నవాళ్ళు కనుక, వాళ్ళ మూలపురుషుల్ని బట్టి వాళ్ళు ప్రేమించబడ్డారు. 29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, “పిలుపు” విషయంలో మనస్సు మార్చుకోడు. 30 యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది. 31 అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అందువల్ల, మీకు లభించిన అనుగ్రహం ద్వారా వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది. 32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు.

స్తుతి

33 దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.

34 “ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు?
    ఆయనకు సలహా చెప్పేవాడెవరు?”(B)

35 “దేవునికి ఎవరు అప్పిచ్చారు?
    ఆయన ఎవరికీ ఋణపడలేదు.”(C)

36 అన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

మత్తయి 25:31-46

మనుష్యకుమారుడు అందరికి తీర్పు తీర్చటం

31 “తేజోవంతుడైన మనుష్యకుమారుడు తన దేవదూతలతో కలసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన సింహాసనంపై కూర్చుంటాడు. 32 ప్రజలందర్ని సమావేశ పరచి గొఱ్ఱెల కాపరి మేకల్లో నుండి గొఱ్ఱెల్ని వేరు చేసినట్లు వాళ్ళను వేరుచేస్తాడు. 33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు.

34 “అప్పుడా రాజు తన కుడి వైపునున్న వాళ్ళతో, ‘రండి! నా తండ్రి ఆశీర్వాదాలను మీరు పొందారు. మీ రాజ్యాన్ని తీసుకొండి. ప్రపంచం సృష్టింపబడినప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు. 35 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు. 36 దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు’ అని అంటాడు.

37 “అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము? 38 మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము? 39 మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పుడువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము?’ అని అడుగుతారు.

40 “ఆ రాజు, ‘ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను’ అని సమాధానం చెబుతాడు.

41 “ఆ తర్వాత ఆ రాజు తన ఎడమ వైపునున్న వాళ్ళతో, ‘శాపగ్రస్తులారా! వెళ్ళి పొండి! సైతాను కొరకు, వాని దూతలకొరకు సిద్ధం చేయబడిన శాశ్వతమైన మంటల్లో పడండి. 42 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు. 43 నేను పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించలేదు. నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు దుస్తుల్ని యివ్వలేదు. నేను జబ్బుతో కారాగారంలో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు’ అని అంటాడు.

44 “అప్పుడు వాళ్ళు కూడా, ‘ప్రభూ! మీరు ఆకలిగావున్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్న వానిగా కాని లేక చెరసాలలో ఉన్నట్టుకాని ఎప్పుడు చూసాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు సహాయం చెయ్యలేదు?’ అని అంటారు.

45 “ఆయన, ‘ఇది సత్యం. హీనస్థితిలో ఉన్నవానికి మీరు సహాయం చెయ్యలేదు. కనుక నాకు సహాయం చెయ్యనట్లే’ అని చెబుతాడు.

46 “వాళ్ళు వెళ్ళి శాశ్వతంగా శిక్షను అనుభవిస్తారు. కాని నీతిమంతులు అనంత జీవితం పొందుతారు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International