Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:1-24

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

కీర్తనలు. 12-14

సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.

12 యెహోవా, నన్ను రక్షించుము!
    మంచి మనుష్యులంతా పోయారు.
    భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
    ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
    పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
    అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.

కాని యెహోవా చెబుతున్నాడు,
    “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
    కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”

యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
    నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
    కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.

యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
    ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
    ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
    నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
    ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
    నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
    నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
    నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
    కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
    బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
    వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
    వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
    (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
    మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
    మంచి పనులు చేయలేదు.

దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
    ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
    దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
    ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
    కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
    ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
    ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
    ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

ద్వితీయోపదేశకాండము 1:1-18

ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడటం

ఇది ఇశ్రాయేలు ప్రజలకు మోషే యిచ్చిన సందేశం. వారు యొర్దాను నదికి తూర్పువైపునగల అరణ్యంలో ఉన్నప్పుడు అతడు ఈ విషయాలు వారితో చెప్పాడు. వారు అరాబా లోయలో ఉన్నారు. ఇది సూపుకు అవతల పారాను అరణ్యమునకు, తోపెలు, లాబాను, హజెరోతు, దీజాహాబు పట్టణాలకు మధ్యవుంది.

హోరేబు కొండనుండి (సీనాయి) కాదేషు బర్నేయాకు శేయీరు కొండలద్వారా ప్రయాణం పదకొండు రోజులు మాత్రమే పడుతుంది. అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పటినుండి ఈ స్థలంలో మోషే వీరితో మాట్లడినప్పటికి 40 సంవత్సరాలు పట్టింది. అది 40వ సంవత్సరం, 11వ నెల ఒకటవ తేది. వారితో చెప్పమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ మోషే వారితో మాట్లాడినప్పుడు చెప్పాడు. ఇది సీహోనును, ఓగును యెహోవా ఓడించిన తర్వాత జరిగిన సంగతి. సీహోను అమోరీయుల రాజు. సీహోను హెష్బోనులో నివసించాడు. ఓగు బాషాను రాజు. ఓగు అష్పారోతు, ఎద్రేయిలో నివసించాడు. ఇప్పుడు వారు యొర్దాను నదికి తూర్పున మోయాబు దేశంలో ఉన్నారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మోషే వివరించటం మొదలుబెట్టాడు. మోషే ఇలా చెప్పాడు:

“మన దేవుడైన యెహోవా హోరేబు (సీనాయి) కొండమీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, ‘ఈ కొండ దగ్గర మీరు యిప్పటికి చాలా కాలంనుండి నిలిచి ఉన్నారు. కదిలిపోయేందుకు సర్వ సిద్ధంగా ఉండండి. అమోరీయుల కొండ దేశానికి, దాని చుట్టూవున్న యొర్దాను లోయ, కొండ దేశం, పశ్చిమ పల్లపు ప్రాంతాలు, నెగెవు, సముద్రతీర ప్రాంతం అన్ని చోట్లకూ వెళ్లండి, కనానీ ప్రజల దేశానికి వెళ్లండి, యూఫ్రటీసు మహానది వరకు లెబానోనుకు వెళ్లండి. చూడండి, ఈ దేశమంతా నేను మీకు ఇచ్చాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధీనం చేనుకోండి. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేసిన దేశం యిదే. వారికి, వారి సంతతివారికి ఈ దేశాన్ని యిస్తానని నేను వాగ్దానం చేశాను.’”

మోషే నాయకులను ఎంపిక చేయుట

అప్పుడు మోషే అన్నాడు: “‘ఆ సమయంలో నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఒంటరిగా మీ విషయంలో శ్రద్ధ తీసుకోలేనని నేను చెప్పాను. 10 మీ దేవుడైన యెహోవా ఇంకా మరింతమంది ప్రజలను అధికం చేయటంతో నేడు మీరు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నారు. 11 మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకా 1,000 రెట్లు పెంచునుగాక! ఆయన మీకు చేసిన వాగ్దానం ప్రకారమే ఆయన మిమ్మల్ని ఆశీర్వాదించుగాక! 12 కానీ నేను మీ విషయం శ్రద్ధ తీసుకోలేను, నేనొక్కడనే మీ వివాదాలు తీర్చలేను. 13 కనుక ప్రతి వంశంనుండి కొందరు ప్రతినిధులను ఎన్నుకోండి, నేను వారిని మీమీద నాయకులుగా చేస్తాను. అవగాహన, అనుభవం ఉన్న జ్ఞానులను ఎన్నుకోండి’ అని మీతో చెప్పాను.

14 “దానికి అలా చేయటం ‘మంచిదే అనుకొంటున్నాము’ అని మీరు అన్నారు.

15 “కనుక మీరు మీ వంశాలనుండి ఎన్నుకొన్న అవగాహన, అనుభవమున్న జ్ఞానులను మీకు నాయకులుగా నేను చేసాను. వారిలో కొందరిని 1,000 మందికి నాయకులుగాను, కొందరిని 100 మందికి నాయకులుగాను, కొందరిని 50 మందికి నాయకులుగాను, కొందరిని 10 మందికి నాయకులుగాను నేను చేసాను. నేను వారిని మీ వంశాలకు అధికారాలుగా చేసాను.

16 “ఈ నాయకులను మీకు న్యాయమూర్తులుగా ఉండమని అప్పట్లో నేను వారితో చెప్పాను. ‘మీ ప్రజల వాదాలు వినండి. ఒక్కో వ్యాజ్యెమును సరిగ్గా విచారణ చేయండి. సమస్య ఇశ్రాయేలీయుల ఇద్దరి మధ్యకావచ్చును, లేక ఒక ఇశ్రాయేలు వ్యక్తికీ, మరో పరాయి వ్యక్తికీ మధ్య అయినా సరే పర్వాలేదు. మీరు ప్రతి వ్యాజ్యమును సరిగ్గా విచారణ చేయాలి. 17 మీరు విచారణ జరిపేటప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికంటె ముఖ్యమైనవాడని మీరు తలచకూడదు. ప్రతివ్యక్తి పైనా ఒకే విధంగా విచారణ జరిగించాలి. మీ నిర్ణయం దేవుని నుండి వస్తుంది. కనుక, ఎవరిని గూర్చి భయపడవద్దు. అయితే మీరు విచారణ జరిపేందుకు ఒక వ్యాజ్యము కష్టతరంగా ఉంటే, దానిని నా దగ్గరకు తీసుకొని రండి. నేను దానిని విచారిస్తాను.’ 18 మీరు చేయాల్సిన ఇతర విషయాలన్నింటినీ ఆ సమయంలోనే నేను మీతో చెప్తాను.

రోమీయులకు 9:1-18

దేవుడు, తాను ఎన్నుకొన్న ప్రజలు

క్రీస్తు పేరట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేసాడు. మూల పురుషులు వీళ్ళ వంశానికి చెందినవాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక! ఆమేన్!

ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు. లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.”(A) ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది. ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.”(B)

10 అంతేకాదు. రిబ్కాకు, మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు. 11-12 కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, “పెద్దవాడు, చిన్నవానికి సేవ చేస్తాడు”(C) అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్ళు మంచి, చెడు, చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం పిలిచాడు. కాని, ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై ఆధారపడలేదన్న మాట. 13 ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.”(D)

14 మరి, మనమేమనాలి? దేవుడు అన్యాయం చేసాడా? లేదు. 15 ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపిస్తాను.”(E) 16 అందువల్ల ఇది మానవుని అభీష్టంపై కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది. 17 లేఖనము ఫరోతో ఈ విధంగా అంటుంది: “నీ ద్వారా నా శక్తి వ్యక్తం చెయ్యాలనీ, ప్రపంచమంతా నా పేరు ప్రకటింపబడాలనీ, నేను నిన్ను రాజుగా చేసాను.”(F) 18 అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు.

మత్తయి 23:27-39

27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.

29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!

33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.

35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.

యెరూషలేము విషయంలో దుఃఖించటం

(లూకా 13:34-35)

37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International